Share News

పార్టీలకు అతీతంగా పేదలకు ఇళ్లు

ABN , Publish Date - Oct 01 , 2026 | 10:42 PM

పార్టీలు, కులాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ ఇళ్లు మంజూరు చేస్తున్నామని మంత్రి స్వామి పేర్కొన్నారు.

పార్టీలకు అతీతంగా పేదలకు ఇళ్లు
ఇళ్ల మంజూరు పత్రాలను అందజేస్తున్న మంత్రి స్వామి, హౌసింగ్‌ పీడీ ప్రసాద్‌

మంత్రి స్వామి

పీఎంఏవై పథకం కింద 229 మందికి మంజూరు పత్రాల పంపిణీ

కొండపి, అక్టోబరు1 (ఆంధ్రజ్యోతి): పార్టీలు, కులాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ ఇళ్లు మంజూరు చేస్తున్నామని మంత్రి స్వామి పేర్కొన్నారు. గురువారం కొండపి మండల పరిషత్‌ సమావేశం హాలులో నియోజకవర్గంలోని 229 మంది లబ్ధిదారులకు పీఎంఎవై కింద మంజూరైన ఇళ్ల మంజూరు పత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014-19 మధ్యకాలంలో ప్రభుత్వం పేదలకిచ్చిన ఇళ్లకు తర్వాత వచ్చిన జగన్‌ ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని ఆరోపించారు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019-24 మధ్యకాలంలో జగన్‌ హయాంలో పేదలకిచ్చిన ఇళ్ల నిర్మాణాల కోసం మంచి మససుతో సీఎం చంద్రబాబు డబ్బులు ఇచ్చారని గుర్తు చేశారు. త్వరలో అదనంగా మరో 150 గృహాలు పేదలకు ఇస్తామన్నారు. ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి రూ.2,89,000 తిరిగి చెల్లించాల్సిన పనిలేకుండా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్‌ హౌసింగ్‌ జిల్లా పీడీ పెరుగు ప్రసాద్‌ మాట్లాడుతూ జిల్లాలో 27,701 మందిని కేంద్రం పక్కా గృహాల మంజూరుకు లబ్ధిదారులుగా గుర్తించిందని, కొండపి నియోజకవర్గంలో 6,333 మంది అర్హులు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో 3 లక్షల మందికి ఇళ్లు కేటాయించనుందన్నారు. సమావేశంలో హౌసింగ్‌ డీఈఈ సత్యనారాయణ, నాయకులు గొర్రెపాటి రామయ్యచౌదరి, కొర్రపాటి వసంతరాయుడు, నన్నూరి సుబ్బరామయ్య, బూదవాటి సోమయ్య, తహసీల్దార్‌ ఎస్‌.శ్రీనివాసరావు, ఎంపీడీవో రామాంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు.


బియ్యం విక్రయ కేంద్రం మూతపై సీరియస్‌

కొండపిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం విక్రయించే కేంద్రం మూసివేయడంపై మంత్రి స్వామి సీరియస్‌ అయ్యారు. స్థానిక మండల కార్యాలయంలో జరిగిన సమావేశంలో స్థానికులు దీనిపై మంత్రికి తెలియజేయడంతో తహసీల్దార్‌ను ప్రశ్నించారు. బియ్యం విక్రయ కేంద్రం వెంటనే పునరుద్ధరించి పేదలకు తక్కువ ధరకు అందించాలని జిల్లా అధికారులను మంత్రి ఫోన్‌లో ఆదేశించారు.

Updated Date - Oct 01 , 2026 | 10:42 PM