పదిలమెలా?
ABN , Publish Date - Apr 07 , 2026 | 02:22 AM
రాజకీయ నేతల దృష్టి అంతా నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రీకృతమైంది. దీంతో ఇప్పటి వరకూ ఉన్న సమాచారానికి అనుగుణంగా సీనియర్ నాయకులు మండలాల వారీ బలాబలాలపై కూడికలు, తీసివేతల్లో మునిగిపోయారు. కొత్తవారికి అవకాశాలు పెరుగుతాయన్న ఆశతో ఔత్సాహికులు సైతం ఆ వైపు దృష్టి సారించారు.
అందరి దృష్టి పునర్విభజన వైపే
జిల్లాలో పెరగనున్న నియోజకవర్గాలు
కూడికలు, తీసివేతల్లో సీనియర్లు
ఔత్సాహికులకు లభించనున్న అవకాశాలు
జనాభాతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్
కొందరు సిట్టింగ్ శాసనసభ్యులకు స్థానాలు మారే అవకాశం
రాజకీయ నేతల దృష్టి అంతా నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రీకృతమైంది. దీంతో ఇప్పటి వరకూ ఉన్న సమాచారానికి అనుగుణంగా సీనియర్ నాయకులు మండలాల వారీ బలాబలాలపై కూడికలు, తీసివేతల్లో మునిగిపోయారు. కొత్తవారికి అవకాశాలు పెరుగుతాయన్న ఆశతో ఔత్సాహికులు సైతం ఆ వైపు దృష్టి సారించారు. నియోజకవర్గాల వారీ ఓటర్ల సంఖ్యతో సంబంధం లేకుండా వరుస సంఖ్య ఆధారంగా మహిళా రిజర్వేషన్ అమలు చేయబోతున్నందున కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పోటీ చేసే అవకాశం కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది.
ఆంధ్రజ్యోతి, ఒంగోలు
దేశవ్యాప్తంగా లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. ప్రధానంగా ఆయా స్థానాలలో ఇప్పుడు ఉన్న ఓటర్ల సంఖ్యను తగ్గించి అటు లోక్‌సభ, ఇటు శాసనసభ సీట్లను పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈనెల 16 నుంచి మూడురోజులపాటు జరిగే లోక్‌సభ సమావేశాలలో బిల్లును కూడా ఆమోదించబోతున్నారు. ఆ ప్రకారం రాష్ట్రంలో కూడా పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలు భారీగా పెరగనున్నాయి. అలాగే 33శాతం మహిళా రిజర్వేషన్ కూడా అమలుకాబోతోంది.
ప్రస్తుత జిల్లాల పరిధిలోనే..
పునర్విభజనకు జిల్లాల పరిధిని సరిహద్దులుగా తీసుకోరు. అయితే అసెంబ్లీ స్థానాలకు మాత్రం ప్రస్తుత జిల్లాల పరిధులకనుగుణంగానే పునర్విభజన చేయబోతున్నారు. ఆయా జిల్లాల పరిధిలోనే అసెంబ్లీ స్థానాలు ఏర్పాటవుతాయి తప్ప రెండు జిల్లాల ప్రాంతాలను కలిపి ఏర్పాటు చేయరు. దానికి అనుగుణంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలుతోపాటు మార్కాపురం లోక్‌సభ స్థానం వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం నెల్లూరు లోక్‌సభ పరిధిలో ఉంది. భవిష్యత్తులో ఆ నియోజకవర్గం అక్కడే ఉంటుందా? లేక ఒంగోలులో కలుస్తుందా? అనేది ఇప్పుడే అంచనా వేయలేని పరిస్థితి. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని ప్రాంతాలు కొత్తగా ఏర్పడే మార్కాపురం లోక్‌సభ స్థానం పరిధిలోకి వెళ్తే ప్రస్తుతం బాపట్ల లోక్‌సభ స్థానంలో ఉన్న అద్దంకి, సంతనూతలపాడును కలిపి ఒంగోలు, కొండపి నియోజకవర్గాలతో ఒక లోక్‌సభ స్థానాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అప్పుడు అవసరానికి అనుగుణంగా కందుకూరు ఒంగోలు లోక్‌సభ స్థానంలోకి వస్తుందా? లేక కొత్తగా ఏర్పాటుకు అవకాశం ఉన్న కావలి లోక్‌సభలో కలుస్తుందా? అనేది వేచిచూడాలి.
కొత్తగా మార్కాపురం లోక్‌సభ!
ప్రస్తుత ప్రకాశం జిల్లాలో కొత్తగా వచ్చే అసెంబ్లీ స్థానాలు, లోక్‌సభ పరిధిలో ఎంతమంది జనాభా ఉండాలి అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని కందుకూరు ప్రాంతాన్ని ఒంగోలు లోక్‌సభలో చేరుస్తారా? లేక కొత్తగా ఏర్పడే కావలిలో కలుపుతారా? అనేది నిర్ధారణ అవుతుంది. ప్రస్తుత మార్కాపురం నియోజకవర్గంలో మరో కొత్త అసెంబ్లీ నియోజకవర్గం వచ్చినప్పటికీ దర్శి ప్రాంతాన్ని కూడా ఆ పార్లమెంటులో కలిపేందుకు అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. మార్కాపురం లోక్‌సభ కొత్తగా ఏర్పడేందుకు అవకాశం ఉన్నందున దాని విస్తీర్ణం, జనాభా పెరిగితే గిద్దలూరు ప్రాంతాన్ని పూర్వం ఉన్నట్లు నంద్యాల లోక్‌సభలో కలిపేందుకు కూడా అవకాశాలు లేకపోలేదు.
సిట్టింగ్‌లు, సీనియర్లకు పొంచి ఉన్న గండం
మహిళా రిజర్వేషన్‌కు కేంద్రం పచ్చజెండా ఊపుతున్న నేపథ్యంలో వారికి అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు ఎలా కేటాయించాలి అనే విషయంపై తాజాగా ప్రభుత్వం ఓ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనకు 2011 జనాభా ప్రాతిపదికను తీసుకున్నప్పటికీ మహిళా రిజర్వేషన్‌కు ఆ విధానాన్ని అమలు చేయడం లేదు. ప్రస్తుతానికి ఉన్న నిబంధనల మేరకు పునర్విభజన ప్రక్రియను పూర్తిచేసేందుకు రాష్ట్రాల వారీ కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీలో రాష్ట్రానికి సంబంధించిన ఒక ఎంపీ, ఎమ్మెల్యేకు కూడా అవకాశం ఇస్తారు. అలాగే 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలుకు మాత్రం మహిళా జనాభాను ప్రాతిపదికగా తీసుకోరు. రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ముందు వరుస క్రమంలో నెంబర్లు కేటాయిస్తారు. ఆ తర్వాత దళితులు, గిరిజనులకు రిజర్వ్ కావాల్సిన స్థానాలను ఆయా నియోజకవర్గాలలో జనాభా ప్రాతిపదికన నిర్ధారించి వాటిని పక్కనపెడతారు. ఆ తర్వాత జనరల్ కేటగిరీలో ఉన్న అసెంబ్లీ స్థానాలలో వరుస క్రమంలో మొదటి అసెంబ్లీ స్థానానికి డ్రా తీస్తారు. అందులో స్థానం మహిళకు దక్కితే ఆ తర్వాతి వరుస సంఖ్యలోని రెండు స్థానాలను జనరల్‌కు ఉంచుతారు. తిరిగి నాల్గో స్థానాన్ని మహిళకు రిజర్వ్ చేస్తారు. అలా వరుస క్రమంలో ప్రతి మూడు స్థానాలలో ఒకటి మహిళకు రిజర్వ్ అవుతుంది. అలాగే దళితులకు, గిరిజనులకు కేటాయించిన స్థానాలకు కూడా ఇదే పద్ధతి అవలంబిస్తారు. పార్లమెంట్ స్థానాలలో కూడా మహిళా రిజర్వేషన్‌కు కేటాయించే సీట్లకు ఇదే పద్థతి అవలంబించబోతున్నారు. చివరి వరకు ప్రభుత్వం చేర్పులు, మార్పులు చేయకుండా ఇదే పద్ధతిని అవలంబిస్తే మహిళలకు రిజర్వ్ అయ్యే స్థానంలో ఉన్న సిట్టింగ్‌లు, సీనియర్‌లు ఎవరైనా స్థానం కోల్పోక తప్పదు.
సీనియర్ల కూడికలు, తీసివేతలు
కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలలో 1.50 లక్షల మంది జనాభా ఉంటే సరిపోతుంది. అదీ 2011 జనాభా లెక్కల ప్రకారం. దీంతో ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, మాజీలు, ఇతర సీనియర్లు ఆయా నియోజకవర్గాలలో మండలాల వారీ 2011 జనాభా లెక్కలపై దృష్టి సారించారు. అలాగే వ్యక్తిగతంగా తమకు, వారు ప్రాతినిథ్యం వహించే పార్టీకి ఆయా మండలాల వారీ ఉండే బలాబలాలపై కూడా అంచనాలు వేసుకుంటున్నారు. తదనుగుణంగా తమ అభిప్రాయాన్ని వారు ప్రాతినిథ్యం వహించే పార్టీల రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకెళ్లి తమ నియోజకవర్గంలో సదరు మండలాలు ఉండేలా చూడాలని కోరేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక లోక్‌సభ స్థానంతోపాటు ఐదు లేక ఆరు అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నాయి. అలాగే మహిళలకు మూడు అసెంబ్లీ స్థానాలు రిజర్వ్ అవబోతున్నాయి. దళితులకు రిజర్వ్ అయ్యే స్థానాల సంఖ్య ప్రస్తుతం ఉన్నట్లు మూడుగానే ఉండే అవకాశం ఉంది. ఒక అంచనా మేరకు గిరిజనులకు కూడా ఒక నియోజకవర్గం రిజర్వ్ అయ్యే అవకాశం లేకపోలేదు. దీంతో రాజకీయ ఔత్సాహికులకు కూడా అవకాశాలు పెరగబోతున్నాయి.