తెగ తాగేశారు!
ABN , Publish Date - Jan 18 , 2026 | 02:47 AM
సంక్రాంతి పండుగ అంటే సరదాలకు మారు పేరు. కొత్త దుస్తులు, పిండివంటలు, ముత్యాల ముగ్గులతో రంగుల హరివిల్లుగా జరుపు కుంటారు. అయితే ఈసారి మద్యం జోరు పెరిగింది. పండుగ పేరుతో మందుబాబులు తెగ తాగేశారు.
సంక్రాంతి వేళ మద్యం జోరు
రూ.23.25 కోట్ల మందు కొనుగోలు
పండుగ మూడు రోజుల్లో రూ.15 కోట్ల విక్రయాలు
ఒంగోలు క్రైం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : సంక్రాంతి పండుగ అంటే సరదాలకు మారు పేరు. కొత్త దుస్తులు, పిండివంటలు, ముత్యాల ముగ్గులతో రంగుల హరివిల్లుగా జరుపు కుంటారు. అయితే ఈసారి మద్యం జోరు పెరిగింది. పండుగ పేరుతో మందుబాబులు తెగ తాగేశారు. ఉమ్మడి జిల్లాలో ఈనెల 10 నుంచి 14 వరకు మద్యం డిపో నుంచి సుమారు రూ.23.25 కోట్ల విలువైన సరుకును దుకాణాలకు తరలించారు. సంక్రాంతి, కనుమ పండుగలకు డిపోకు సెలవు కావడంతో ముందుగానే దుకాణాల యజమానులు ఎక్కువ మద్యం కొనుగోలు చేశారు. పండుగ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాల దుకాణాలకు అధికంగా తరలించారు. అదేస్థాయిలో విక్రయాలు జరిగాయి. పట్టణ ప్రాంతా లకంటే గ్రామీణ ప్రాంత మద్యం దుకాణాలలో విక్రయాలు 30శాతం పెరిగినట్లు వ్యాపా రులు చెబుతున్నారు. ఎక్కువ సంఖ్యలో ఇతర ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారు స్వస్థలాలకు రావడంతోపాటు కోడి పందేలు, ఎడ్ల పందేలు, పోటేళ్ల పోటీలతోపాటు సంక్రాతి సంబరాలు గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా జరిగాయి. దీంతో మద్యం విక్రయాల జోరు పెరిగింది. జిల్లాలో 171 మద్యం షాపులు, 25 బార్లు, 18 గీత కార్మికులకు చెందిన దుకాణాలు ఉన్నాయి. ఈమేరకు మొత్తం 214 దుకాణాలు అనుకుంటే గతంలో సరాసరి మద్యం దుకాణం రోజు రూ.2లక్షల విక్రయాలు చేస్తే మొత్తం రూ.3.6 కోట్లు అవుతుంది. అదే విధంగా పండుగ మూడు రోజులు సరాసరి ఒక్కో దుకాణంలో రూ.2.75 లక్షలు విక్రయాలు జరిగాయి. అంటే రోజుకు జిల్లాలో రూ.5 కోట్ల మద్యం విక్రయించారు. పండుగ మూడు రోజులు రూ.15కోట్లు జరిగినట్లు అంచనా. కోడిపందేల వద్ద బెల్ట్ దుకాణాలు పెట్టి మరీ విక్రయించారు. ఎక్సైజ్ అధికారులు జిల్లాలోకి ఎన్‌డీపీఎల్ మద్యం రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు ఈఎస్ ఆయేషాబేగం తెలిపారు. నాటుసారాను అరికట్టడంలో కూడా యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.