గోపాలపురం.. మద్యానికి రాంరాం..!
ABN , Publish Date - Aug 24 , 2026 | 11:38 PM
రెండు దశాబ్దాల క్రితం మహిళలలో వచ్చిన చైతన్యం గోపాలపురాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు పరోక్షంగా దోహదపడింది. నాటి మహిళల పోరాట స్ఫూర్తితో గ్రామంలో రెండు దశాబ్దాలుగా మద్యం బెల్ట్ షాపు దరి చేరకుండా ఉందంటే అతిశయోక్తి కాదు.
రెండు దశాబ్దాల క్రితం బెల్ట్ షాపులపై దండెత్తిన గ్రామ మహిళలు
నాటి నుంచి నేటి వరకు అమ్మకాలు బంద్
వ్యసాయం చేసుకుంటున్న రైతులు, చేపల వేటతో జీవనం సాగిస్తున్న జాలర్లు
ఎన్నికల రోజు మాత్రమే రాజకీయాలు.. మరుసటి రోజు నుండి అందరూ కలసి మెలసి జీవనం
అద్దంకి, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి) : రెండు దశాబ్దాల క్రితం మహిళలలో వచ్చిన చైతన్యం గోపాలపురాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు పరోక్షంగా దోహదపడింది. నాటి మహిళల పోరాట స్ఫూర్తితో గ్రామంలో రెండు దశాబ్దాలుగా మద్యం బెల్ట్ షాపు దరి చేరకుండా ఉందంటే అతిశయోక్తి కాదు. రెండు దశాబ్దాల క్రితం గోపాలపురంలో యనాది సంఘంతో పాటు ఎస్సీ కాలనీలో చేపల వేట సాగించిన అనంతరం జాలర్లు వచ్చిన డబ్బులు బెల్ట్ షాపులో మద్యానికి ఖర్చు పెట్టి జేబులో చిల్లిగవ్వ కూడా లేకుండా ఇంటికి చేరేవారు. దీనికి తోడు పలువురు భర్తలు మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్యలను చిత్రహింసలకు గురిచేస్తుండటం నిత్యం జరిగేది. భర్త వేధింపులతో ఓ యువతి శరీరంపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన యానాది సంఘం, ఎస్సీ కాలనీలో మహిళలను కలచివేసింది. సుమారు 30 మందికి పైగా మహిళలు మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం కదిలారు. గ్రామంలో ఉన్న బెల్ట్‌షాపును, భవనాసి చెరువు కట్ట వద్ద ఉన్న బెల్ట్ షాపులను ధ్వంసం చేశారు. మద్యం అమ్మకాలు జరిగితే ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా మహిళలు బెదరలేదు. అప్పట్లో మహిళల పోరాటాన్ని గురించి తెలుసుకున్న మాజీ ఏఏఎస్ ఆఫీసర్ జయప్రకా్‌షనారాయణ గోపాలపురం వచ్చి అభినందించారు. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామంలో, భవనాసి చెరువు కట్ట వద్ద బెల్ట్ షాపులు లేకుండాపోయాయి. గ్రామంలో అత్యధిక శాతం మద్యానికి దూరంగా ఉంటున్నారు.
సంతోషంగా కుటుంబాలు
మద్యం అందుబాటులో లేకపోవటంతో కష్టపడి సంపాదించిన డబ్బులతో హాయిగా కుటుంబాలను పోషించుకుంటున్నారు. ప్రతి గ్రామంలో వీధికొక బెల్ట్‌షాపు కనిపిస్తున్న ప్రస్తుత రోజులలో అద్దంకి పట్టణానికి కూత వేటు దూరంలో ఉండి, నామ్ రోడ్డు వెంబడే ఉన్న గోపాలపురంలో మద్యం అమ్మకాలు జరగటం లేదంటే ఆశ్చర్యం కలుగక మానదు.
అత్యధిక శాతం మంది జాలర్లే
గ్రామంలో అత్యధికశాతం చేపల వేట మీద ఆధారపడే జాలర్లు ఉన్నప్పటికీ మద్యం అలావాటు లేదంటే మిగిలిన గ్రామాల జాలర్లు ఆశ్చర్యంగా చూస్తున్నారు. గ్రామంలో సుమారు 1500 మంది జనాభా ఉండగా 600 మంది వరకు యానాది సామాజిక వర్గానికి చెందిన జాలర్లు ఉన్నారు. ఇక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాల, మాదిగలు 350 మంది వరకు ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన జనాభా 500 మంది ఉన్నారు. బీసీలు 25 మంది ఉన్నారు. ఎన్నికల ఒక్క రోజు మాత్రమే రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తూ మిగిలిన రోజులలో గ్రామం మొత్తం కలిసి మెలసి ఉండటం విశేషం.
అరవైఏళ్ల క్రితం రోడ్డు వెంబడికి...
సుమారు 6 దశాబ్దాల క్రితం గుండ్లకమ్మ ఒడ్తున ఉన్న గోపాలపురాన్ని వరద భయంతో ఖాళీ చేసి శింగరకొండ కొండ అంచున అప్పటి నరసరావుపేట రోడ్డు(ప్రస్తుతం నామ్ రోడ్డు)కు రెండు వైపులా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో మూడు, నాలుగు ఇళ్లకే పరిమితమైన యానాది సంఘం భవనాసి, గుండ్లకమ్మ ఆధారంగా చేపల వేట సాగించుకునే అవకాశం ఉండటంతో సుమారు 150 కుటుంబాల వరకు ఏర్పడ్డాయి. కులమతాలను పక్కన పెట్టి సోదరభావంతో మెలగటంతో పాటు చిన్నపాటి శుభకార్యక్రమాలు అయినా అందరూ హాజరు కావటం విశేషం. 6 ద శాబ్దాల క్రితం గ్రామాన్ని ఖాళీ చేసి కొత్త గ్రామానికి వచ్చినా సుమారు కిలోమీటరుకు పైగా దూరంలో ఉన్న పాత గ్రామంలో ఉన్న శివాలయంతో పాటు దేవతామూర్తులకు పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న గోపాలపరంలో నాభిశిల(బొడ్డురాయి) ప్రతిష్ఠ చేసుకొని ఏటా అందరు కలసి మెలసి వార్షిక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. రైతులు వ్యవసాయం, పాడి పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తుండగా, జాలర్లు మాత్రం చేపల వేటతో జీవనం సాగిస్తున్నారు. అటు మద్యానికి దూరంగా ఉండటం, రాజకీయాలను ఎన్నికల రోజు వరకే పరిమితం చేసుకుంటూ సోదరభావంతో మెలుగుతూ గోపాలపురం వాసులు ఆదర్శంగా నిలుస్తున్నారు.
గ్రామస్థులు అందరం కలసి మెలసి ఉంటాం
కోయి హనుమంతరావు, గోపాలపురం
గ్రామంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కలసి మెలసి ఉంటాం. గతంలో గుండకమ్మ నది ఒడ్డున ఉన్న గ్రామం చుట్టూ వరద ముప్పు భయంతో రోడ్డు వెంబడికి సుమారు 60 ఏళ్ల క్రితం వచ్చాం. తొలుత నాలుగైదు కుటుంబాలు మాత్రమే రాగా ఆ తరువాత అందరూ పాత గ్రామాన్ని ఖాళీ చేసి వచ్చారు. ఇప్పటికీ పాత గ్రామంలో ఉన్న శివాలయంలో నిత్య పూజలు జరుగుతుంటాయి. పండుగలు, శుభకార్యక్రమాల సమయంలో పాత గ్రామంలోని శివాలయం, ఇతర దేవతామూర్తుల వద్దకు వెళ్లి పూజలు చేస్తాం.
నాటి పోరాట ఫలితంగా ఇప్పటికీ మద్యం బంద్
ఇండ్ల రమణ, మద్య వ్యతిరేఖ పోరాట కమిటీ సభ్యురాలు
రెండు దశాబ్దాల క్రితం మహిళలు అందరూ కలిసికట్టుగా బెల్ట్ షాపులు మూసి వేయించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామంలో ఎలాంటి బెల్ట్‌షాపులు ఏర్పాటు చేయకుండా అందరూ పట్టుదలతో ఉన్నారు. దీంతో గ్రామంలో అందుబాటులో లేక అత్యధికశాతం మద్యం అల వాటుకు దూరంగా ఉంటున్నారు. అప్పట్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జయప్రకా్‌షనారాయణ మా గ్రామానికి వచ్చి మాకు ఎంతో ధైర్యాన్ని నింపారు.
నేటికీ అప్పటి సంఘటనలు గుర్తుకొస్తుంటాయి
కొప్పోలు ఆదిలక్ష్మి, గోపాలపురం
అప్పట్లో మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా చేసిన సంఘటనలు నేటికీ గుర్తుకు వస్తుంటాయి. అప్పట్లో మద్యం సేవించిన కుటుంబాలు పడ్డ ఇబ్బందులు, చోటుచేసుకున్న సంఘటనలతో మహిళలు అందరూ సంఘటితమై మద్యం షాపులను ధ్వంసం చేశారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా భవనాసి చెరువు కట్ట వద్ద ఉన్న బెల్ట్ షాపులు కూడా ధ్వంసం చేసి అమ్మకాలు చేయవద్దని హెచ్చరించాం. అప్పటి నుండి గ్రామంలో మద ్యం అమ్మకాలు లేవు.
మా అమ్మ చెప్తుంటే ఎంతో గర్వంగా ఉండేది
గోసాల శీరభద్రయ్య, ఆటో డ్రైవర్, గోపాలపురం
మా గ్రామంలో మద్యం బెల్ట్ షాపులు లేవని చెప్పుకోవటం ఎంతో గర్వంగా ఉంది. మా అమ్మ హనుమాయమ్మ మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేయటానికి నాయకత్వం వహించినట్లు చెప్తుంటే ఎంతో గర్వంగా ఉండేది. చనిపోయే వరకు కూడా అప్పటి సంఘటనలు పదే పదే చెప్పేది. నేటికి కూడా యువకులు చాలా మంది మద్యానికి దూరంగా ఉంటున్నారు.