చీపుర్లు పట్టి.. చెత్త ఊడ్చి..
ABN , Publish Date - Feb 22 , 2026 | 02:33 AM
జిల్లావ్యాప్తంగా శనివారం స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. పలుప్రాంతాల్లో ముఖ్య ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రతినెలా మూడో శనివారం ఒక్కో ప్రత్యేక అంశాన్ని తీసుకొని చేపడుతున్న ప్రభుత్వం ఈసారి జీరో వేస్ట్‌ను తీసుకుంది.
జిల్లావ్యాప్తంగా ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’
పలుచోట్ల ముఖ్య ప్రజాప్రతినిధులు హాజరు
జరుగుమల్లిలో పాల్గొన్న మంత్రి డాక్టర్ స్వామి
ఒంగోలు, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా శనివారం స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. పలుప్రాంతాల్లో ముఖ్య ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రతినెలా మూడో శనివారం ఒక్కో ప్రత్యేక అంశాన్ని తీసుకొని చేపడుతున్న ప్రభుత్వం ఈసారి జీరో వేస్ట్‌ను తీసుకుంది. తదనుగుణంగా జిల్లాలోని అన్ని పంచాయతీలు, పట్టణాల్లో పూర్తిస్థాయిలో వ్యర్థాల నిర్మూలన, వ్యర్థాల రహిత జీవన విధానంపై ప్రజలకు అవగాహన కల్పించేలా ర్యాలీలు, సభల నిర్వహణతోపాటు చెత్త తొలగింపు కార్యక్రమాలను నిర్వహించారు. పలుప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. చీపుర్లు పట్టి చెత్తను ఊడ్చి ప్రజలంతా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ స్వామి జరుగుమల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నగరంలోని పీవీఆర్ హైస్కూలులో, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్.విజయకుమార్ సంతనూతలపాడు పంచాయతీ పరిధిలో నిర్వహించిన కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. జిల్లావ్యాప్తంగా అన్నిచోట్లా నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల డస్ట్‌బిన్‌లు పంపిణీ, స్వచ్ఛరథాలు అందజేత వంటివి కూడా చేపట్టారు.