Share News

ఆయిల్‌పామ్‌కు గ్రీన్‌సిగ్నల్‌

ABN , Publish Date - Jul 09 , 2026 | 02:45 AM

రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగును పెంచేందుకు ఉద్యాన శాఖ ప్రణాళిక రూపొందించింది. నేల స్వభావాన్ని పరీక్షించి అనువైన ప్రాంతాలను గుర్తించింది. మార్కాపురం జిల్లాలో 12, ప్రకాశం జిల్లాలో 4 మండలాలను ఎంపిక చేసింది.

ఆయిల్‌పామ్‌కు గ్రీన్‌సిగ్నల్‌

మార్కాపురంలో 12, ప్రకాశంలో 4 మండలాల ఎంపిక

రైతులకు ప్రభుత్వాల ప్రోత్సాహం

తోటల అభివృద్ధికి కంపెనీలకు ఆహ్వానం

చర్యలు ప్రారంభించిన ఉద్యానశాఖ

మార్కాపురం, జూలై 8 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగును పెంచేందుకు ఉద్యాన శాఖ ప్రణాళిక రూపొందించింది. నేల స్వభావాన్ని పరీక్షించి అనువైన ప్రాంతాలను గుర్తించింది. మార్కాపురం జిల్లాలో 12, ప్రకాశం జిల్లాలో 4 మండలాలను ఎంపిక చేసింది. ఈ మండలాల్లో రైతులకు ప్రోత్సాహకాలు అందించనుంది. నాణ్యమైన మొక్కల సరఫరా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాయితీ రూపంలో సాయం, డ్రిప్‌ ఇరిగేషన్‌ సబ్సిడీ, ఎరువుల నిర్వహణ తదితర విషయాల్లో రైతులకు ఉద్యాన శాఖ ప్రోత్సాహం అందిస్తుంది. పైగా ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమల్లోకి వస్తున్న రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌ ద్వారా ఉద్యాన రైతులకు మరిన్ని రాయితీలు అందనుండడంతో ఈ ఆయిల్‌పామ్‌ తోటల సాగు రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఆయిల్‌పామ్‌ ప్లాంటేషన్‌ అభివృద్ధికి ఆసక్తి ఉన్న కంపెనీల కోసం ఉద్యానశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కంపెనీల ఎంపిక పూర్తి కాగానే సాగు పనులు ప్రారంభమవుతాయి.

కంపెనీలకు బాధ్యతలు

ఆయా మండలాల్లో తోటల సాగుకు చర్యలు చేపట్టేందుకు అనుమతి పొందిన కంపెనీలు రైతులకు నాణ్యమైన మొక్కల సరఫరా నుంచి అవసరమైన సాంకేతిక సలహాలను అందిస్తూ సహకరిస్తాయి. ఫీల్డ్‌ అధికారులను నియమించుకుని తోటలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన సూచనలు ఇస్తాయి. పంట కొనుగోలు, సకాలంలో రవాణాతోపాటు ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తాయి. రైతులకు శిక్షణ కార్యక్రమాలు, అవగాహన శిబిరాలు, క్షేత్ర ప్రదర్శనలు ఇచ్చి మెళకువలు తెలియజేస్తాయి. ముఖ్యంగా ఉద్యానవన శాఖ రాయితీలను రైతులకు అందేలా కూడా ఈ కంపెనీలు బాధ్యత వహిస్తాయి.

ఎంపికైన మండలాలు

ఆయిల్‌పామ్‌ తోటల సాగుకు రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 63 మండలాలు ఎంపికయ్యాయి. వాటిలో ప్రకాశం, మార్కాపురం జిల్లాలు ఉన్నాయి. ప్రకాశంలో కురిచేడు, దర్శి, ముండ్లమూరు, దొనకొండ మండలాలు ఉన్నాయి. మార్కాపురం జిల్లాలో గిద్దలూరు, అర్ధవీడు, త్రిపురాంతకం, దోర్నాల, పుల్లలచెరువు, బేస్తవారపేట, కొమరోలు, రాచర్ల, తర్లుపాడు, ఎర్రగొండపాలెం, కంభం మండలాలను ఎంపిక చేశారు. ఆ ప్రాంతాల్లో ఆయిల్‌పామ్‌ తోటల సాగు చేయనున్నారు.

Updated Date - Jul 09 , 2026 | 02:45 AM