Share News

పచ్చ బంగారం

ABN , Publish Date - Sep 12 , 2026 | 03:08 AM

సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. వ్యర్థాలను సైతం ఆదాయ వనరులుగా మార్చేందుకు ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులు శ్రీకారం పలికారు. ఇన్నాళ్లూ నిరుపయోగంగా వదిలేసిన చెత్తను ఇకపై సంపదగా మార్చడంపై కలెక్టర్‌ రాజాబాబు దృష్టి సారించారు.

పచ్చ బంగారం
గ్రీన్‌ గోల్డ్‌ ఎరువుల ఉత్పత్తులను ప్రారంభిస్తున్న మంత్రి లోకేష్‌ (ఫైల్‌)

తడి, పొడి చెత్త సేంద్రియ ఎరువుగా మార్పు

దక్షిణ భారతదేశంలోనే ఒంగోలులో తొలిసారిగా..

‘గ్రీన్‌ గోల్డ్‌’ పేరుతో మార్కెట్‌లో విక్రయాలకు సిద్ధం

ప్రయోగాత్మకంగా వేస్ట్‌ టూ వెల్త్‌ నిర్వహణ

కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో రాజాబాబును

ప్రత్యేకంగా అభినందించిన సీఎం చంద్రబాబు

ఒంగోలు కార్పొరేషన్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. వ్యర్థాలను సైతం ఆదాయ వనరులుగా మార్చేందుకు ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులు శ్రీకారం పలికారు. ఇన్నాళ్లూ నిరుపయోగంగా వదిలేసిన చెత్తను ఇకపై సంపదగా మార్చడంపై కలెక్టర్‌ రాజాబాబు దృష్టి సారించారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ ప్రక్రియకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు లభించాయి. నగరంలో ప్రతిరోజూ సేకరించేతడి, పొడిచెత్తను వేరు చేసి వాటి ద్వారా సేంద్రియ ఎరువులను తయారు చేసి ఆదాయ వనరులుగా మార్చుకునే దిశగా చేపట్టిన ప్రయత్నం రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మునిసిపా లిటీలకు మార్గదర్శకంగా మారింది. శుక్రవారం అమరావతిలో జరిగిన కలెక్టర్‌ల కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ పి.రాజాబాబు ‘వేస్ట్‌ టూ వెల్త్‌’పై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ‘గ్రీన్‌ గోల్డ్‌’ పేరుతో ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంశలు కురిపించారు. ఇదేతరహా విధానం అన్ని జిల్లాలలో అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని ఇతర కలెక్టర్లను, పురపాలకశాఖ అధికారులను ఆదేశించారు.

కంపోస్ట్‌ ఎరువుగా తయారు

ఇంట్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలు, కూరగాయల తొక్కలు, ఎండిన ఆకులను కుళ్లబెట్టడం ద్వారా మేలైన సేంద్రియ ఎరువును తయారు చేస్తారు. దానిని మొక్కలకు వినియోగించుకోవడానికి మార్కెటింగ్‌ చేసి వాటి ద్వారా ఆదాయాన్ని సమకూర్చుతారు. అలాగే వాడి పడేసిన ప్లాస్టిక్‌ బాటిళ్లను, కవర్లను కరిగిస్తారు. కొత్త వస్తువులు, పైపులు తయారీకి, రోడ్ల నిర్మాణానికి వాడే తారు మిశ్రమంగా మారుస్తారు. ఒంగోలు కార్పొరేషన్‌ పరిధిలో ప్రతిరోజూ 125 టన్నుల వ్యరాలను సేకరిస్తుండగా వాటిని బయో విజార్డ్‌ మైక్రోబ్‌ ద్వారా సేంద్రియ ఎరువుగా తయారు చేసి అమ్మకాలకు సిద్ధం చేశారు.

గ్రీన్‌గోల్డ్‌ పేరుతో మార్కెట్‌లోకి..

ఒంగోలు నగరపాలక సంస్థ చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో చెత్తను సేంద్రియ ఎరువులుగా మార్చి దానికి ‘గ్రీన్‌గోల్డ్‌’గా నామకరణం చేశారు. తడి, పొడి చెత్తను ప్రాథమికంగా వేరు చేసి వాటి ద్వారా బయో విజార్డ్‌, మైక్రో ఆర్గానిక్‌ విధానంలో పౌడరుగా మార్చి ఎరువులను తయారుచేస్తారు. సాధారణంగా వ్యర్థాల నుంచి దుర్వాసన పోవడానికి కనీసం45 రోజులు పడుతుంది. కొత్త విధానం ద్వారా 15 నిమిషాల్లో వాసన పోయి, 15 రోజుల్లో సేంద్రియ ఎరువుగా మారుతుంది. వీటిని ప్రత్యేకమైన ప్యాకెట్‌లలో భద్రపరిచి మార్కెట్‌లో అమ్మకానికి సిద్ధం చేశారు. బయో ఫెర్టిలైజర్‌, నిఖిల్‌ సంస్థతో మార్కెటింగ్‌ ఒప్పందానికి సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

నెలకు రూ.2.8 లక్షల ఆదాయం

ప్రతిరోజూ ఒంగోలు నగరంలో 125 టన్నుల వ్యర్థాలు సేకరిస్తున్నారు. వివిధ ప్రక్రియల అనంతరం వీటి నుంచి 25టన్నుల సేంద్రియ ఎరువు తయారవుతుంది. ఆ ఎరువును కిలో రూ.10కి విక్రయించడం ద్వారా నెలకు రూ.2.2 లక్షల నుంచి రూ.2.8లక్షల వరకు ఆదాయం లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా గ్రీన్‌గోల్డ్‌ ప్రొడక్టుకు ఇప్పటికే మార్కెట్‌లో మంచి ఆదరణ లభిస్తుండటంతో కార్పొరేషన్‌కు ఆదాయ వనరులు మరింత పెరగనున్నాయి.

Updated Date - Sep 12 , 2026 | 03:08 AM