మనసెలా వచ్చిందో..!
ABN , Publish Date - Jul 12 , 2026 | 02:03 AM
ఏ తల్లి కన్నబిడ్డో.. అలా పడవేయడానికి మనసెలా వచ్చిందో అని చూసిన వారంతా బాధపడ్డారు. ఊరు చివర పొలంలోని గుంతలో గుక్కపెట్టి ఏడుస్తున్న పసికందును చూసిన వారు సకాలంలో స్పందించడంతో క్షేమంగా ఆస్పత్రికి చేరి చికిత్సపొందుతోంది.
పొలంలోని గుంతలో ముక్కుపచ్చలారని పసికందు
ఒంగోలు రిమ్స్‌కు తరలింపు
ఒంగోలు కార్పొరేషన్, జూలై11 (ఆంధ్ర జ్యోతి) : ఏ తల్లి కన్నబిడ్డో.. అలా పడవేయడానికి మనసెలా వచ్చిందో అని చూసిన వారంతా బాధపడ్డారు. ఊరు చివర పొలంలోని గుంతలో గుక్కపెట్టి ఏడుస్తున్న పసికందును చూసిన వారు సకాలంలో స్పందించడంతో క్షేమంగా ఆస్పత్రికి చేరి చికిత్సపొందుతోంది. వివరాల్లో కెళితే.. ముండ్లమూరు గ్రామ శివారులోని పొలంలో ఆడపిల్ల ఏడుస్తూ శనివారం రైతు కంటపడింది. అతను వెంటనే గ్రామస్థులకు సమాచారం ఇవ్వడంతో వారు 108కు, ముండ్ల మూరు ఎస్పై వెంకటేశ్వరరావుకు విషయాన్ని తెలియజేశారు. స్పందించిన ఎస్పై హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ బీవీ.సాగర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సాగర్ బాలల సంర క్షణ అధికారి పి.దినేష్‌కు తెలియజేయగా, ఐసీడీ ఎస్ పీడీ పద్మసునంద ఆదేశాలతో ముండ ్లమూరు అంగన్వాడీ సూపర్‌వైజర్ బి.ఇంద్ర, కార్యకర్త కల్పన, హెల్ప్ సిబ్బంది టి.దుర్గాభ వాని, విమల్లేశ్వరిలు ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే పాపను ప్రాథమిక చికిత్స నిమిత్తం మొదట ముండ్లమూరు పీహెచ్‌సీకి, తర్వాత అద్దంకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలిం చారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. వైద్యులు డాక్టర్ మాధవి, డాక్టర్ తిరుపతిరెడ్డి పరీక్షించి పాప ప్రాణానికి ఎటువంటి హానీ లేదన్నారు. అవసరమైన వైద్యం అందిస్తామని చెప్పారు. పాప పూర్తిగా కోలుకున్న తర్వాత సంరక్షణ నిమిత్తం ఒంగోలు రామనగర్‌లోని మాతా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శిశుగృహానికి తరలిస్తామని అధికారులు తెలిపారు. అయితే ఆ పాపను ఎవరు పడేశారు? ఎందుకు పడేశారు? అన్నదానిపై ముండ్లమూరు ఎస్పై విచారణ ప్రారంభించారు.