ఎమ్మెల్యేలకు గ్రేడ్లు
ABN , Publish Date - Mar 01 , 2026 | 03:23 AM
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల పనితీరు కొలమానంగా గ్రేడ్లు ఇచ్చారు. సీల్డ్‌కవర్‌లో ఇచ్చిన ఆ వివరాలను రహస్యంగానే ఉంచాలని ఆదేశించారు. దీంతో ఎవరికి వారు తాము ముందు వరుసలోనే ఉన్నామంటూ చెప్పుకుంటుండగా కొందరు అసలు తెరిచి చూడలేదని తెలుస్తోంది.
కానీ అంతా సీక్రెట్
మంత్రి రవికుమార్ రాష్ట్రంలో టాప్-3 అని ప్రకటించిన సీఎం చంద్రబాబు
సీల్డ్ కవర్‌లో పలు అంశాలు
వాటిని వెల్లడించవద్దని ఆదేశాలు
ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలకు మీదే బాధ్యత అంటూ హెచ్చరిక
ఎమ్మెల్యేల సహకారం లేదంటూ ఎంపీల ఆవేదన
మార్కాపురం జిల్లాపై ప్రత్యేక ఫోకస్
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల పనితీరు కొలమానంగా గ్రేడ్లు ఇచ్చారు. సీల్డ్‌కవర్‌లో ఇచ్చిన ఆ వివరాలను రహస్యంగానే ఉంచాలని ఆదేశించారు. దీంతో ఎవరికి వారు తాము ముందు వరుసలోనే ఉన్నామంటూ చెప్పుకుంటుండగా కొందరు అసలు తెరిచి చూడలేదని తెలుస్తోంది. కలెక్టరు, ఎస్పీ, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం బాగుందని సీఎం మెచ్చుకున్నారు. అలాగే ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపంపై చర్చించారు. కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన బాబు ఒకవర్గం వారిని ఆకర్షించడంలో కీలకంగా వ్యవహరించాలంటూ ఎంపీ మాగుంట, ఎమ్మెల్యేలు డాక్టర్ ఉగ్ర, కందుల, ముత్తుములకు సూచించారు.
ఆంధ్రజ్యోతి, ఒంగోలు
రాష్ట్రస్థాయి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలతోపాటు ఒంగోలు, బాపట్ల ఎంపీ లతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం విదితమే. ఈ సమావేశానికి రాత్రి 7.15గంటలకు వచ్చిన సీఎం సుమారు గంటసేపు నియోజకవర్గాల వారీ ఉన్న నివేదికలపై సంబంధిత అధికారులతో అధ్యయనం చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత అధికారిక, పాలనా వ్యవహారాలపై మాట్లాడి మంచి భోజనం పెట్టించి ఆపై రాజకీయ వ్యవహారాలపై అధికారులు కూడా లేకుండా సమీక్ష చేశారు. రాత్రి పదకొండున్నర వరకు సమావేశం జరిగింది. చివర్లో పది నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు సీల్డ్‌కవర్లు అందజేశారు. అందులో అన్నిరకాల అంశాలకు సంబంధించి మీ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి, రాజకీయంగా పనితీరుపై కూడా వివరాలు ఉన్నాయని చెప్పారు. తదనుగుణంగా గ్రేడ్లు కేటాయించామన్న చంద్రబాబు.. వాటిని సమీక్ష చేసుకోవాలని సూచించారు. త్వరలో ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశాలు నిర్వహించి వివరిస్తానని కూడా తెలిపారు. ఆ సందర్భంగా ఆయన విద్యుత్ శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్ రాష్ట్రస్థాయిలో టాప్-3లో ఉన్నారని బహిరంగంగానే వెల్లడించారు. మరో మంత్రి స్వామికి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉన్నంత జోష్ ఇప్పుడు కనిపించలేదని, మంత్రిగా రాష్ట్రస్థాయిలో బ్రహ్మాండంగా ఉందని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అయితే ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇన్‌చార్జిలు ఎవరూ కవర్లలో ఉన్న అంశాలను వెల్లడించటం లేదు. ఎవరికి వారు మా పరిస్థితి బాగుంది, అది చాలని వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా సీఎం ఆదేశాల మేరకు తాము అధికారికంగా ఏమీ చెప్పలేమని సమాధానం దాటవేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. దాదాపు అందరికీ మొత్తం అంశాలపై బాగుందన్న అభిప్రాయం అందులో ఉన్నప్పటికీ ఆయా నియోజకవర్గాల పరిస్థితులకు అనుగుణంగా కొన్ని అంశాలపై కొన్ని హెచ్చరికలు కూడా ఉన్నట్లు తెలిసింది. ఒక ఎమ్మెల్యేను కనీసం మీరు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా పూర్తిగా పాల్గొనలేదని హెచ్చరించినట్లు తెలిసింది. ఒక ఇన్‌చార్జికి సీనియర్లను కలుపుకొని పోవాల్సిందేనని సూచించినట్లు తెలిసింది. అదేసమయంలో విడివిడిగా మాట్లాడినప్పుడు కొందరి విషయాలను లోతుగా సమీక్షిస్తానని అంటూ మీలో ఒకరి విషయాలు ఒకరికి కూడా తెలియకూడదన్న ఉద్దేశంతో కొన్ని విషయాలను చర్చించటం లేదని చెప్పారు.
కుటుంబసభ్యుల విషయంలో తస్మాత్ జాగ్రత్త
‘నియోజకవర్గాలలో మీ కుటుంబసభ్యులు లేక మీ మిత్రులు కాకుంటే మీ బంధువులు ఎవరు తప్పుచేసినా మీకు చెడ్డపేరు వస్తుంది. మీ నుంచి నాపైన ఆ ప్రభావం ఉంటుంది. కావున ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి, పాలనలో పార్టీ వ్యవహారాల్లో వారి జోక్యాన్ని తగ్గించండి’ అని సీఎం చాలా సూటిగా చెప్పినట్లు తెలిసింది. కొందరికి తమ్ముళ్లు, అన్నలు అయితే మరికొందరికి సతీమణులు ఇంకొందరికి మిత్రుల ద్వారా ప్రమాదం పొంచి ఉందని చాలా స్పష్టంగా హెచ్చరించినట్లు తెలిసింది.
మీ నలుగురిదే బాధ్యత
ఎంపీ మాగుంట, ఎమ్మెల్యేలు ఉగ్రనరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డిల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ప్రజల కోరిక అంటూ మీరు, మీకు మద్దతుగా మీ జిల్లా నాయకులంతా అడగ్గానే హామీ ఇచ్చినట్లుగానే మార్కాపురం జిల్లా ఇచ్చా. నూటికి నూరుశాతం వెలిగొండ జలాలు అందిస్తా. మంత్రి రామానాయుడును పదేపదే ప్రాజెక్టు వద్దకు పంపుతున్నా. అయినా ఆప్రాంతంలోని ఒక సామాజికవర్గం వారిలో రావాల్సినంత మార్పు రాలేదు. ఆ విషయంలో మీ చొరవ, మిశ్రమ పెరగాలి. ప్రజలకు రాజకీయంగా పెత్తనం చేసేవారికి మనం ఆప్రాంతానికి చేస్తున్న మేలును పాలనలో మన ప్రత్యేకతను వివరించి వారిని రాబట్టాలి. తద్వారా కొత్త ఓట్లను పార్టీకి జతచేయాలి’ అని స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. ఈ విషయంలో నలుగురు ప్రత్యేకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు తెలిసింది. నియోజకవర్గాల వారీ పార్టీ నాయకులతో ఉన్న సమన్వయలోపాన్ని వివరించిన ఆయన ఏయే సామాజికవర్గాల ప్రజలలో మద్దతు పెంచుకోవాలో కూడా వివరించినట్లు తెలిసింది.
మాగుంట ఫిర్యాదు
ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయలోపం ఉండకూడదు, కలసి పనిచేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. దీంతో కొన్ని విషయాల్లో ఎమ్మెల్యేల నుంచి సహకారం అందటం లేదని ఒంగోలు ఎంపీ ముందుగానే ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తనతోపాటు పార్టీలోకి వచ్చిన వారికి పదవులు, పనుల విషయంలో న్యాయం జరగటం లేదని చెప్పినట్లు తెలిసింది. అయితే కొందరు ఎమ్మెల్యేలు వెంటనే వారి సంస్థల సీఎస్‌ఆర్ నిధుల ద్వారా తమకు తెలియకుండానే నియోజకవర్గంలో కొందరికి పనులు కేటాయిస్తుండటం ఇబ్బందిగా ఉందని చెప్పినట్లు తెలిసింది. దీంతో సమన్వయంతో ముందుకు సాగాలని సీఎం స్పష్టంగా సూచన చేసినట్లు తెలిసింది. కాగా పాకల బీచ్ ఫెస్టివల్ బాగా చేశారని అభినందించారు. సూర్యలంక నుంచి పాకల వరకు బీచ్‌ల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలని తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రమాదాలు, డ్రగ్స్ వినియోగం, విక్రయాల నివారణకు జిల్లాలో పోలీసుశాఖ చేపట్టిన కార్యక్రమాలతో పాటు రాష్ట్రస్థాయిలో ప్రమాదాల నివారణకు ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలు ఎలా ఉపయోగపడ్డాయో ఎస్పీ హర్షవర్థన్‌రాజు వివరించగా సీఎం అభినందించినట్లు తెలిసింది. కలెక్టరు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం బాగుందని ఇదేతరహాలో ముందుకు పోవాలని సూచిస్తూ కలెక్టరు ప్రతిపాదించిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.