పలుకరిస్తూ.. పరామర్శిస్తూ..
ABN , Publish Date - Mar 01 , 2026 | 03:13 AM
పేదల సేవలో పేరుతో రాష్ట్రప్రభుత్వం అందజేస్తున్న సామాజిక పింఛన్ల పంపిణీ శనివారం జిల్లావ్యాప్తంగా ఉత్సాహంగా సాగింది. ప్రతినెలా 1వతేదీన వీటిని ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేస్తుండగా మార్చి పింఛన్లను 1వతేదీ ఆదివారం కావడంతో ముందుగా శనివారమే ఇచ్చారు.
ఈసారి కూడా ఒకరోజు ముందుగానే అందజేత
దావగుడూరులో మంత్రి డాక్టర్ స్వామి, ఏల్చూరులో మంత్రి గొట్టిపాటి హాజరు
ఇతర నియోజకవర్గాల్లో శాసనసభ్యులు, ముఖ్యనేతలు, అధికారులు భాగస్వామ్యం
ఒంగోలు, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి) : పేదల సేవలో పేరుతో రాష్ట్రప్రభుత్వం అందజేస్తున్న సామాజిక పింఛన్ల పంపిణీ శనివారం జిల్లావ్యాప్తంగా ఉత్సాహంగా సాగింది. ప్రతినెలా 1వతేదీన వీటిని ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేస్తుండగా మార్చి పింఛన్లను 1వతేదీ ఆదివారం కావడంతో ముందుగా శనివారమే ఇచ్చారు. ఇలా ఒకరోజు ముందుగా అందజేయడం ఇది వరుసగా మూడోసారి. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,19,557 వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, చేనేత ఇతరత్రా పింఛన్‌దారులకు రూ.95.38కోట్లు ఈనెలకు మంజూరయ్యాయి. వాటిని శుక్రవారం సాయంత్రానికే బ్యాంకుల నుంచి స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డుల సిబ్బంది డ్రాచేశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఉదయం పది గంటలలోపే 75శాతం మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వేలిముద్రలు వేయించుకొని నగదును అందజేశారు. సాయంత్రం నాలుగు గంటలకల్లా 88శాతానికిపైగా లబ్ధిదారులకు ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాలతో కీలక ప్రజాప్రతినిధులు, టీడీపీకి చెందిన వివిధ స్థాయిల్లోని ముఖ్యనేతలు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. జిల్లాకు చెందిన సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి జరుగుమల్లి మండలం దావగుడూరులో, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంతమగులూరు మండలం ఏల్చూరులో పింఛన్లు పంపిణీ చేశారు. పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారిని పలుకరించారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నగరంలోని 23వ వార్డులో, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే బీఎన్.విజయకుమార్ మద్దిపాడు బీసీ కాలనీలో, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు పట్టణంలోని పోతురాజుమిట్ట ప్రాంతంలో పింఛన్‌లను పంపిణీచేశారు. మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కొండపి మండలం చిన్నవెంకన్నపాలెంలో పింఛన్లు పంపిణీ చేయగా దర్శి ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి పట్టణంలో పాల్గొన్నారు. కలెక్టర్ రాజాబాబు ఏల్చూరులో మంత్రి గొట్టిపాటితో కలిసి కార్యక్రమంలో పాల్గొనగా పలు ఇతరచోట్ల వివిధ స్థాయిల్లోని అధికారులు, అధికారపార్టీ నేతలు భాగస్వాములయ్యారు. చాలాప్రాంతాల్లో మధ్యాహ్నం విరామం ఇచ్చి సాయంత్రం కూడా పంపిణీ చేయగా అందుబాటులో లేని లబ్ధిదారులకు సోమవారం ఇవ్వనున్నారు.