2003 డీఎస్సీ టీచర్లకు శుభవార్త
ABN , Publish Date - Jul 14 , 2026 | 03:01 AM
ఉమ్మడి జిల్లాలో 2003 డీఎస్సీలో ఉపాధ్యాయలుగా ఎంపికైన వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్) కోసం ఏళ్లతరబడి ఎదురుచూస్తున్న వీరి ఆశలు ఎట్టకేలకు ఫలించాయి.
866 మంది సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు
ఒంగోలు విద్య, జూలై 13 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో 2003 డీఎస్సీలో ఉపాధ్యాయలుగా ఎంపికైన వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్) కోసం ఏళ్లతరబడి ఎదురుచూస్తున్న వీరి ఆశలు ఎట్టకేలకు ఫలించాయి. 2004 సెప్టెంబరు 1కి పూర్వం నోటిఫికేషన్ విడుదలై తర్వాత ఎప్పుడు ఉద్యోగంలో చేరినా వారందరికీ పాత పెన్షన్‌ను ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈమేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఉమ్మడి జిల్లాలో 2003లో డీఎస్సీ టీచర్ల నియామకాల నోటిఫికేషన్ విడుదలైంది. అయితే నియామకాల్లో జాప్యం కావడంతో వారందరూ 2004 సెప్టెంబరు తర్వాత ఉద్యోగాల్లో చేరారు. మొత్తం 866మంది ఆ డీఎస్సీలో టీచర్లుగా ఎంపికై ఉద్యోగాల్లో చేరారు. వీరందరికీ ఇక పాతపెన్షన్ వర్తిస్తుంది. ఈ ఉత్తర్వుల ప్రకారం వీరు సీపీఎస్ నుంచి ఓపీఎస్‌లోకి మారేందుకు ఆప్షన్ ఇవ్వాల్సి ఉంది.