పోటీదారుల వివరాల వెల్లడికి బ్రేక్
ABN , Publish Date - Oct 22 , 2026 | 03:29 AM
జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న అర్బన్ స్థానిక సంస్థల్లో పోటీ చేసిన అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణల గడువు బుధవారం సాయంత్రంతో ముగిసింది. అనంతరం రంగంలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాలను ప్రకటించాల్సి ఉండగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో వాటిని ప్రకటించకుండా జిల్లా అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
ఎస్ఈసీ ఆదేశాలతో నిలిపేసిన అధికారులు
తుది జాబితాపై నేడు స్పష్టత వచ్చే అవకాశం
ఒంగోలు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న అర్బన్ స్థానిక సంస్థల్లో పోటీ చేసిన అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణల గడువు బుధవారం సాయంత్రంతో ముగిసింది. అనంతరం రంగంలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాలను ప్రకటించాల్సి ఉండగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో వాటిని ప్రకటించకుండా జిల్లా అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ మేరకు కలెక్టర్ రాజాబాబు రాత్రి పొద్దుపోయాక అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేశారు. జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు అద్దంకి, చీమకుర్తి, దర్శి మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం విదితమే. ఈనెల 18తో నామినేషన్ల దాఖలు గడువు ముగియగా బుధవారం సాయంత్రం వరకు ఉపసంహరణలకు సమయం ఉంది. అయితే నామినేషన్ల సందర్భంగా జిల్లాలోని దర్శితోపాటు రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో తమను నామినేషన్లను వేయకుండా కూటమి శ్రేణులు అడ్డుకున్నారని మరోసారి నామినేషన్ల దాఖలకు అవకాశం ఇవ్వాలంటూ వైసీపీ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు బుధవారం మధ్యాహ్నం ఇచ్చిన అదేశాలతో వైసీపీ ఆరోపణలు చేసిన చోట్ల పరిశీలన చేయాలని నిర్ణయించిన ఎస్ఈసీ తొలుత ఆ పట్టణాల్లో తుది జాబితాలను నిలిపివేయాలని అధికారులకు సూచించింది. దీంతో జిల్లాలోని దర్శిలో పోటీ ఉన్న అభ్యర్ధుల జాబితాను ప్రకటించకుండా నిలిపివేసిన అధికారులు మిగతా మూడుచోట్ల సంబంధిత ప్రక్రియను చేపట్టారు. అయితే రాత్రికి ఇతర చోట్ల కూడా తాత్కాలికంగా నిలిపివేయాలని గురువారం స్పష్టత ఇచ్చాక పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటించాలని ఎస్ఈసీ సూచించడంతో తదనుగుణంగా అధికారులు జాబితాలను ప్రకటించకుండా ఆపేశారు. అయితే బుధవారం సాయంత్రం వరకు దాఖలైన ఉపసంహరణల ప్రకారం అందిన సమాచారం మేరకు ఒంగోలులో మూడు డివిజన్ల కార్పొరేటర్లను అలాగే అద్దంకిలో మూడు కౌన్సిలర్ స్థానాలను టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకున్నట్లు తెలిసింది. అలాగే ఒంగోలు కార్పొరేషన్ మేయర్ స్ధానానికి 15మంది అభ్యర్ధులు రంగంలో ఉండగా అద్దంకిలో చైర్మన్ స్ధానానికి ఆరుగురు, కౌన్సిలర్ స్థానాలకు 68. అలాగే చీమకుర్తిలో చైర్మన్ స్థానానికి ముగ్గురు, కౌన్సిలర్లకు 67మంది పోటీలో ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన అధికారికంగా గురువారం వెల్లడించే అవకాశం ఉంది.