ప్రభుత్వాలు కదలాలి
ABN , Publish Date - Jun 20 , 2026 | 02:45 AM
పొగాకు మార్కెట్లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని నివారించి రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ముందుకు రావాలని వివిధ రైతుసంఘాల నాయకులు కోరారు. అందుకోసం రెండు ప్రభుత్వాలు చెరో రూ.500 కోట్ల వంతున వెయ్యి కోట్లు కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.
పొగాకు కొనుగోళ్లకు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలి
ప్రభుత్వరంగ సంస్థలను రంగంలోకి తీసుకురావాలి
రైతు సంఘాల నేతల డిమాండ్
గిట్టుబాటు ధరలు కోరుతూ ఒంగోలులో ట్రాక్టర్‌లతో భారీ ర్యాలీ
ఒంగోలు, జూన్ 19 (ఆంధ్రజ్యోతి) : పొగాకు మార్కెట్లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని నివారించి రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ముందుకు రావాలని వివిధ రైతుసంఘాల నాయకులు కోరారు. అందుకోసం రెండు ప్రభుత్వాలు చెరో రూ.500 కోట్ల వంతున వెయ్యి కోట్లు కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. తద్వారా మార్కెట్లో పోటీ నెలకొనేలా చేయాలన్నారు. పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఒంగోలులో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో ట్రాక్టర్లు, అలాగే ద్విచక్రవాహనాలపై పొగాకు రైతులు ఒంగోలుకు ఉదయం 10 గంటలకే తరలివచ్చారు. స్థానిక మినీ స్టేడియం నుంచి నెల్లూరు బస్టాండ్, కలెక్టరేట్, ట్రంకురోడ్డు, అద్దంకి బస్టాండ్, ఆర్టీసీ డిపోల మీదుగా కర్నూల్ రోడ్డు ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు వందలాది ట్రాక్టర్లతో ర్యాలీ సాగింది. సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు, అందులో భాగస్వామ్యంగా ఉన్న వివిధ రైతు సంఘాల నాయకులు జయంత్‌బాబు, హనుమారెడ్డి, లలితకుమారి, పమిడి వెంకట్రావు, సాగర్, వీరారెడ్డి, పరిటాల కోటేశ్వరరావు, భారీగా రైతులు పాల్గొన్నారు. పొగాకు రైతులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.ప్రభాకర్‌రెడ్డి, రైతుకూలీ సంఘం ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ఇతర పలువురు రైతు సంఘాల నాయకులు మినీ స్టేడియం వద్ద ర్యాలీ ప్రారంభ సమయంలో ప్రసంగించారు. పొగాకు మార్కెట్లో ధరలను దిగజార్చి వ్యాపారులు నిలువుదోపిడీ చేస్తుంటే బోర్డు అధికారులు చేతకాని వారిలా చూస్తున్నారని విమర్శించారు. రైతుల ఆవేదనను ఆలకించి సీఎం చంద్రబాబునాయుడు... వ్యాపారులు, అధికారులతో సమీక్ష చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే కిలోకు రూ.200 ఇవ్వాలని ఆయన చెప్పడాన్ని అంగీకరించలేమని, సగటు ధర కిలోకు రూ.250 ఇవ్వకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. మార్కెట్లో పోటీ ఏర్పడితేనే రైతులకు మేలు జరుగుతుందని, అందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెయ్యి కోట్ల నిధులు ఇచ్చి ప్రభుత్వరంగ సంస్థలను రంగంలోకి దించి కొనుగోళ్లు చేయించాలని కోరారు. క్వింటాకు రూ.36వేలు ధర ఇస్తేనే రైతులు ఊరట చెందుతారన్నారు. మార్కెట్లో వాస్తవ పరిస్థితులను పరిశీలించి పొగాకు రైతులను ఆదుకునేందుకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని, కేంద్రం వద్దకు రాష్ట్రమంత్రులతోపాటు రైతు సంఘాల ప్రతినిధులను కూడా తీసుకెళ్లాలని కోరారు. ర్యాలీలో ఒంగోలు, ఎస్‌ఎన్‌పాడు, కొండపి నియోజకవర్గాలలోని పలు గ్రామాలకు చెందిన రైతులు అధికంగా పాల్గొనగా ఆయా గ్రామాలలో ప్రస్తుత అధికార, ప్రతిపక్షాలుగా ఉన్న టీడీపీ, వైసీపీ నాయకులుగా చెలామణి అవుతున్న రైతులు అనేకమంది ఉన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి షేక్ మాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆర్.వెంకట్రావు, కిసాన్ కాంగ్రెస్ నాయకుడు దేవరపల్లి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం ఆదేశాలు బేఖాతర్.. పలు కేంద్రాలలో వేలం బ్రేక్
సీఎం చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఇచ్చిన ఆదేశాలను వ్యాపారులు శుక్రవారం మార్కెట్లో పట్టించుకున్న పరిస్థితి కనిపించలేదు. కిలో రూ.200కు ధర తగ్గరాదని, నోబిడ్ అనేది ఉండ కూడదని ఆయన స్పష్టం చేశారు. అందుకు చర్యలు తీసుకోవాలని పొగాకు వ్యాపారులు, బోర్డు అధికారులను ఆదేశించారు. అయితే శుక్రవారం మార్కెట్‌లో చూస్తే మేలురకం గ్రేడ్‌లకు సైతం కిలో రూ.160 నుంచి రూ.170 ఇవ్వడమే కాక పలు కేంద్రాలలో నోబిడ్‌లు భారీగానే కనిపించాయి. రెండు రోజులుగా వేలం నిలిచిన కందుకూరులోని రెండు కేంద్రాలు, టంగుటూరులలో శుక్రవారం కూడా వేలం ఆగిపోయింది. మిగతా వాటిలో వేలం నిర్వహించగా ఒంగోలు-1, కొండపిలలో ధరలు సరిలేవంటూ రైతులు అడ్డుకున్నారు. ఒంగోలు-1లో 27 బేళ్లకు వేలం పూర్తయ్యేసరికి కేవలం 4 బేళ్లను మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేయగా ధరలు లేవంటూ రైతులు నిలిపేశారు. కొండపిలో 59 బేళ్లకు వేలం పూర్తయ్యేసరికి 24 బేళ్లు మాత్రమే అమ్ముడుపోయాయి. దీంతో రైతులు వేలాన్ని ఆపివేశారు. వేలం జరిగిన కేంద్రాలలో వెల్లంపల్లిలో 42.96శాతం, ఒంగోలు-2 కేంద్రంలో 36.88శాతం, కనిగిరిలో 42.25 శాతం బేళ్లు నోబిడ్ అయ్యాయి.