Share News

ఉద్యోగ మేళాకు భారీ స్పందన

ABN , Publish Date - Oct 11 , 2026 | 02:36 AM

ఒంగోలులో శనివారం నిర్వహించిన కౌశలం ఉద్యోగ మేళాకు విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూ లల నుంచి నిరుద్యోగ యువతీ, యువకులు భారీగా తరలివచ్చారు. స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు కార్యాలయాల ద్వారా కౌశలం కార్యక్రమం ద్వారా నమోదు చేసుకున్న వారికి ఇంటర్వ్యూలను నిర్వహించారు.

ఉద్యోగ మేళాకు భారీ స్పందన
ఉద్యోగ నియామకపత్రాలు అందుకున్న వారితో అధికారులు, కంపెనీల ప్రతినిధులు

జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన యువతీ, యువకులు

ఇంటర్వ్యూలు నిర్వహించిన వివిధ కంపెనీల ప్రతినిధులు

ఒంగోలు కలెక్టరేట్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ఒంగోలులో శనివారం నిర్వహించిన కౌశలం ఉద్యోగ మేళాకు విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూ లల నుంచి నిరుద్యోగ యువతీ, యువకులు భారీగా తరలివచ్చారు. స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు కార్యాలయాల ద్వారా కౌశలం కార్యక్రమం ద్వారా నమోదు చేసుకున్న వారికి ఇంటర్వ్యూలను నిర్వహించారు. రాష్ట్రంలో యువతీ, యువకులకు ఉద్యోగావకాశాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కౌశలం ద్వారా నమోదు చేసుకున్న యువతకు పరీక్షలు నిర్వహించి అందులో అర్హత సాధించిన వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు సంబంధిత కంపెనీలతో జాబ్‌మేళాను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లోని మీకోసం హాలులో శనివారం స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు అధికారి ఎం.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇది జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ నూకసాని బాలాజీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అపోలో టైర్స్‌ లిమిటెడ్‌, టాటా ఎలకా్ట్రనిక్స్‌ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నదన్నారు. విద్యార్హతలకు అనుగుణంగా ఆయా కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నందున జిల్లాలోని నిరుద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో 2,100 మందిపైగా కౌశలం కార్యక్రమం ద్వారా అర్హత సాధించగా వారందరికీ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో కూడా ఈ కార్యక్రమం ద్వారా వారి విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో 2కామ్స్‌ కన్సల్టింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ మేనేజర్‌ మినహాజ్‌ తదితరులు పాల్గొన్నారు. శనివారం ఇంటర్వ్యూకు 857 మంది హాజరుకాగా వారిలో 156 మందికి ఉద్యోగ నియామకపత్రాలు అందజేశారు.

Updated Date - Oct 11 , 2026 | 02:37 AM