Share News

కోట్లు కూడబెట్టాడు

ABN , Publish Date - Feb 07 , 2026 | 02:35 AM

గనుల శాఖలో సర్వేయర్‌గా పనిచేస్తున్న అబ్దుల్‌ ఆసిఫ్‌ కోట్లు కూడబెట్టాడు. అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. శుక్రవారం నెల్లూరు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ నేతృత్వంలో ఒంగోలు మైనింగ్‌ కార్యాల యంలో ఉన్న అబ్దుల్‌ ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకొన్నారు.

కోట్లు కూడబెట్టాడు
ఒంగోలులోని గనులశాఖ కార్యాలయంలో సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు

అక్రమాస్తుల కేసులో గనులశాఖ సర్వేయర్‌ ఆసిఫ్‌ అరెస్టు

ఒంగోలులోని మైనింగ్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

ఏకకాలంలో విజయవాడలోని ఆయన నివాసం, గుంటూరు,

మార్కాపురం, కనిగిరి, ఒంగోలులోని బంధువుల ఇళ్లలో తనిఖీలు

భారీగా ఆస్తులు, బ్యాంక్‌ లాకర్‌ ఉన్నట్లు గుర్తింపు

ఒంగోలు క్రైం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): గనుల శాఖలో సర్వేయర్‌గా పనిచేస్తున్న అబ్దుల్‌ ఆసిఫ్‌ కోట్లు కూడబెట్టాడు. అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. శుక్రవారం నెల్లూరు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ నేతృత్వంలో ఒంగోలు మైనింగ్‌ కార్యాల యంలో ఉన్న అబ్దుల్‌ ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం విజయవాడలోని అతని నివాసం, గుంటూరు, ఒంగోలు, మార్కాపురం, కనిగిరిలలోని బంధువుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. విలువైన ఆస్తులు భారీగా ఉన్నట్లు గుర్తించారు.

ఉదయాన్నే దాడులు

ఒంగోలు భూగర్భగనుల శాఖలో పని చేస్తున్న సర్వేయర్‌ షేక్‌ అబ్దుల్‌ ఆసిఫ్‌కు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు నెల్లూరు అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక బృందం ఒంగోలు మంగమూరు రోడ్డులోని ఆశ్రమం వద్ద ఉన్న మైనింగ్‌ కార్యాలయంపై ఆకస్మికంగా దాడిచేసింది. అక్కడ ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకుంది. విజయవాడలోని అతని ఇంటికి తీసుకెళ్లి అక్కడ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. భారీఎత్తున బంగారం, వెండి, విలువైన ఆస్తిపత్రాలు లభించినట్లు సమాచారం. గుంటూరు, సొంతూరు మార్కాపురం, అత్తగారి ఇల్లు కనిగిరితోపాటు ఆయన పనిచేస్తున్న ఒంగోలు మైనింగ్‌ కార్యాలయంలో రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు నిర్వహించారు. ఒంగోలు మైనింగ్‌ కార్యాలయానికి ఏడాదిన్నర క్రితం ఆసిఫ్‌ నెల్లూరు నుంచి బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి జరిగిన లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారు. ఒంగోలులో ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. రాత్రి పొద్దుపోయే వరకు పరిశీలన చేస్తూనే ఉన్నారు.

గనుల శాఖలో ఉలికిపాటు

ఏసీబీ అధికారులు మైనింగ్‌ కార్యాలయంలో ఆకస్మికంగా దాడులు చేయడంతో అక్కడ ఉన్న సిబ్బంది అంతా ఉలికిపాటుకు గురయ్యారు. కార్యాలయం కింద భాగాన ఉన్న భూగర్భగనుల నిఘా విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు నివ్వెరపోయారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు ఆసిఫ్‌ నిర్వహించిన లావాదేవీలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. దీంతో మైనింగ్‌ కార్యాలయంలో బిక్కుబిక్కుమంటూ సిబ్బంది ఉండిపోయారు. ఆసిఫ్‌ లావాదేవీలలో ఎవరికైనా వాటాలు ఉన్నాయా అనే కోణంలో కూడా అధికారులు పరిశీలన చేస్తున్నారు.

గతంలో మైనింగ్‌ కార్యాలయంలో తనిఖీలు

2024 ఆగస్టులో ఏసీబీ అధికారులు మైనింగ్‌ కార్యాలయంలో తనిఖీలు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన ఇసుక తవ్వకాలు, క్వారీ లీజులు, రాయల్టీ చెల్లింపులో జరిగిన అక్రమాలపై అప్పట్లో ఆరా తీశారు. జేపీ పవర్‌ వెంచర్స్‌ వంటి సంస్థలకు ఇచ్చిన అనుమతులు, ప్రభుత్వానికి రావాల్సిన రూ.13 కోట్ల బకాయిల విషయంలో రికార్డులను అప్పట్లో పరిశీలించారు.

Updated Date - Feb 07 , 2026 | 02:35 AM