Share News

అనధికార పొగాకు కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్‌

ABN , Publish Date - Sep 26 , 2026 | 03:17 AM

ఈ సీజన్‌ (2025-26)లో అధిక, అనధికార సాగుతో ఉత్పత్తి అయిన పొగాకును అపరాధ రుసుం లేకుండా కొనుగోలు చేసేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రెండు రోజుల క్రితం ఇందుకు అంగీకారం తెలపగా తాజాగా కేంద్రవాణిజ్యమంత్రిత్వ శాఖ సెక్రటరీ నితిన్‌కుమార్‌ యాదవ్‌ గెజిట్‌ విడుదల చేశారు.

అనధికార పొగాకు కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్‌

గెజిట్‌ విడుదల చేసిన కేంద్ర వాణిజ్య శాఖ

ఈ సీజన్‌ వరకు అనుమతి

ఒంగోలు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఈ సీజన్‌ (2025-26)లో అధిక, అనధికార సాగుతో ఉత్పత్తి అయిన పొగాకును అపరాధ రుసుం లేకుండా కొనుగోలు చేసేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రెండు రోజుల క్రితం ఇందుకు అంగీకారం తెలపగా తాజాగా కేంద్రవాణిజ్యమంత్రిత్వ శాఖ సెక్రటరీ నితిన్‌కుమార్‌ యాదవ్‌ గెజిట్‌ విడుదల చేశారు. దీంతో రాష్ట్రంతోపాటు దక్షిణాదిలో అనధి కారికంగా సాగు చేసిన పొగాకు, అలాగే అధిక పంట కొనుగోలుకు మార్గం సుగమం అయింది. రాష్ట్రంలో ప్రస్తుత మార్కెట్‌ జరుగుతున్న సీజన్‌కు 142 మిలియన్‌ కిలోలు, దక్షిణాదిలో 90.50 మిలియన్‌ కిలోలకు అనుమతి ఇవ్వగా రాష్ట్రంలో 230 మిలియన్‌ కిలోలు, దక్షిణాదిలో 142 మిలియన్‌ కిలోలు ఉత్పత్తి అయినట్లు అంచనా వేశారు. అలా భారీగా పంట ఉత్పత్తితో మార్కెట్‌ సంక్షోభంలోకి వెళ్లి గందరగోళ పరిస్థితి నెలకొన్న విషయం విదితమే. వచ్చే ఏడాది ఈ పరిస్థితి రాకుండా చూసేందుకు గతంలో అధిక పంటపై ఉన్న అపరాధ రుసుంను మళ్లీ విఽధించడం, వచ్చే సీజన్‌కు భారీగా పంట కోత పెట్టాలని బోర్డు నిర్ణయించింది. అయితే వచ్చే ఏడాదికి పంట ఉత్పత్తి పరిమాణంలో కోతకు ఓకే చెప్పిన రైతులు ఈ సీజన్‌ అపరాధ రుసుంపై అభ్యంతరం తెలిపారు. దీంతో రాష్ట్రప్రభుత్వం, మంత్రులు జోక్యం చేసుకొని అపరాధ రుసుం లేకుండా కొనుగోలు చేయాలని బోర్డును కోరడంతో అందుకు కేంద్రం అనుమతి కోసం పంపింది. దీనిని నెలరోజులకుపైగా పెండింగ్‌లో ఉంచడంతో టీడీపీ పార్లమెంటరీ పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి విషయాన్ని కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ దృష్టికి తీసుకెళ్లారు. పొగాకు సమస్యపై జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల అండగా ఢిల్లీలో సంబంధిత శాఖలతో మాట్లాడుతున్న శ్రీకృష్ణదేవరాయలు ఈసారి కూడా ఆయా శాఖల అధికారులతో సంప్రదింపులు జరిపారు. దీంతో ఆ ఫైల్‌ క్లియర్‌ అయ్యింది. ఈ సీజన్‌ వరకు అపరాధ రుసుం లేకుండా కొనుగోలుకు అనుమతిచ్చింది. దీని వల్ల పొగాకు రైతులకు కొంతవరకు మేలు చేకూరనుంది.

Updated Date - Sep 26 , 2026 | 03:17 AM