Share News

శతాబ్దిన్నర ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు

ABN , Publish Date - Sep 26 , 2026 | 03:21 AM

ఒంగోలు మునిసిపాలిటీ శతా బ్దిన్నర (150 ఏళ్ల) వేడుకలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నగరంలోని మినీ స్టేడియం వేదికగా ఈనెల 30న విభిన్న కార్యక్రమాలు నిర్వహించను న్నారు. గత మూడు నెలలుగా స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, కార్పొ రేషన్‌ స్పెషల్‌ ఆఫీసర్‌, కలెక్టర్‌ రాజాబాబుల నేతృత్వంలో నగరంలో వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

శతాబ్దిన్నర ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు
శతాబ్దిన్నర ఉత్సవాలపై నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు

ఈనెల 30న ఒక్కరోజే నిర్వహణ

మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు అనేక మంది రాక

వెంకయ్య, కంభంపాటి, అయ్యన్నపాత్రుడి పర్యటన ఖరారు

మినీస్టేడియంలో 150 మంది ప్రముఖులకు సన్మానాలు

రోజంతా సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు

నగరంలో 70 జతల ఒంగోలు గిత్తలతో భారీ ప్రదర్శన

ఒంగోలు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు మునిసిపాలిటీ శతా బ్దిన్నర (150 ఏళ్ల) వేడుకలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నగరంలోని మినీ స్టేడియం వేదికగా ఈనెల 30న విభిన్న కార్యక్రమాలు నిర్వహించను న్నారు. గత మూడు నెలలుగా స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, కార్పొ రేషన్‌ స్పెషల్‌ ఆఫీసర్‌, కలెక్టర్‌ రాజాబాబుల నేతృత్వంలో నగరంలో వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో ముగింపు ఉత్సవాలను ఈనెల 28 నుంచి 30 వరకు మూడు రోజులపాటు నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. అయితే జిల్లాలో మారిన వాతావరణ పరిస్థితులు, వర్షాల నేపథ్యం, అనేక మంది ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉండటంతో గందరగోళ పరిస్థితి నెలకొంటుందని భావించారు. దీంతో మూడు రోజులకు బదులు ఒక రోజు స్థానిక మినీ స్టేడియం వేదికగా ఉత్సవాలను నిర్వహించాలన్న నిర్ణయానికి ఎమ్మెల్యే జనార్దన్‌, కలెక్టర్‌ రాజాబాబు వచ్చారు. తదనుగుణంగా ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నాయి.

ఉదయం నుంచే కార్యక్రమాలు

ఈనెల 30వతేదీ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు విరామం లేకుండా రోజంతా ఉత్సవాలను నిర్వహించేలా షెడ్యూల్‌ను రూపొందించారు. వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ అన్ని విషయాలపై స్వీయ పర్యవేక్షణ చేస్తుండటంతోపాటు పలువురు ప్రముఖులు స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, జిల్లా వాసి అయిన ఒడిశా గవర్నర్‌ డాక్టర్‌ కంభంపాటి హరిబాబు, శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుల పర్యటన ఖరారయ్యాయి. వెంకయ్య నాయుడు, కంభంపాటి హరిబాబులు ఆ రోజు ఉదయం జరిగే సభకు హాజరుకానున్నారు. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సాయంత్రం జరిగే సభలో పాల్గొననున్నారు.

రోజంతా సాంస్కృతిక కార్యక్రమాలు

జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లాకు చెందిన మంత్రులు డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌లతోపాటు రాష్ట్రమంత్రులు అనగారి సత్యప్రసాద్‌, బీసీ.జనార్దన్‌రెడ్డి, కందుల దుర్గేష్‌, కొల్లు రవీంద్ర, పార్థసారధి, పొంగూరు నారాయణ, టీడీపీ పార్లమెంటరీ పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయులు, రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణవంటి వారితోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన పార్లమెంట్‌, శాసనమండలి, శాసనసభ్యులు ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఒకవైపు సభలు, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు రోజంతా సాగనున్నాయి. అలాగే 150 ఏళ్ల సందర్భాన్ని పురస్కరించుకొని ఒంగోలుకు చెందిన ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్న విభిన్న రంగాలకు చెందిన 150 మంది ప్రముఖులను సన్మానించనున్నారు. ఉదయం జరిగే సభలో 75 మంది, సాయంత్రం జరిగే సభలో 75 మందిని సన్మానించేలా షెడ్యూల్‌ రూపొందిస్తున్నారు.

రాజసం ఉట్టిపడేలా ఒంగోలు జాతి ప్రదర్శన

ఈ ప్రాంతానికి ప్రపంచవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు ఒంగోలు గిత్తలతో రాగా ఈ ఉత్సవాల సందర్భంగా 70ఎడ్ల జతలతో నగరంలో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించనున్నారు. 30వ తేదీ సాయంత్రం 4గంటలకు మినీ స్టేడియం నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రదర్శన అద్దంకి బస్టాండు సెంటర్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం వరకు కొనసాగనుంది. పట్టణ ప్రజలంతా తిలకించేలా ప్రధాన వీధుల నుంచి ఇది సాగనుంది. రాజసం ఉట్టిపడేలా నడిచే ఎడ్లకు ప్రత్యేక బహుమతులను కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా ఉత్సవాల విజయవంతం కోరుతూ ఆదివారం నగరంలో హెరిటేజ్‌ వాక్‌ పేరుతో భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యువకులు విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన వేలాది మందితో మినీ స్టేడియం నుంచి ఉదయం 8గంటలకు ప్రధాన వీధుల్లో ఈ వాక్‌ సాగుతుంది. నగరంలో వివిధ రూపాలలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.

Updated Date - Sep 26 , 2026 | 03:22 AM