దివ్యాంగుడిపై దాష్టీకం
ABN , Publish Date - Mar 08 , 2026 | 03:35 AM
కనిగిరి తహసీల్దార్ నర్రా జయలక్ష్మి ఓ దివ్యాంగుడిపై దాష్టీకాన్ని ప్రదర్శించారు. నాపైనే ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తావా? అంటూ ఊగిపోయారు. సిబ్బందితో అతని సెల్‌ఫోన్‌ను బలవంతంగా లాగివేయించారు. అనంతరం పోలీసులను పిలిపించి లోపల వేయాలని హుకుం జారీ చేశారు.
అడంగల్ కోసం ప్రజాదర్బార్‌లో అర్జీ దాఖలు
నాపైనే ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తావా అంటూ ఊగిపోయిన కనిగిరి తహసీల్దార్
సిబ్బందితో చేతిలోని సెల్‌ఫోన్ లాగించిన వైనం
పోలీసులను పురమాయించి స్టేషన్‌లో నిర్బంధం
విభిన్నప్రతిభావంతుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లిన బాధితుడు
కనిగిరి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి) : కనిగిరి తహసీల్దార్ నర్రా జయలక్ష్మి ఓ దివ్యాంగుడిపై దాష్టీకాన్ని ప్రదర్శించారు. నాపైనే ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తావా? అంటూ ఊగిపోయారు. సిబ్బందితో అతని సెల్‌ఫోన్‌ను బలవంతంగా లాగివేయించారు. అనంతరం పోలీసులను పిలిపించి లోపల వేయాలని హుకుం జారీ చేశారు. దివ్యాంగుడు కన్నీళ్లు పెట్టుకున్నా కనికరించలేదు. ఈవిషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడైన కనిగిరి పట్టణానికి చెందిన జలపాటి తిరుపతయ్య అనే దివ్యాంగుడి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపయ్య ఎమ్మెస్సార్ రోడ్డులో నెట్‌సెంటర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయన టీడీపీ విభిన్న ప్రతిభావంతుల విభాగం నియోజకవర్గ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. కనిగిరి సమీపంలోని 632 సర్వే నంబర్‌కు చెందిన టెన్ ఒన్ అడంగల్ కాపీ కోసం ఆయన తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగారు. ఫలితం లేకపోయేసరికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌లో గత నెల 2వ తేదీన అర్జీ దాఖలు చేశారు. అనంతరం పది రోజుల తర్వాత ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు వెళ్లి అడగ్గా అక్కడి సిబ్బంది తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. 15రోజులుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా లోపలికి వెళ్లకుండా రెవెన్యూ సిబ్బంది అడ్డుకుంటూ వచ్చారు. ఈనెల 5వతేదీన ఎట్టకేలకు తహసీల్దార్ జయలక్ష్మి వద్దకు వెళ్లారు. తాను ప్రజాదర్బార్‌లో అర్జీ ఇచ్చానని, ఇంత వరకు ఎలాంటి సమాధానం రాలేదని తహసీల్దార్ జయలక్ష్మి వివరించారు. దీంతో తహసీల్దార్ మీ సెల్‌ఫోన్‌కు ఎప్పుడు కలవాలని మెసేజ్ వస్తుందో అప్పుడు రా..పో.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వెంటనే దివ్యాంగుడు తన సెల్‌ఫోన్‌లో మెసేజ్ వచ్చిందేమోనని చూస్తున్న క్రమంలో వాడు (ఏకవచనం) సెల్‌ఫోన్‌తో రికార్డు చేస్తున్నాడు అంటూ పైకి లేచి సిబ్బందితో సెల్‌ఫోన్ లాక్కోవాలని ఆదేశించారు. ఏం జరుగుతుందో తెలియక దివ్యాంగుడు ఒక్కసారిగా కింద పడిపోయాడు. మాపైనే ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తావా? అంటూ తహసీల్దార్ దివ్యాంగుడిపై కేకలు వేశారు. సెల్‌ఫోన్‌లో ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి పేరుపైన ఉన్న వాట్సా్‌పను పరిశీలించాలని హుకుం జారీ చేశారు. దీంతో సిబ్బంది సెల్‌ఫోన్‌ను పరిశీలించారు.
సెల్‌లో వేయండంటూ పోలీసులకు హుకుం
తహసీల్దార్ వెంటనే పోలీసులను పిలిపించారు. దివ్యాంగుడు తిరుపతయ్యను అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ‘నేనేం తప్పు చేశాను మేడం’ అంటూ దివ్యాంగుడు కన్నీళ్లు పెట్టుకుంటూ వేడుకున్నా కనికరించ లేదు సరికదా వాడిని సెల్‌లో వేయండి అంటూ ఊగిపోయారు. తహసీల్దార్ ఆదేశాలతో పోలీసులు దివ్యాంగుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌లో నాలుగు గంటలపాటు ఉంచారు. అనంతరం మందలించి వదిలేశారు. అయినా తహసీల్దార్ మళ్లీ పోలీసులకు ఫోన్ చేసి ఎవరు వదిలి పెట్టమన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతన్ని వెంటనే అరెస్ట్ చేయకపోతే మీపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానంటూ పోలీసులపై మండిపడ్డారు. దీంతో చేసేది లేక వారు మళ్లీ తిరుపతయ్యను పోలీ్‌సస్టేషన్‌కు పిలిపించి బైండోవర్ చేశారు. అనంతరం ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత పూచీకత్తుపై బయటికి పంపారు.
విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ జోక్యంతో పోలీసుల విచారణ
బాధితుడు తిరుపతయ్య వికలాంగుల హక్కుల వేదిక నాయకుడు దూళిపాళ్ల మల్లికార్జున్‌తో కలసి విభిన్నప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణస్వామి దృష్టికి ఫోన్‌లో విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో ఆయన కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలిసింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు తిరుపతయ్య ఇంటికి వెళ్లి విచారించారు. ఘటనకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఘటనపై దివ్యాంగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు దూళిపాళ్ల మల్లికార్జున్ బాధితుడు, ఇతర పలువురు దివ్యాంగులతోపాటు ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి డివిజన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కు శనివారం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జైభీం వ్యవస్థాపక అఽధ్యక్షుడు సూరే రాజన్న, వికలాంగుల హక్కుల వేదిక నాయకుడు వేముల మైనర్‌బాబు, మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీరామ లక్ష్మి తదితరులు ఉన్నారు.