నమ్మించి ముంచాడు!
ABN , Publish Date - Feb 04 , 2026 | 02:49 AM
ఏళ్లతరబడి కిరాణా దుకాణం నిర్వహిస్తూ ఖాతాదారులు, స్థానికులతో సత్సంబంధాలను ఏర్పరచుకున్నాడు. ఆపై చిట్టీలు, వడ్డీ వ్యాపారం పేరిట భారీ మొత్తంలో నగదును తీసుకున్నాడు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా ఆస్తులను అమ్మేసి సొమ్ముచేసుకున్నాడు.
మూలగుంటపాడులో చిట్టీలు, వడ్డీల పేరిట భారీ మోసం
రూ.10కోట్లకు కుచ్చుటోపీ
పక్కాప్రణాళికతో ఆస్తులను అమ్మేసి సొమ్ముచేసుకొని పరార్
లబోదిబోమంటున్న బాధితులు
పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు
సింగరాయకొండ. ఫిబ్రవరి 3 (ఆంధ్ర జ్యోతి): ఏళ్లతరబడి కిరాణా దుకాణం నిర్వహిస్తూ ఖాతాదారులు, స్థానికులతో సత్సంబంధాలను ఏర్పరచుకున్నాడు. ఆపై చిట్టీలు, వడ్డీ వ్యాపారం పేరిట భారీ మొత్తంలో నగదును తీసుకున్నాడు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా ఆస్తులను అమ్మేసి సొమ్ముచేసుకున్నాడు. పది రోజుల క్రితం భార్యను తీసుకొని రాత్రికి రాత్రే పరారయ్యాడు. చిట్స్ వేసి న వారికి, వడ్డీకి ఇచ్చిన వారికి సుమారు రూ.10 కోట్ల కుచ్చుటోపీ పెట్టాడు. అతని వద్ద డబ్బులు దాచుకున్న కూలీనాలీ చేసుకునే వారు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఇప్పుడు లబోదిబోమం టున్నారు. న్యాయం చేయాలని ఎస్సై బి.మహేంద్రకు మంగళవారం ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలో శానంపూడి గ్రామానికి చెందిన కాకు మాని శ్రీనివాసులు 20ఏళ్ల క్రితం బతుకు దెరువు కోసం మూలగుంటపాడుకు వచ్చాడు. విద్యానగర్-5లో స్థలాన్ని కొనుగోలు చేసి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అనంతరం మరో ఇంటిని కట్టి అందులో కిరాణా వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఖాతాదారులు, స్థానికు లతో మంచిగా ఉంటూ నమ్మకాన్ని పెంచుకున్నాడు. 2015లో చిట్టీల వ్యాపా రాన్ని మొదలు పెట్టాడు. కొన్నేళ్లు అందరికీ సక్రమంగానే నగదును చెల్లిస్తూ వచ్చాడు. రెండేళ్ల నుంచి చిట్టీపాట పడుకున్న కొంతమంది వ్యక్తులకు నగదు చెల్లించకుండా వ్యాపార అవసరాల నిమిత్తం అంటూ వడ్డీకి తీసుకొని ప్రామిసరీ నోట్లు రాసిచ్చాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట కొంతమంది వ్యక్తుల నుంచి భారీ మొత్తంలో వడ్డీలకు తీసుకున్నట్టు తెలుస్తోంది. వారికి నెలవారీ వడ్డీలు చెలిస్తూ కొంతకాలం నెట్టుకొచ్చాడు. ఇటీవల ఇంటిని బ్యాంకులో తాకట్టుపెట్టి రూ.50 లక్షలు రుణాన్ని తీసుకున్నాడు. పక్కా ప్రణాళికతో దుకాణం నిర్వహించే ఇంటిని రూ.కోటి, ఇళ్ల స్థలాలను రూ.2.30కోట్లకు అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. అనంతరం రాత్రికి రాత్రే ఊరు వదలి ఉడాయించాడు. ఇది తెలుసుకున్న బాధితులు గుండెలు బాదుకుంటున్నారు. న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నారు.