గృహ ప్రవేశాలు వాయిదా
ABN , Publish Date - Mar 14 , 2026 | 01:57 AM
ప్రభుత్వం ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గృహ ప్రవేశాలను నిర్వహించాలని భావించినా ఆ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి గృహ నిర్మాణశాఖ అధికారులకు సమాచారం అందింది.
ఉగాదికి 4,300 ఇళ్లు సిద్ధం చేయాలని తొలుత అధికారులకు సూచించిన ప్రభుత్వం
ఆ కార్యక్రమాన్ని ఆపాలంటూ తాజాగా ఆదేశాలు
ఒంగోలు నగరం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గృహ ప్రవేశాలను నిర్వహించాలని భావించినా ఆ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి గృహ నిర్మాణశాఖ అధికారులకు సమాచారం అందింది. రాష్ట్రప్రభుత్వం తొలుత ఉగాది పర్వదినం రోజున భారీగా గృహ ప్రవేశాలు నిర్వహించాలని నిర్ణయించడంతో ఉమ్మడి జిల్లాలో 4,300 ఇళ్లను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో కూడా ఉగాది నాడే గృహ ప్రవేశాలు ఉంటాయని అనుకున్నారు. కానీ ఈ కార్యక్రమాన్ని నిరవధికంగా వాయిదా వేస్తూ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. జిల్లాలో గతంలో 1.0 పథకం కింద మంజూరైన గృహాల్లో పూర్తి కావచ్చిన వాటిని, కొత్తగా 2.0 కింద మంజూరైన గృహాల్లో పూర్తయినవి కలిపి 4,300 ఇళ్లలో చేరికలు చేపట్టాలని నిర్ణయించారు. గతంలో 1.0 కింద మంజూరైన గృహాలకు రూ.1.80 లక్షలు యూనిట్ విలువ కాగా 2.0 కింద మంజూరైన ఇళ్లకు ఎస్సీ, బీసీ వర్గాలకు రూ.3లక్షలు, ఎస్టీలకు రూ.3.25లక్షలు, ఓసీలకు రూ.2.50 లక్షలు యూనిట్ విలువగా అందజేస్తోంది. దీంతో పెరిగిన యూనిట్ విలువతో లబ్ధిదారులు ఎక్కువ మంది గృహనిర్మాణాలను చేపట్టి పూర్తిచేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. గృహ నిర్మాణాల్లో గతం కంటే జిల్లాలో పురోగతి కనిపిస్తోంది. వీటితోపాటు పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే నిర్మాణాలు దాదాపు పూర్తయిన టిడ్కో ఇళ్లను కూడా ఉగాది నాడు గృహప్రవేశాలు జరపాలని నిర్ణయించినా ప్రభుత్వం వాయిదా వేసింది. తిరిగి ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు చేపట్టాలన్న విషయాన్ని త్వరలోనే తెలియజేస్తామని గృహ నిర్మాణ శాఖ నుంచి జిల్లా అధికారులకు సమాచారం అందింది.