కాకర్ల నామినేషన్ కేంద్రం వద్ద హైడ్రామా
ABN , Publish Date - Nov 17 , 2026 | 02:40 AM
పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాకర్లలోని నామినేషన్ స్వీకరణ కేంద్రం వద్ద సోమవారం సాయంత్రం వైసీపీ హైడ్రామాకు తెరలేపింది. చిలంకూరు, కాకర్ల, చిమట గ్రామాలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఉదయం నుంచి సజావుగా సాగింది.
మా వాళ్లను రానివ్వడంలేదని హడావుడి
మాజీ మంత్రి సురేష్‌ను అడ్డుకున్న పోలీసులు
మర్రిపూడి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాకర్లలోని నామినేషన్ స్వీకరణ కేంద్రం వద్ద సోమవారం సాయంత్రం వైసీపీ హైడ్రామాకు తెరలేపింది. చిలంకూరు, కాకర్ల, చిమట గ్రామాలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఉదయం నుంచి సజావుగా సాగింది. చిమట గ్రామానికి చెందిన వైసీపీ సానుభూతిపరులు సాయంత్రం 3గంటల సమయంలో తాము నామినేషన్‌లు వేయకుండా అడ్డుకుంటున్నారని కొండపి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే వైసీపీ సానుభూతిపరులను నామినేష న్‌లు వేయకుండా అడ్డుకుంటున్నారని టంగు టూరు సబ్‌కలెక్టర్ హిమవంశీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అంతటితో ఆగకుండా చిమటకు చెందిన ఆరుగురు అభ్యర్థులు క్యూలో ఉన్నప్పటికీ నామినేషన్‌లు ఎందుకు వేయించ లేదని ఆర్వోను ఫోన్‌లో నిలదీశారు. ఐదు గంటలలోపు క్యూలో ఉన్న ప్రతి ఒక్కరితో నామినేషన్లు వేయిస్తానని ఈర్వో ఆయనకు హామీ ఇచ్చారు. ఆ మేరకు క్యూలో ఉన్న ఆరుగురికి టోకెన్‌లు ఇచ్చి నామినేషన్ల ప్రక్రియను కొనసాగించారు. టోకెన్లు ఇచ్చిన వారిలో ముగ్గురు టీడీపీ సభ్యులు ఉన్నారని మరొకసారి వైసీపీ నాయకులు ఆర్వోతో వాగ్వివాదానికి దిగారు. ఈలోగా సబ్ కలెక్టర్ 5గంటలలోపు క్యూలో ఉన్న అందరికీ టోకెన్‌లు అందజేసి నామినేషన్లు స్వీకరించాలని ఆర్వోను ఆదేశించారు. ఆ మేరకు మరో ముగ్గురు వైసీపీ అభ్యర్థులకు కూడా టోకెన్‌లు ఇచ్చి ఐదు గంటలు దాటడంతో గేట్లు మూసివేశారు. ఆ తర్వాత మరో ఇద్దరితో కూడా నామినేషన్ వేయించాలని వైసీపీ నాయకులు పట్టుబట్టారు. అయితే సమయం దాటిపోయిందని మంగళవారం నామినేషన్లు వేసుకోవచ్చని ఆర్వో సూచించారు. ఇదే సమయంలో మాజీ మంత్రి సురేష్ కాకర్లకు చేరుకొని పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడే ధర్నా చేస్తానని ఒకదశలో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐ సుదర్శన్ మాజీ మంత్రిని అడ్డుకున్నారు. సమయం దాటిన తర్వాత ఎవరినీ లోపలికి అనుమతించబోమని తేల్చి చెప్పారు. మండల పరిషత్ ఎన్నికల సమయంలో కూడా నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, పంచాయతీ ఎన్నికల్లో ఆవిధంగా చేస్తే చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి సురేష్ హెచ్చరించారు. ఒక సమయంలో అరుపులు కేకలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సురేష్ చేతులు జోడించి ఎస్‌ఐని నామినేషన్‌లు వేయించాలని కోరడం కనిపించింది. కావాలనే వైసీపీ శ్రేణులు సమయం దాటిన తరువాత రచ్చ చేశారంటూ టీడీపీ శ్రేణులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎట్టకేలకు పోలీసులు పరిస్థితిని సర్దుబాటు చేయడంతో అందరూ వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా జవ్విగుంట నామినేషన్ కేంద్రం వద్ద కూడా ధర్మవరం గ్రామానికి చెందిన టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. మిగిలిన అన్నిచోట్ల నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగింది.