లాక్‌డౌన్ యోచనలో గ్రానైట్ పరిశ్రమ
ABN , Publish Date - Apr 26 , 2026 | 11:35 PM
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గెలాక్సీ గ్రానైట్ పరిశ్రమపై డీజిల్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. క్వారీల్లో ఆదివారం ఉత్పత్తి ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇదేపరిస్థితి కొనసాగితే లాక్‌డౌన్‌కు వెళ్లాలని యజమానులు యోచిస్తున్నారు.
డీజిల్ కొరత నేపథ్యంలో యజమానుల సమాలోచన
నేడోరేపో తుదినిర్ణయం
చీమకుర్తి, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి) : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గెలాక్సీ గ్రానైట్ పరిశ్రమపై డీజిల్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. క్వారీల్లో ఆదివారం ఉత్పత్తి ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇదేపరిస్థితి కొనసాగితే లాక్‌డౌన్‌కు వెళ్లాలని యజమానులు యోచిస్తున్నారు. దీనిపై నేడో, రేపో నిర్ణయం తీసుకోనున్నారు. రామతీర్థం పరిసర ప్రాంతాల్లో 42 గెలాక్సీ గ్రానైట్ క్వారీలున్నాయి. దాదాపు ప్రతీ క్వారీకి వారి ప్రాంగణంలో పెట్రోల్ బంక్ ఉంది. వారికి బహిరంగ మార్కెట్ కంటే లీటర్ రూ.5 వరకూ తక్కువ ధరకు ఆయిల్ కంపెనీలు ప్రత్యేకంగా డీజిల్ సరఫరా చేస్తాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం మొదలవ్వక ముందు పారిశ్రామిక డీజిల్ లీటర్ ధర ప్రభుత్వ సబ్సిడీ పోను సుమారు రూ.93లకు సరఫరా అయ్యేది. యుద్ధం ప్రారంభమయ్యాక డీజిల్ రేటును రెండు విడతలుగా దాదాపు లీటర్‌కు రూ.60వరకు పెంచాయి. ప్రస్తుతం రూ.152 వసూలు చేస్తున్నాయి. ఈ క్వారీల్లో రోజుకు డీజిల్ వినియోగం దాదాపు లక్ష లీటర్ల వరకూ ఉంటుంది. డీజిల్ ధర పెంపుతో పరిశ్రమపై రోజుకు దాదాపు అరకోటి భారం పడుతోంది. దీంతో క్వారీల యజమానులు నిన్నమొన్నటి వరకూ చీమకుర్తి పట్టణంలో ఉన్న బయట బంకులలో డీజిల్‌ను కొనుగోలు చేస్తూ భారం నుంచి తప్పించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు బహిరంగ బంకులలో డీజిల్ కొరత ఏర్పడటంతో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. బంకుల నిర్వాహకులు డీజిల్‌ను గ్రానైట్ క్వారీల యజమానులకు బ్లాక్‌లో ఎక్కువ ధరకు అమ్ముకుంటూ సామాన్య ప్రజలకు లేదని చెప్తున్నారన్న ఆరోపణలు పట్టణ వాసుల నుంచి వెల్లువెత్తుతున్నాయి.