Share News

కేశవ్‌పైనే ఆశలు

ABN , Publish Date - Feb 14 , 2026 | 03:03 AM

రానున్న ఆర్థిక సంవత్సరంలో కీలక రంగాలకు నిధులు కేటాయింపు చేసే రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను శనివారం శాసనసభలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రవేశపెట్టనున్నారు. సుమారు 3.35లక్షల కోట్లకుపైగా ఈసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కేశవ్‌పైనే ఆశలు
వెలిగొండ సొరంగంలో జరుగుతున్న పనులు (ఫైల్‌)

నేడు అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదన

కీలక రంగాలకు నిధుల కోసం ఎదురుచూపు

ఉమ్మడి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.1,740 కోట్లు కోరిన అధికారులు

ట్రిపుల్‌ ఐటీ, యూనివర్సిటీల నిర్మాణానికి భారీగా అవసరం

పారిశ్రామిక, ఇతర ప్రాజెక్టులపైనా స్పష్టత ఆశిస్తున్న ప్రజానీకం

రానున్న ఆర్థిక సంవత్సరంలో కీలక రంగాలకు నిధులు కేటాయింపు చేసే రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను శనివారం శాసనసభలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రవేశపెట్టనున్నారు. సుమారు 3.35లక్షల కోట్లకుపైగా ఈసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందులో జిల్లాకు ఏ మేరకు ప్రాధాన్యం ఇస్తారు, ఎంత మేర నిధులు కేటాయిస్తారన్న చర్చ ఆయా వర్గాల్లో సాగుతోంది. గతం కన్నా మెరుగ్గానే ఉండవచ్చన్న ఆశ కీలక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారుల్లో వ్యక్తమవుతోంది.

ఒంగోలు, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో జిల్లాల వారీ చేసే కేటాయింపుల్లో సాగునీటి రంగం ప్రధానమైంది. ఉమ్మడి జిల్లాలోని వెలిగొండ, గుండ్లకమ్మ, పాలేరు రిజర్వాయర్‌, కొరిశపాడు ఎత్తిపోతల, ఎన్‌ఎస్‌పీ కాలువలు, ఇతర మధ్యతరహా ప్రాజెక్టులకు ఈసారి భారీగా నిధుల అవసరం కనిపిస్తోంది. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ పూర్తికి ప్రభుత్వం ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారు. పాలేరు రిజర్వాయర్‌ను తిరిగి పట్టాలెక్కించేందుకు ఆ ప్రాంతం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి కృషి చేస్తున్నారు. కొరిశపాడు ఎత్తిపోతల, గుండ్లకమ్మ ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్‌ పనుల పూర్తి అవసరాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే బీఎన్‌.విజయకు మార్‌లు ఇప్పటికే సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆ రంగానికి రానున్న ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.1,740 కోట్లు కేటాయించాలని సంబంధిత అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అందులో ఒక్క వెలిగొండకే రూ.1,323 కోట్లు కోరారు. గుండ్లకమ్మకు రూ.44కోట్లు, కొరిశపాడు ఎత్తిపోతలకు రూ.81కోట్లు, పాలేరు రిజర్వాయర్‌కు రూ.83కోట్లు అవసరమని నివేదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత బడ్జెట్‌లో ఈ రంగానికి జిల్లాకు రూ.334.2 కోట్లు కేటాయించారు. అయితే వ్యయం మాత్రం రూ.371.60 కోట్లు జరిగింది. మరోవైపు వెలిగొండ తొలిదశ పూర్తికి చర్యలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో నిధుల పెంపు ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నిర్మాణాలకు నిధులే కీలకం

ఇతర అంశాలను పరిశీలిస్తే.. ఏడేళ్లకుపైగా జిల్లాలోని ట్రిపుల్‌ ఐటీ భవన నిర్మాణాలు చేపట్టక అద్దె భవనాల్లో అది కూడా రాష్ట్రంలోని మూడుచోట్ల నడుస్తోంది. జిల్లా పునర్విభజనతో అసలు ట్రిపుల్‌ ఐటీ ఎక్కడన్న వివాదం తెరపైకి వచ్చింది. అయితే అది కనిగిరి ప్రాంతంలోనే అని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దీనికోసం రెండు దశల్లో రూ.600కోట్లు అవసరంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ తాజాగా ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో తొలిదశ పనులకు నిధులు ఈ బడ్జెట్‌లో కేటాయించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రకాశం యూనివర్సిటీకి నిధులు ఇవ్వాల్సి ఉంది. ఇక రెండో దశ కింద ప్రతిపాదించిన కొత్తపట్నం షిఫింగ్‌ హార్బర్‌ నిర్మాణం, దొనకొండ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు నిధులు అవసరం. ఒంగోలు ఎయిర్‌పోర్టుకు రాష్ట్రప్రభుత్వ వాటా ఎంత అన్నది ప్రకటించాల్సి ఉంది. రామాయపట్నం పోర్టు అభివృద్ధి చర్యలు, కనిగిరితోపాటు పశ్చిమ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి చర్యలు, కీలకమైన తాగునీటికి సంబంధించి జలజీవన్‌ మిషన్‌ పనులు, వాటికి నిధులు, ఇతర మౌలిక రంగాలకు సంబంధించి నిధుల కేటాయింపు, ఇతరత్రా ప్రభుత్వ ప్రణాళికలపై ఈ బడ్జెట్‌ ప్రతిపాదనల్లో స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇలాంటి కీలక అంశాలపై శనివారం నాటి బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రాధాన్యత ఇస్తారా? లేక నిరోపనిస్తారా? అన్నది వేచి చూడాల్సి ఉంది.

Updated Date - Feb 14 , 2026 | 03:03 AM