Share News

కారుమంచి.. రోజులొచ్చాయ్‌..!

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:19 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో అంటే నాలుగేళ్ల క్రితం నుంచి కారుమంచి మేజర్‌ ఆయకట్టు కర్షకులు పడుతున్న కష్టాలు త్వరలోనే కడతేరనున్నాయి. ఆయకట్టు రైతులకు, ప్రజలకు తీయటి కబురును ప్రజా ప్రభుత్వం అందించింది. నాలుగేళ్ల క్రితం కోతకు గురై క్వారీలో కుప్పకూలిన మేజర్‌ కట్టను పునరుద్ధరించటానికి లైన్‌క్లియర్‌ అయ్యింది.

కారుమంచి.. రోజులొచ్చాయ్‌..!
కోతకు గురై క్వారీలో జారిపడిన కారుమంచి మేజర్‌ కట్ట

మేజర్‌ కాలువ కట్ట పునరుద్ధరణకు లైన్‌క్లియర్‌

సాంకేతిక అనుమతులు జారీ చేస్తూ సీఈ ఉత్తర్వులు

రూ.2.63 కోట్లతో టెండర్లు

ఈ ఏడాది వేసవి కాలంలో పనులు షురూ

వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టించుకోని వైనం

గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చిన ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌

సహకారం అందించిన ఎన్‌ఆర్‌ఐ నల్లూరి శేషయ్య

చీమకుర్తి, మార్చి 27(ఆంధ్రజ్యోతి) : వైసీపీ ప్రభుత్వ హయాంలో అంటే నాలుగేళ్ల క్రితం నుంచి కారుమంచి మేజర్‌ ఆయకట్టు కర్షకులు పడుతున్న కష్టాలు త్వరలోనే కడతేరనున్నాయి. ఆయకట్టు రైతులకు, ప్రజలకు తీయటి కబురును ప్రజా ప్రభుత్వం అందించింది. నాలుగేళ్ల క్రితం కోతకు గురై క్వారీలో కుప్పకూలిన మేజర్‌ కట్టను పునరుద్ధరించటానికి లైన్‌క్లియర్‌ అయ్యింది. కట్ట నిర్మాణానికి డీఎంఎఫ్‌ నిధులు రూ.2.63కోట్లు మంజూరు కాగా వాటికి సాంకేతిక అనుమతులు మంజూరయ్యాయి. గత ఏడాది నుంచి సాంకేతిక అనుమతులు మంజూరులో జాప్యం నెలకొనటంతో కట్ట పునరుద్ధరణ ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల్లో అనుమతులు జాప్యానికి కారణాలు, జాప్యం వలన ఆయకట్టు కింద ఉన్న 22 గ్రామాల్లో ప్రజలకు ఎదురవుతున్న తాగునీటి సమస్య, 20 వేల ఎకరాల్లో రైతులకు సాగునీటి సమస్యలపై ఆంధ్రజ్యోతి వార్తలను ప్రచురించింది. దీనిపై పార్టీలకతీతంగా ఆయకట్టు రైతులు కలెక్టరేట్‌ వద్ద పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. స్పందించిన ప్రభుత్వం కట్ట పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది.

వారి పట్టుదలతోకర్షకుల కల సాకారం

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రచార సమయంలో కారుమంచి మేజర్‌ ఆయకట్టు రైతుల కష్టాలను స్వయంగా వీక్షించిన ఎమ్యెల్యే విజయ్‌కుమార్‌ రైతులకు విస్పష్ట హామీ ఇచ్చారు. కట్ట కూలిపోయి అప్పటికి రెండేళ్లు అయినా అప్పటి వైసీపీ ప్రభుత్వం కట్ట పునరుద్ధరణకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవటాన్ని రైతులు విజయ్‌కుమార్‌ దృష్టికి తీసుకువచ్చారు. అధికారంలోకి వస్తే కట్ట పునరుద్ధరణ కచ్చితంగా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఆయకట్టు పరిధిలో ఉన్న కూనంనేనివారిపాలేనికి చెందిన ఎన్‌ఆర్‌ఐ నల్లూరి వెంకటశేషయ్య కట్ట పునరుద్ధరించటానికి తొలి నుంచి తీవ్రంగా కృషి చేశారు. దాదాపు 20 లక్షల రూపాయలు సొంత నిధులు వెచ్చించి మేజర్‌ కాలువలో పూడికతీత, చిల్లచెట్ల తొలగింపు, గేట్లకు మరమ్మతులు చేపట్టారు. కూలిన ప్రాంతాన్ని బైపాస్‌ చేస్తూ ఏర్పాటుచేసిన మళ్లింపు కాలువ ద్వారా ఆయకట్టు ప్రజలకు సాగు, తాగునీరు కొంతమేర అయినా అందించేలా శేషయ్య చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సాంకేతిక అనుమతులు జాప్యం జరుగుతున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ చేస్తున్న ప్రయత్నాలకు శేషయ్య సైతం అండగా నిలిచారు.


దుబాయ్‌లోనూ సీఎంకు కట్ట పరిస్థితిని వివరించిన శేషయ్య

దుబాయ్‌కు వచ్చిన సమయంలో సీఎం చంద్రబాబు దృష్టికి, నారా లోకేష్‌, మంత్రి రామానాయడు, ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులను శేషయ్య కలిసి రైతుల సాదకబాధలను విడమర్చి చెప్పి కట్ట పునరుద్దరణ ఆవశ్యకతను తెలియచేశారు. మొత్తం మీద పట్టుదలతో అనుమతుల సాధించటంలో విజయ్‌కుమార్‌ ప్రదర్శించిన అంకితభావం, ఆయనకు శేషయ్య అందించిన సహకారం, ఇరిగేషన్‌ మంత్రి, సీఈ, జిల్లా మంత్రులు, ఇన్‌చార్జి మంత్రి, కలెక్టర్‌ తోడ్పాటుతో కారుమంచి మేజర్‌ కర్షకుల కల సాకారం కానుంది. నేడో, రేపో ఆన్‌లైన్‌ టెండర్లు పిలిచి వేసవిలో పనులు పూర్తిచేసి, రాబోయే వ్యవసాయ సీజన్‌కు మేజర్‌లో పూర్తిస్థాయి నీరు ప్రవహించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Updated Date - Mar 28 , 2026 | 12:19 AM