Share News

చదువుకు చేయూత

ABN , Publish Date - May 14 , 2026 | 03:11 AM

ముస్లిం విద్యార్థుల్లో ప్రతిభ ఉండి చదువుకు దూరమయ్యే వారికోసం ప్రభుత్వం వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో ఉచిత విద్య అందించాలని నిర్ణయించింది. కార్పొరేటు కళాశాలల్లో వసతితో కూడిన బోధన అందించేలా పథకాన్ని రూపొందించింది.

చదువుకు చేయూత

పేద ముస్లిం పిల్లల్లో ప్రతిభావంతుల గుర్తింపు

వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో 17న ప్రతిభ పరీక్ష

ఉమ్మడి జిల్లాలో 499 మంది దరఖాస్తు

ఎంపికైన వారికి కార్పొరేట్‌ కాలేజీల్లో ఉచిత విద్య

మార్కాపురం, మే 13 (ఆంధ్రజ్యోతి) : ముస్లిం విద్యార్థుల్లో ప్రతిభ ఉండి చదువుకు దూరమయ్యే వారికోసం ప్రభుత్వం వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో ఉచిత విద్య అందించాలని నిర్ణయించింది. కార్పొరేటు కళాశాలల్లో వసతితో కూడిన బోధన అందించేలా పథకాన్ని రూపొందించింది. దీనికి తాలీమ్‌ (విద్య) ఎ హూనర్‌ (నైపుణ్యం) అని నామకరణ చేసింది. దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. గత వైసీపీ హయాంలో వక్ఫ్‌బోర్డు నిర్వీర్యమైంది. ముస్లిం మైనారిటీలకు ఏవిధంగానూ ఉపయోగపడిన దాఖలాలు లేవు. ప్రస్తుత ప్రజాప్రభుత్వం ముస్లింల సంక్షేమంపై దృష్టి సారించింది. వక్ఫ్‌బోర్డుకు మళ్లీ జవసత్వాలు తెస్తోంది. ఇందుకు తాలీమ్‌ ఎ హ్యూనర్‌ పథకం నిదర్శనమని పలువురు ప్రశంసి స్తున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతిలో ప్రతిభ ఉండి పేదరికంతో ఉన్న 250 మంది ముస్లింలను ఎంపిక చేయనున్నారు. వారికి కార్పొరేట్‌ కళాశాలల్లో ఉచితంగా విద్యను అందించనున్నారు. ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించారు. ఈనెల 12తో దరఖాస్తు గడువు పూర్తయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 7వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ప్రకాశం నుంచి 266 మంది, మార్కాపురం నుంచి 183 మంది ఉన్నారు. వీరిలో తెల్లరేషన్‌ కార్డు కలిగి ఉండి నిరుపేదలైన వారిని, పదో తరగతిలో 450 మార్కులకుపైన సాధించిన వారిని ఎంపిక చేస్తారు. వారికి ఈనెల 17వ తేదీన వివిధ ప్రాంతాల్లో టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా విద్యార్థులకు నెల్లూరులో టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఎంపికైన వారికి ఇంటర్మీడియట్‌లో వారు కోరుకున్న గ్రూపుల్లో ఉచిత విద్య అందించనున్నారు. రాష్ట్రంలోని ఎంపిక చేసిన కార్పొరేట్‌ కళాశాలల్లో భోజన వసతి, విద్యాబోధన ఉచితంగా కల్పించనున్నారు. పుస్తకాలను కూడా అందజేయనున్నట్లు వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ సాధిక్‌ తెలిపారు. ప్రతిభ ఉండి కూడా పేదరికంతో విద్యకు దూరం కాకూడదన్న ప్రభుత్వ ఉద్దేశమని ఆయన చెప్పారు.

Updated Date - May 14 , 2026 | 03:11 AM