Share News

నూజెళ్లపల్లిలో ఘనంగా పారువేట, గ్రామోత్సవం

ABN , Publish Date - Oct 21 , 2026 | 11:30 PM

పంగులూరు, మండలంలోని నూజెళ్లపల్లిలో దశాబ్దన్నరకాలంగా నిలిచిన దసరా ఉత్సవాలు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు మంగళవారం ఘనంగా నిర్వహించారు.

నూజెళ్లపల్లిలో ఘనంగా పారువేట, గ్రామోత్సవం
జమ్మిచెట్టు వద్ద శమిపూజ చేస్తున్న స్వస్థివాచకులు

హైకోర్టు ఉత్తర్వుల మేరకు 15 ఏళ్ల తర్వాత నిర్వహణ

పంగులూరు, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి) : మండలంలోని నూజెళ్లపల్లిలో దశాబ్దన్నరకాలంగా నిలిచిన దసరా ఉత్సవాలు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని శ్రీరాజరాజేశ్వరి దేవస్థానానికి సంబంధించి విజయదశమి సందర్భంగా పారువేట, శమిపూజ, గ్రామోత్సవం కార్యక్రమాలు అర్చకులు, స్వస్థి వాచకులు సంయుక్తంగా నిర్వహించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు పోలీస్‌ పటిష్ట బందోబస్తు మధ్య దేవస్థానం అధికారులు, తహసీల్దార్‌ పర్యవేక్షణలో వేడుకలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. వంశపారంపర్య అర్చకులు ఉత్సవమూర్తులను ఆలయం నుంచి తోడ్కొని వచ్చేందుకు సహకరించకపోవడంతో జిల్లా దేవదాయ శాఖ అధికారి అమర్నాథ్‌ పర్యవేక్షణలో ఈవో శ్రీనివాసరావు ప్రత్యామ్నాయ అర్చకస్వాములతో క్రతువును శాస్ర్తోక్తంగా జరిపించారు. స్వస్థివాచకులు నిర్వహించిన పారువేట, శమిపూజ కార్యక్రమాలలో మహిళలు, గ్రామస్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ పర్యవేక్షణలో సీఐలు మల్లికార్జునరావు, సుబ్బరాజు, ఎస్‌ఐలు సురేష్‌, నాగరాజు పోలీస్‌ సిబ్బందితో బందోబస్తు నిర్వహించగా, తహసీల్దార్‌ సింగారావు పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2026 | 11:30 PM