Share News

గంగ.. దిగజారంగ..

ABN , Publish Date - Nov 15 , 2026 | 02:31 AM

మార్కాపురం జిల్లాలో గత ఏడాది నవంబరులో సగటున 10.80 మీటర్ల లోతులో భూగర్భ జలం ఉన్నట్టు ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది నవంబరు 14 నాటికి అది 22.82 మీటర్ల లోతుకు చేరింది. అంటే ఏడాదిలో 12.02 మీటర్ల తగ్గుదల ఉంది.

గంగ.. దిగజారంగ..
బేస్తవారపేటలో 700 అడుగుల్లో బోరు వేసినా మట్టి తప్ప నీరు రాని దృశ్యం

రైతులకు పంటలపై బెంగ

కొత్తబోర్లు తవ్వినా కానరాని జలం

ఉన్న వాటిలో నీరురాని వైనం

గత మూడు నెలల్లో 232 మి.మీ లోటు వర్షపాతం

ఏడాదిలో 12 మీటర్ల లోతుకు వెళ్లిన వైనం

మార్కాపురం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం జిల్లాలో గత ఏడాది నవంబరులో సగటున 10.80 మీటర్ల లోతులో భూగర్భ జలం ఉన్నట్టు ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది నవంబరు 14 నాటికి అది 22.82 మీటర్ల లోతుకు చేరింది. అంటే ఏడాదిలో 12.02 మీటర్ల తగ్గుదల ఉంది. వర్షపాతంలోనూ లోటు కనిపిస్తోంది. గత మూడు నెలల్లో జిల్లా సగటు వర్షపాతం 588.12 మి.మీ కాగా, శనివారం వరకు 232.39 మి.మీ లోటు నమోదైంది. ఈఏడాది సెప్టెంబరులో 114.85 మి.మీకు గాను 91.62 మి.మీ, అక్టోబరులో 179.20 మి.మీకు 38.34 మి.మీ వర్షం మాత్రమే కురిసింది. జిల్లాలోని మొత్తం 21 మండలాల్లో భూగర్భ జలాన్ని పరిశీలిస్తే.. గత ఏడాదికి, ఇప్పటికి చాలా మండలాల్లో 50 శాతం తగ్గుదల కనిపిస్తోంది. పీసీపల్లి, పొదిలి, వెలిగండ్ల, హనుమంతునిపాడు, తర్లుపాడు మండలాలు మినహా మిగిలిన అన్ని చోట్లా అట్టడుగుకు నీటిమట్టం చేరింది. ప్రస్తుతం బోర్లపై ఆధారపడి పంటలు సాగు చేసిన రైతులు వాటిని కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు. గిద్దలూరులో గత ఏడాది నవంబరులో 29.29 మీటర్ల లోతులో ఉన్న నీరు ప్రస్తుతం 70.01 మీటర్లకు వెళ్లింది. పుల్లలచెరువులో గత ఏడాది ఇదే సమయంలో 17.24 మీటర్లలో ఉన్న నీరు ఇప్పుడు 42.50 మీటర్ల లోతుకు చేరింది. రాచర్లలోనూ గత ఏడాది 11.16 మీటర్లలో ఉన్న నీరు ప్రస్తుతం 41.77 మీటర్లకు చేరినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వ్యవసాయ బోర్లలో నీరు తగ్గిపోతుండటంతో పంటలకు తడులు కూడా అందించలేకపోతున్నారు. కొత్తగా బోర్లు తవ్వుదామని రైతులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. వేలాది రూపాయలు అప్పులు చేయడం తప్ప ప్రయోజనం కనిపించడం లేదు. గతంలో 300 నుంచి 500 అడుగుల లోతుకు తవ్వితే నీరు వచ్చే బోరు బావులు ఇప్పుడు 700 నుంచి 800 వరకు వేసినా దుమ్ము తప్ప నీరు రావడం లేదు. మళ్లీ కరువు చాయలు అలుముకుంటున్నాయా? అన్న సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Nov 15 , 2026 | 02:31 AM