Share News

వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

ABN , Publish Date - Aug 08 , 2026 | 02:52 AM

వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు శుభవార్త. వారికి చెల్లించాల్సిన పరిహారానికి సంబంధించి రెండో విడత మరో రూ.300 కోట్లను ప్రభుత్వం విడుదల చేయ నుంది. ఈమేరకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.

వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త
విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల

ఈ వారంలోనే విడుదల.. వెంటనే ఖాతాల్లో జమ

అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో

జలవనరుల శాఖ మంత్రి నిమ్మల వెల్లడి

మార్కాపురం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు శుభవార్త. వారికి చెల్లించాల్సిన పరిహారానికి సంబంధించి రెండో విడత మరో రూ.300 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈమేరకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఈ వారంలోనే నగదు నిర్వాసితుల ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శుక్రవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి.. వెలిగొండ ప్రాజెక్ట్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్ట్‌కు కీలకంగా ఉన్న నిర్వాసితుల సమస్యను గత వైసీపీ హయాంలో పట్టించుకోకుండా వదిలేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం ప్రాజెక్ట్‌ పనులతోపాటు నిర్వాసితుల సమస్యలను కూడా పరిష్కరిస్తున్నదని చెప్పారు. అందులో భాగంగా తొలి విడత రూ.318 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఇక మిగిలిన 4,761 కుటుంబాలకు ఇవ్వాల్సిన రూ.600 కోట్లలో ఈ వారంలోనే రూ.300 కోట్లు జమ చేస్తామన్నారు. చివరి విడత రూ.300 కోట్లు మూడు లేదా నాలుగు వారాల్లో ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఫీడర్‌ కాలువ బలోపేతం కోసం రూ.460 కోట్లతో చేపట్టిన పనులను కేవలం ఐదు నెలల్లోనే పూర్తి చేశామని చెప్పారు. ఈ నెలాఖరుకు వెలిగొండ ద్వారా నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌కు కృష్ణా జలాలు ఇచ్చేలా అన్ని పెండింగ్‌ పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సీఈ రమేష్‌బాబు, ఎస్‌ఈ అబుతలీం, ఈఈలు, ఏఈలు పాల్గొని పనుల పురోగతిని మంత్రికి వివరించారు.

Updated Date - Aug 08 , 2026 | 02:52 AM