Share News

ఆశాజనకం

ABN , Publish Date - Feb 15 , 2026 | 02:55 AM

ఈసారి రాష్ట్ర బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాకు కొంతమేర ప్రాధాన్యం లభించింది. ఇక్కడి అవసరాలకు పూర్తిస్థాయిలో కాకపోయినా ఆయా రంగాలకు నిధుల కేటాయింపు ఆశాజనకంగా ఉంది. ప్రత్యేకించి కీలకమైన సాగునీటి ప్రాజెక్టులకు గత బడ్జెట్‌తో పోల్చితే 70శాతానికిపైగా నిధులు కేటాయించారు.

ఆశాజనకం
వెలిగొండ మొదటి టన్నెల్‌

రాష్ట్ర బడ్జెట్‌లో సాగునీటి రంగానికి ఊతం

గతం కన్నా 70శాతంపైగా నిధుల పెంపు

వెలిగొండతోపాటు పాలేరు, కొరిశపాడు పథకాలకు ప్రాధాన్యం

అమరావతి ఆర్థిక రీజియన్‌లో ఉమ్మడి జిల్లాకు స్థానం

గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌లో రాయలసీమతోపాటు చేరిక

పలు కీలక పథకాలలో జిల్లా వాటా నిధులకు భరోసా

ఈసారి రాష్ట్ర బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాకు కొంతమేర ప్రాధాన్యం లభించింది. ఇక్కడి అవసరాలకు పూర్తిస్థాయిలో కాకపోయినా ఆయా రంగాలకు నిధుల కేటాయింపు ఆశాజనకంగా ఉంది. ప్రత్యేకించి కీలకమైన సాగునీటి ప్రాజెక్టులకు గత బడ్జెట్‌తో పోల్చితే 70శాతానికిపైగా నిధులు కేటాయించారు. వెలిగొండతోపాటు కొరిశపాడు ఎత్తిపోతల, పాలేరు రిజర్వాయర్‌ పనులకు ప్రాధాన్యత ఇచ్చారు. అదేసమయంలో అమరావతి ఎకనమిక్‌ (ఆర్థిక) రీజియన్‌, రాయలసీమ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌లో ఉమ్మడి జిల్లాను చేర్చడం భవిష్యత్‌కు సానుకూల సంకేతాలు. ఇక ఆయా శాఖల ద్వారా వచ్చే ఉమ్మడి పథకాలతో జిల్లాలోని విభిన్నవర్గాలకు పెద్దఎత్తున మేలు చేకూరనుంది. కీలక పథకాలకు నిధుల భరోసా కనిపిస్తోంది.

ఒంగోలు, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : రానున్న ఏడాది (2026-27) బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శనివారం శాసనసభలోనూ, హోంమంత్రి వంగలపూడి అనిత శాసనమండలిలోనూ ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్‌లో అత్యధికం విద్యారంగానికి కేటాయించారు. ప్రాధాన్యతా రంగాలైన పంచాయతీరాజ్‌ అండ్‌ గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, జలవనరులు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలకే దాదాపు లక్ష కోట్లు కేటాయించారు. బడ్జెట్‌లో ప్రత్యక్షంగా కనిపించేది జలవనరుల శాఖకు కేటాయింపులు కాగా ఆ రంగంలో ఈసారి ఉమ్మడి జిల్లాకు గతం కన్నా మెరుగ్గానే ఉన్నాయి. ఒంగోలు కేంద్రంగా ఉన్న జలవనరులశాఖ పరిధిలోని మొత్తం ప్రాజెక్టుల కోసం గత బడ్జెట్‌లో రూ.138 కోట్లు కేటాయించి రూ.121 కోట్లు ఖర్చుచేయగా ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 181.87కోట్లు కేటాయించారు. అందులో 40శాతానికి పైగా వాటా ఉమ్మడి జిల్లా అవసరాలకు దక్కనున్నాయి.

వెలిగొండ పూర్తే లక్ష్యం

ఒంగోలు ప్రాజెక్టుల సీఈ పరిధిలో ఉన్న వెలిగొండ, గుండ్లకమ్మ, పాలేరు రిజర్వాయర్‌, కొరిశ పాడు ఎత్తిపోతల, ఇతర మీడియం ప్రాజెక్టులకు ఈసారి గతం కన్నా నిధుల కేటాయింపు అధికంగానే ఉంది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం కట్టుబడి ఉందని బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికమంత్రి కేశవ్‌ స్పష్టంగా చెప్పారు. ఈ ప్రాజెక్టుకు గత బడ్జెట్‌లో రూ.309 కోట్లు కేటాయించి ఇప్పటి వరకు రూ.374 కోట్లు ఖర్చుచేశారు. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.492 కోట్లు కేటాయించారు. అలా వెలిగొండకు గత బడ్జెట్‌ కన్నా సుమారు రూ.182కోట్లు అధికంగా ఇచ్చారు. పనుల కోసం రూ.300 కోట్లు, నిర్వాసితు లకు పరిహారం చెల్లింపు, పునరావాస చర్యలకు రూ.192కోట్లు కేటాయించారు. వెలిగొండకు ఇంకా అధికంగానే నిధుల అవసరం ఉన్నప్పటికీ ప్రాజెక్టు ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకున్నట్లు గతం కన్నా అధిక నిధులు కేటాయింపు ద్వారా ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది.

మిగతా ప్రాజెక్టులకూ ప్రాధాన్యం

గుండ్లకమ్మకు గత బడ్జెట్‌లో రూ.15.50కోట్లు కేటాయించి రూ.10కోట్లు వెచ్చించారు. ఈసారి రూ.20 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో కేవలం కోటి ఇచ్చిన కొండపి నియోజకవర్గంలోని పాలేరు రిజర్వాయర్‌కు ఈసారి రూ.25 కోట్లు కేటాయించడం ద్వారా ఆ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్న విషయం స్పష్టమైంది. ఇందుకోసం ఆ ప్రాంతానికి చెందిన మంత్రి డాక్టర్‌ స్వామి సూచనలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే అసంపూర్తిగా ఉన్న కొరిశపాడు ఎత్తిపోతలకు రూ.35 కోట్లు, గుండ్లకమ్మకు రూ.20కోట్లు కేటాయింపు ద్వారా మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తోపాటు సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్‌.విజయకుమార్‌ సూచనలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపించింది.

సంక్షేమానికి భారీగానే నిధులు

వ్యవసాయ, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి, మునిసిపల్‌, విద్య, వైద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు.. ఇలా పలుశాఖల ద్వారా అమలు చేసే పథకాల కింద జిల్లాకు భారీగానే నిధులు రానున్నాయి. అదే సందర్భంలో ఉపాధి హామీ పథకం నూతన చట్టంలో 40శాతం నిధులు రాష్ట్రప్రభుత్వం భరించాల్సి ఉంది. దీని వల్ల ఇక ఆ పథకం ద్వారా పెద్దగా పనులు సాధ్యంకాదన్న భావన ఇటు నేతలు, అటు అధికారుల్లో ఉండగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టి రూ.8వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. దీని వల్ల ఆ పథకం అధికంగా అమలయ్యే ఉమ్మడి జిల్లాకు ప్రయోజనం చేకూరనుంది. అలాగే జలజీవన్‌ మిషన్‌ పనులకు 2028 వరకు అనుమతులు సాధించడంతోపాటు రాష్ట్ర వాటా నిధుల కేటాయింపు బడ్జెట్‌లో అధికంగా చేయడం కూడా ఉమ్మడి జిల్లాలో తాగునీటి పథకాల పనులకు లాభించనుంది.

Updated Date - Feb 15 , 2026 | 02:55 AM