Share News

ధాన్యం కొనుగోళ్లు నత్తనడక

ABN , Publish Date - Jan 11 , 2026 | 01:38 AM

రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏర్పా టుచేసిన కొనుగోలు కేంద్రాలు నామమాత్రం గా పనిచేస్తున్నాయి. సివిల్‌ సప్లయీస్‌ అధి కారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటివరకు అధికారుల లెక్కల ప్రకారం సాగుచేసిన వరి విస్తీర్ణంలో పది శాతం కూడా కొనుగోలు చేయలేదు.

ధాన్యం కొనుగోళ్లు నత్తనడక
పొలాల సమీపంలో ఆరబోసిన ధాన్యం

దగా చేస్తున్న ప్రైవేటు వ్యాపారులు

భారీగా నష్టపోతున్న రైతులు

దర్శి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి) : రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏర్పా టుచేసిన కొనుగోలు కేంద్రాలు నామమాత్రం గా పనిచేస్తున్నాయి. సివిల్‌ సప్లయీస్‌ అధి కారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటివరకు అధికారుల లెక్కల ప్రకారం సాగుచేసిన వరి విస్తీర్ణంలో పది శాతం కూడా కొనుగోలు చేయలేదు. ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను దోచుకుంటున్నారు. కేంద్రాల వద్ద సక్రమంగా కొనుగోళ్లు జరక్కపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తు న్నారు. దీంతో బస్తాకు రూ.400 చొప్పున నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సక్రమంగా సేకరించకపోవడంతో ఇబ్బంది పడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.

8,600 మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు

జిల్లా మొత్తంగా ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల ద్వారా 8,600 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. దర్శి నియోజకవర్గంలో 4,500 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. దర్శి నియోజకవర్గంలో ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు 20వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కేవలం రెండువేల ఎకరాల్లో పండిన పంటను మాత్రమే సేకరించారు. అధికశాతం మంది రైతులు ఇప్పటికే ప్రైవేటు వ్యాపారులకు విక్రయించుకున్నారు. ఇప్పటికైనా కొనుగోళ్లను వేగవంతంగా నిర్వహించకుంటే మిగిలిన రైతులు కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొంటాయి.

దగా చేస్తున్న ప్రైవేటు వ్యాపారులు

ప్రైవేటు వ్యాపారులు రైతులను దగా చేస్తున్నారు. 75 కేజీల ధాన్యం బస్తాను కేవలం రూ.1,400 కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభంకాకముందు కూడా ఇదేవిధంగా వ్యవహరించారు. ఆ తర్వాత రైతులు అటువైపు వెళ్తుండటంతో వ్యాపారులు కొంతమేర ధర పెంచి రూ.1500 వరకూ ఇచ్చారు. కొద్దిరోజుల తర్వాత కొనుగోలు కేంద్రాలు మొక్కుబడిగా పనిచేస్తుండటంతో ఈవిషయాన్ని గుర్తించిన ప్రైవేటు వ్యాపారులు మళ్లీ ధరలు తగ్గించి 75 కేజీల బస్తాను రూ.1400కు కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకుంటే గ్రేడ్‌-1 రకం 75 కేజీల బస్తాకు రూ.1,792, సాధారణ రకానికి రూ.1,777 ధర లభిస్తుంది. అక్కడ అధికశాతం మంది రైతులకు అవకాశం లభించకపోవటంతో ప్రైవేటు వ్యాపారులపై ఆధారపడాల్సి వస్తోంది. కొనుగోలు కేద్రాలకు ప్రభుత్వం సంమృద్ధిగా నిధులు విడుదల చేసినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంతో రైతులు నష్టపోతున్నారు. కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు వెంటనే నగదు జమవుతోంది. అయినప్పటికీ కేంద్రాల్లో కొనుగోళ్లు సక్రమంగా జరక్కపోవడంతో రైతులకు న్యాయం జరగడం లేదు. ఉన్నతాధికారులు ఈవిషయాన్ని గుర్తించి కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకొని పండించిన పంటను పూర్తిగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Jan 11 , 2026 | 01:38 AM