ధాన్యం.. దైన్యం
ABN , Publish Date - Mar 26 , 2026 | 02:30 AM
రబీలో సాగుచేసిన వరి పంట దిగుబ డులు ఇళ్లకు చేరుతున్నప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు.
ఇళ్లకు చేరుతున్న రబీ వరి దిగుబడులు
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మరిచిన అధికారులు
దర దిగజార్చి దోచుకుంటున్న ప్రైవేటువ్యాపారులు
పెద్దఎత్తున నష్టపోతున్న అన్నదాతలు
దర్శి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : రబీలో సాగుచేసిన వరి పంట దిగుబ డులు ఇళ్లకు చేరుతున్నప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. దర్శి ప్రాంతంలో రబీ సీజన్‌లో సాగు చేసిన వరి కోతలు మార్చి ఆరంభం నుంచే ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 60శాతానికిపైగా పంట ఇళ్లకు చేరింది. మిగిలిన దాన్ని ముమ్మరంగా కోసి నూరుస్తున్నారు. అయితే సివిల్ సప్లయీస్ అధికారులు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు గురించి పట్టించుకోలేదు. ఖరీఫ్ సీజన్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాలలో ఫిబ్రవరి 21 వరకు ధాన్యం సేకరించారు. ఆ తర్వాత రబీ పంట కొనుగోళ్లను కొనసాగిస్తారని భావించినప్పటికీ అలా జరగలేదు. మార్చి నెలాఖరు వరకు ఖరీఫ్ అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతూ వచ్చారు. అయితే ఎందుకు కొనుగోళ్లు జరగడంలేదో అర్థంకాని పరిస్థితి. రబీ సీజన్‌లో పండిన పంటను కొనుగోలు చేసేందుకు ఏప్రిల్ మొదటి వారంలో కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అనేకమంది రైతులు నేరుగా సివిల్ సప్లయీస్ అధికారులకు ఫోన్ చేసి కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వలన నష్టపోతున్నామని మొత్తుకున్నప్పటికీ వారి మొర ఆలకించడం లేదు. ప్రస్తుతం రబీ సీజన్‌లో పండిన పంట 75 కేజీల బస్తాను ప్రైవేటు వ్యాపారులు రూ.1,200కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించక రైతులు నష్టపోతున్నారు. కేంద్రాలు ఆరంభించినట్లయితే ఏ-గ్రేడు రకం 75 కేజీల బస్తాకు రూ.1,792, సాధారణ రకం 75 కేజీల బస్తాకు రూ.1,777 మద్దతు ధర లభిస్తుంది. కేంద్రాలు ఏర్పాటు కాకపోవడం వలన ఒక్కో బస్తాకు రూ.500కు పైగా రాబడిని రైతులు కోల్పోతున్నారు. ప్రభుత్వం గతంలో కూడా కొన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. కేవలం ఏ-గ్రేడును మాత్రమే అవకాశం ఇచ్చింది. రబీ సీజన్‌లో అధికశాతం సాధారణ రకం వరి పంటను సాగు చేశారు. దీన్ని ఎందుకు కొనుగోలు చేయడం లేదో అర్థం కావడం లేదు. సివిల్ సప్లయీస్ అధికారులకు సాధారణ రకాన్ని కొనుగోలు చేసే ఉద్దేశం లేకపోవటంతో కేంద్రాలు ఆరంభించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు పండించిన అన్నిరకాల పంటలను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇక్కడ అధికారులు మాత్రం అందుకుభిన్నంగా వ్యవహరిస్తున్నారు. కొనుగోలుకేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరినా పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు రైతుల ఇబ్బందులను గుర్తించి వెంటనే కేంద్రాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.