Share News

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ వేగవంతం

ABN , Publish Date - Mar 14 , 2026 | 02:56 AM

పెరుగుతున్న సర్వైకల్‌ క్యాన్సర్‌ ముప్పును తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఆధ్వర్యంలో జిల్లాలోని 14నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను వైద్యారోగ్యశాఖ ప్రారంభించింది. మూడు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో కార్యక్రమాన్ని అధికారులు వేగవంతం చేశారు.

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ వేగవంతం
చందలూరులో టీకా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న టీడీపీ ఇన్‌చార్జి లక్ష్మి

సర్వైకల్‌ క్యాన్సర్‌ ముప్పును తగ్గించడమే లక్ష్యం

జిల్లాలో 14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలు 11,814 మంది

581 మందికి ఇప్పటి కే టీకా వేయడం పూర్తి

ఒంగోలు కలెక్టరేట్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : పెరుగుతున్న సర్వైకల్‌ క్యాన్సర్‌ ముప్పును తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఆధ్వర్యంలో జిల్లాలోని 14నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను వైద్యారోగ్యశాఖ ప్రారంభించింది. మూడు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో కార్యక్రమాన్ని అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే గ్రామాల వారీగా 14 నుంచి 15 ఏళ్ల బాలికల వివరాలను సేకరించారు. ఆయా పీహెచ్‌సీల పరిధిలో బాలికల తల్లిదండ్రుల సహకారంతో ఈ వ్యాక్సిన్‌ వేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఈనెల 8న ఒంగోలులో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో కలెక్టర్‌ రాజాబాబు ఆ వ్యాక్సినేషన్‌ను లాంఛనంగా ప్రారం భించారు. ప్రకాశం జిల్లాలో 11,814 మంది బాలికలు ఉన్నట్లు వైద్యశాఖ గుర్తించింది. ఆమేరకు వ్యాక్సిన్‌ను ప్రభుత్వం జిల్లాలకు పంపింది. జిల్లాకేంద్రం నుంచి ఆయా పీహెచ్‌సీల వారీగా వ్యాక్సినేషన్‌ను సరఫరా చేశారు. దానిని పీహెచ్‌సీల్లో మాత్రమే వేయాల్సి ఉండటంతో బాలికలను అక్కడకు తీసుకు వచ్చి వ్యాక్సిన్‌ వేసిన తర్వాత పంపుతున్నారు. గత నాలుగైదు రోజుల వ్యవధిలోని జిల్లావ్యాప్తంగా 581 మందికి వ్యాక్సిన్‌ వేశారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ వేయించుకోవాల్సిన బాలికల్లో ఎక్కువశాతం మంది పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలు రాసే బాలికలు కొంతమంది ముందుగానే వచ్చి వ్యాక్సిన్‌ వేయించుకుంటుండగా మరికొందరు వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఈ ప్రక్రియను మూడు నెలల్లో ముగించాలని ఆదేశాలు జారీచేయడంతో తదనుగుణంగా పరీక్షల ముగిసిన అనంతరం బాలికలు వ్యాక్సిన్‌ వేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మధ్యలో ఆయా పీహెచ్‌సీలకు వస్తే వ్యాక్సిన్‌ వేసేలా ఏర్పాట్లు చేశారు.

Updated Date - Mar 14 , 2026 | 02:57 AM