Share News

దర్శి, గిద్దలూరులో హైడ్రామా

ABN , Publish Date - Oct 18 , 2026 | 11:35 PM

నామినేషన్ల సందర్భంగా దర్శి, గిద్దలూరు మున్సిపాలిటీల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. దర్శిలో పోలీసులపై వైసీపీ శ్రేణుల దాడితో యుద్ధవాతావరణం నెలకొని చివరకు ఆపార్టీ అభ్యర్థి నామినేషన్‌ కూడా వేయని పరిస్థితి చోటుచేసుకుంది. బీజేపీకి కేటాయించిన గిద్దలూరు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి సోదరుడితోపాటు మరో టీడీపీ నేత పోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. అక్కడ ఎమ్మెల్యే మాత్రం బీజేపీ అభ్యర్థి నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.

దర్శి, గిద్దలూరులో   హైడ్రామా
ఒంగోలులో ర్యాలీగా వస్తున్న ఎంపీ మాగుంట, ఎమ్మెల్యేలు జనార్దన్‌, విజయ్‌కుమార్‌, మేయర్‌ అభ్యర్థి శ్రీశిల్ప

ఏకగ్రీవ బాటలో దర్శి మున్సిపాలిటీ

గిద్దలూరులో ఎమ్మెల్యే సోదరుడే

రెబల్‌గా నామినేషన్‌

రంగంలోకి అధిష్ఠానం

చీమకుర్తిలో టీడీపీ

తిరుగుబాటు అభ్యర్థి నామినేషన్‌

ఒంగోలు, అద్దంకి, మార్కాపురంలో

సాఫీగా పూర్తయిన నామినేషన్ల ప్రక్రియ

నామినేషన్ల సందర్భంగా దర్శి, గిద్దలూరు మున్సిపాలిటీల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. దర్శిలో పోలీసులపై వైసీపీ శ్రేణుల దాడితో యుద్ధవాతావరణం నెలకొని చివరకు ఆపార్టీ అభ్యర్థి నామినేషన్‌ కూడా వేయని పరిస్థితి చోటుచేసుకుంది. బీజేపీకి కేటాయించిన గిద్దలూరు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి సోదరుడితోపాటు మరో టీడీపీ నేత పోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. అక్కడ ఎమ్మెల్యే మాత్రం బీజేపీ అభ్యర్థి నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. కనిగిరిలో నామినేషన్ల దాఖలు సందర్భంగా ఒక సమయంలో టీడీపీ, వైసీపీ శ్రేణులు ఘర్షణకు దిగాయి. కొన్ని వార్డులకు వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేదు. చీమకుర్తిలో తెలుగుదేశంకు చెందిన సింగిల్‌ విండో అధ్యక్షుడు రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఒంగోలు, అద్దంకి, మార్కాపురంలో నామినేషన్ల పర్వం ప్రశాంతంగా ముగిసింది. దర్శి చైర్మన్‌ స్థానంతోపాటు కొన్ని మున్సిపాలిటీల్లో పలు వార్డులను కూటమి ఏకగ్రీవంగా చేజిక్కించుకునే అవకాశాలు నెలకొన్నాయి.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

మున్సిపోల్స్‌కు సంబంధించిన నామినేషన్ల దాఖలు ఘట్టం ఆదివారంతో ముగిసింది. బుధవారం సాయంత్రం వరకు ఉపసంహరణలకు అవకాశం ఉంది. అనూహ్య పరిణామాల మధ్య దర్శి మున్సిపాలిటీని కూటమి ఏకగ్రీవంగా చేజిక్కించుకోబోతోంది. అక్కడ చైర్మన్‌ పదవికి ఐదుగురు మాత్రమే నామినేషన్లు వేశారు. వారిలో జనసేన తరఫున అధికారికంగా ఎంపికైన అభ్యర్థి సుబ్బారావుతోపాటు టీడీపీ తరఫున ఒకరు, స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు ఉన్నారు. సుబ్బారావు మినహా మిగిలిన ఇద్దరూ అవసరమైన పత్రాలను టీడీపీ నాయకుడు లలిత్‌సాగర్‌కు ఇచ్చేశారు. దీంతో జనసేన అభ్యర్థి అయిన మాజీ టీడీపీ నాయకుడు దారం సుబ్బారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు నెలకొన్నాయి. అక్కడ మొత్తం 28 వార్డుల్లో నాలుగు చోట్ల మాత్రమే వైసీపీ తరఫున నామినేషన్లు దాఖలయ్యాయి. చైర్మన్‌ అభ్యర్థే రంగంలో లేకపోవడంతో వార్డుల్లో ఉన్న వైసీపీ అభ్యర్థులను కూడా నామినేషన్లు ఉపసంహరింపజేసేందుకు స్థానిక నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 20 వరకు వార్డులు ఏకగ్రీవమయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఫలించిన లక్ష్మి, లలిత్‌సాగర్‌ వ్యూహం

దర్శి మున్సిపాలిటీని జనసేనకు కేటాయించిన వెంటనే టీడీపీ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి, ఆమె భర్త లలిత్‌సాగర్‌ అప్రమత్తమయ్యారు. టీడీపీ అభ్యర్థిగా అనుకున్న సుబ్బారావును జనసేనలో చేర్చారు. పార్టీ సహకారం కూడా తీసుకొని జనసేన నాయకులతో మాట్లాడి ప్రజాభిప్రాయ సర్వేకు అనుగుణంగా టికెట్‌ సుబ్బారావుకు దక్కేలా పావులు కదిపారు. వైసీపీ తరఫున ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కూడా దర్శిలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కూటమి పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంతో వారిలో ఆశలు కూడా పెరిగాయి. అయితే నామినేషన్ల దాఖలు సమయంలో ఎదురయ్యే పరిణామాలను పసిగట్టడంలో విఫలమయ్యారు. టీడీపీ నాయకులు వ్యూహాత్మంగా వ్యవహరించడంతో వైసీపీ శ్రేణులు దూకుడుగా పోలీసులపై దాడికి దిగి తప్పటడుగు వేశారు. డ్యూటీలో ఉన్న ఎస్‌ఐకు రక్తగాయాలు కావడంతో పోలీసులు కఠినంగా వ్యవహరించడం ప్రారంభించారు. ఇద్దరు లేక ముగ్గురు వెళ్లి నామినేషన్లు వేయాలని నిబంధన విధించారు. అలా వెళ్తే టీడీపీ శ్రేణులు దాడి చేసే అవకాశం ఉందన్న భయంతో వైసీపీ అభ్యర్థులు నామినేషన్‌ కేంద్రానికి వెళ్లేందుకు జంకారు. ఈ తర్జనభర్జనల మధ్య నామినేషన్‌ దాఖలుకు సమయం దాటి పోవడంతో చేసేదిలేక వారు వెనుతిరిగారు. హైకోర్టులో కూడా వారికి చుక్కెదురైనట్లు తెలుస్తోంది. కాగా గొట్టిపాటి లక్ష్మి స్థానిక పార్టీ నాయకులందరినీ ఐక్యంగా నడిపి ప్రథమ ఘట్టంలో సక్సెస్‌ అయినట్లుగా భావిస్తున్నారు.


గిద్దలూరులో డ్రామా

గిద్దలూరు మునిసిపల్‌ చైర్మన్‌గా బీజేపీ అభ్యర్థి నామినేషన్‌కు ఆపార్టీ రాష్ట్ర నాయకుడు సోము వీర్రాజుతోపాటు టీడీపీ జిల్లా పరిశీలకుడు బీటీ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి కూడా హాజరయ్యారు. తెలుగుదేశం శ్రేణులెవ్వరూ ఆ కార్యక్రమానికి రాకపోవడంతో సాదాసీదాగా నామినేషన్‌ దాఖలు కార్యక్రమం జరిగింది. అయితే ఆతర్వాత ఎమ్మెల్యే సోదరుడు కృష్ణకిశోర్‌రెడ్డి ఎమ్మెల్యే ఇంటి వద్ద నుంచి భారీ ర్యాలీతో వచ్చి మూడు నామినేషన్లు దాఖలు చేశారు. ఆయన ఒకటి టీడీపీ తరఫున, ఇంకొకటి బీజేపీ తరఫున, మరొకటి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన నామినేషన్లు వేయడం విశేషం. అలాగే వారి సమీప బంధువైన టీడీపీ నాయకుడు, కేఎస్‌పల్లికి చెందిన ప్రతాప్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. రాష్ట్రస్థాయిలో చర్చలు జరిగి బీజేపీ నుంచి అవకాశం ఇస్తే ఆ పార్టీ నుంచి పోటీ చేయడం లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉండాలన్న ఉద్దేశంతో అలా నామినేషన్‌లు దాఖలు చేసినట్లు భావిస్తున్నారు. అయితే టీడీపీ అధిష్ఠానం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పొత్తు ధర్మాన్ని పాటించాల్సిందేనని ఎమ్మెల్యేను ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో రానున్న రెండు రోజుల్లో ఇక్కడ జరిగే పరిణామాలు గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కూటమి పార్టీలో నెలకొన్న ఈ పరిస్థితుల్లో వైసీపీ నాయకులు ఉత్సాహంగా ప్రచార కార్యక్రమానికి శ్రీకారం పలికారు.

చీమకుర్తిలో టీడీపీ రెబల్‌

చీమకుర్తి మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి టీడీపీ నాయకుడు వెంకటరావు రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. అక్కడ పార్టీ నుంచి టికెట్‌ ఆశించిన వారిలో ఆయన ఉన్నారు. ఆయితే పార్టీ శిద్దా సుధాకర్‌కు అవకాశం ఇచ్చింది. సింగిల్‌ విండో పర్సన్‌ఇన్‌చార్జిగా ఉన్న వెంకటరావు పార్టీ ఆదేశాలను కాదని నామినేషన్‌ వేశారు. ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ పార్టీ నుంచి ఎవ్వరూ ఆ వైపు వెళ్లకుండా కట్టడి చేశారు.

కనిగిరిలో పలు వార్డులు ఏకగ్రీవం?

కనిగిరి మున్సిపాలిటీలో పలు వార్డులను టీడీపీ ఏకగ్రీవంగా దక్కించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆరు డివిజన్లలో ఏకగ్రీవాలు ఖాయమన్న పరిస్థితి కనిపిస్తోంది. మరికొన్ని డివిజన్లలో నామినేషన్లు వేసిన వారితో టీడీపీ నాయకులు చర్చలు జరుపుతున్నారు. దీంతో ఏకగ్రీవంగా ఎంపికయ్యే వార్డుల సంఖ్య 15వరకు ఉండవచ్చని అంచనా. మార్కాపురం మున్సిపాలిటీలో కూడా కొన్ని వార్డులు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. అద్దంకిలో అన్ని వార్డుల్లో పోటీ జరగబోతుంది. ఒంగోలు కార్పొరేషన్‌లో కూడా కొన్ని డివిజన్‌లలో కార్పొరేటర్లు ఏకగ్రీవమయ్యే అవకాశం లేకపోలేదు.

Updated Date - Oct 18 , 2026 | 11:35 PM