పంట పొలాలకు సర్కారు బాటలు
ABN , Publish Date - Aug 22 , 2026 | 03:11 AM
జిల్లాలో పొలాలకు వెళ్లేందుకు దారులు సరిలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విత్తనం వేసే దగ్గర నుంచి పంట కోతలు పూర్తిచేసి ఉత్పత్తులను ఇళ్లకు తెచ్చేం త వరకు ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వారా పలురకాల వస్తువులను పొలాలకు తీసుకెళ్లడం, తీసుకురావడం చేయాలి.
ప్రభుత్వ ఆదేశాలతో సిద్ధమవుతున్న ప్రతిపాదనలు
జిల్లాలో 5,586 కి.మీ నిడివి ఉండే 3,916 రోడ్లు గుర్తింపు
ఒక్కో కి.మీ నిర్మాణానికి రూ.15లక్షలు అవసరమని అంచనా
ఒంగోలు, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పొలాలకు వెళ్లేందుకు దారులు సరిలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విత్తనం వేసే దగ్గర నుంచి పంట కోతలు పూర్తిచేసి ఉత్పత్తులను ఇళ్లకు తెచ్చేం త వరకు ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వారా పలురకాల వస్తువులను పొలాలకు తీసుకెళ్లడం, తీసుకురావడం చేయాలి. అయితే అత్యధిక గ్రామాల్లో దారులు ధ్వంసమై రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా ఉంటున్నాయి. గోతులమయంతోపాటు దట్టంగా పెరిగిన చిల్లచెట్లతో ఆ దారుల్లో పోలేక రైతులు అవస్థ పడుతున్నారు. వర్షాల సమయంలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. రాష్ట్రమంతా ఇలాంటి పరిస్థితే నెలకొంది. అలాంటి దారులను అభివృద్ధి చేసి రైతుల కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ ఏడాది వీబీ జీరామ్‌జీ పథకం మెటీరియల్ నిధుల ద్వారా ఈ రోడ్ల పనులను చేపట్టాలని నిర్ణయించింది.
గతంలోనూ డొంకల అభివృద్ధి
గతంలో 2014-19 మధ్య కాలంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం మెటీరియల్ కోటా నిధులతో గ్రామాల్లో పెద్దఎత్తున రోడ్లు, డ్రెయిన్‌లు, ఇతర నిర్మాణాలు భారీగా చేసిన విషయం విదితమే. అప్పట్లో పొలాలకు వెళ్లే రైతులు డొంకలుగా పిలుచుకునే దారులను మట్టిరోడ్లుగా అభివృద్ధి చేశారు. అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడంతో గోతులమయంగా మారాయి. తిరిగి కూటమి అధికారంలోకి వచ్చాక ఉపాధి పథకం మెటీరియల్ కోటా నిధుల సద్వినియోగంపై దృష్టి సారించింది. గతేడాది భారీగా సిమెంటు, గ్రావెల్ రోడ్లు, ఇతరత్రా పనులు చేయించింది. ఈ ఏడాది పొలాలకు వెళ్లే రోడ్ల బాగుకు సంకల్పించింది. వీబీ జీరామ్‌జీ మెటీరియల్ కోటా నిధుల కింద ఆ పనులను చేయాలని నిర్ణయించింది. తొలుత గ్రామాల వారీ ఈ తరహా రహదారులు గుర్తింపు ప్రక్రియను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, డ్వామా అధికారులు చేపట్టారు. అలా జిల్లాలో 519 పంచాయతీల్లో 3,916 రోడ్లను గుర్తించారు. వాటి పొడవు సుమారు 5,582 కి.మీ ఉంటుందని అంచనా. వీటిలో కనిష్ఠంగా 500 మీటర్లు, గరిష్ఠంగా 10 కి.మీ ఉండేవి ఉన్నట్లు సమాచారం.
డొంకలు గ్రావెల్‌తో అభివృద్ధి
ప్రస్తుతం పొలాల దారులు మట్టిరోడ్లుగా, డొంకదారులుగా ఉండటంతో వాటిని గ్రావెల్ రోడ్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం సగటునకిలో మీటర్‌కు రూ.15 లక్షలు వ్యయమవుతుందని అంచనా. ఆ మేరకు జిల్లాలో డొంకలను గుర్తించి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా గ్రామాల వారీ రోడ్ల వివరాలను యాప్‌లో నమోదు చేశారు. త్వరలో పనులు మంజూరు చేస్తారన్న సమాచారం జిల్లా అధికారులకు ఉండటంతో స్థానిక ప్రజాప్రతినిధులు సూచనలను కూడా పరిగణనలోకి తీసుకొని ఈ దారుల గుర్తింపు ప్రక్రియను పూర్తిచేశారు. అయితే వీటికి భారీగా నిధులు అవసరం కాగా గుర్తించిన పనులన్నింటినీ మంజూరు చేస్తారు. అయితే సరిపడా నిధులు ఈ ఏడాది వీబీ జీరామ్‌జీ పథకం ద్వారా సమకూరుతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటిపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఉన్నత స్థాయిలో సమీక్షించి త్వరలో స్పష్టత రావచ్చని అందుబాటులో ఉన్న నిధులతో పూర్తిగా ఈ పనులకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలుస్తోంది.