అమ్మల్లో ఆనందం
ABN , Publish Date - Jul 23 , 2026 | 03:17 AM
విద్యార్థుల కుటుంబాల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. తల్లికి వందనం పథకం నిధులు తల్లుల ఖాతాల్లో జమ బుధవారం నుంచి ప్రారంభమైంది. జిల్లాలో 2,07,944 మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించగా వారికి సంబంధించిన 1,31,572 మంది తల్లుల ఖాతాల్లో నిధులు వేస్తున్నారు.
తల్లికి వందనం నగదు జమ ప్రారంభం
జిల్లాలో 2.07 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
స్వర్ణవార్డు, స్వర్ణగ్రామ కార్యాలయాల్లో జాబితాలు
ఒంగోలు కలెక్టరేట్, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థుల కుటుంబాల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. తల్లికి వందనం పథకం నిధులు తల్లుల ఖాతాల్లో జమ బుధవారం నుంచి ప్రారంభమైంది. జిల్లాలో 2,07,944 మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించగా వారికి సంబంధించిన 1,31,572 మంది తల్లుల ఖాతాల్లో నిధులు వేస్తున్నారు. ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ ఇస్తున్నారు. జిల్లాలోని స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో విద్యా ర్థుల అర్హుల జాబితాలను ప్రచురించారు. ఈ కార్యాలయాల్లో మూడు రకాల జాబితాలను ఉద్యోగులు ప్రదర్శించారు. అర్హత ఉండి తల్లికి వందనం పథకంలో పేర్లు లేకపోతే మరలా నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అందుకోసం బుధవారం నుంచి వచ్చేనెల 3వతేదీ వరకు అభ్యంతరాలను ఆయా కార్యాలయాల్లో స్వీకరిస్తారు. అభ్యంత రాలను పరిశీలించిన అనంతరం అర్హత ఉంటే రెండో విడతలో నిధులు జమచేయనున్నారు. కాగా తల్లికి వందనం నిధులు జమ అవుతుండటంతో విద్యార్థుల కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఒక్కో కుటుంబంలో ముగ్గురు, నలుగురికి కూడా తల్లికి వందనం నిధులు జమవుతు న్నాయి. ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.15వేలు ఇస్తుండగా అందులో రూ.2వేలను పాఠశాల అభివృద్ధికి మినహాయించి మిగిలిన రూ.13వేల ను తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు.