Share News

బంగారం రుణాలు కఠినతరం

ABN , Publish Date - Apr 19 , 2026 | 03:12 AM

అత్యధిక శాతం జాతీయ బ్యాంక్‌లు ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి వ్యవసాయ భూముల ఆధారంగా బంగారం తాకట్టుపెట్టి తీసుకునే రుణాల నిబంధనలను కఠినతరం చేశాయి. గతంలో భూములు ఉన్న రైతులు బంగారం తాకట్టు పెట్టి పెద్దమొత్తంలో రుణాలు తీసుకునే వారు.

బంగారం రుణాలు కఠినతరం

జాతీయ బ్యాంకుల్లో రూ.2.25లక్షల నుంచి రూ.2.75 లక్షల వరకు మాత్రమే ఇస్తున్న వైనం

వ్యవసాయేతర మైతే తడిసిమోపెడు

ప్రైవేట్‌ బ్యాంక్‌లను ఆశ్రయిస్తున్న రైతులు

అద్దంకి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): అత్యధిక శాతం జాతీయ బ్యాంక్‌లు ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి వ్యవసాయ భూముల ఆధారంగా బంగారం తాకట్టుపెట్టి తీసుకునే రుణాల నిబంధనలను కఠినతరం చేశాయి. గతంలో భూములు ఉన్న రైతులు బంగారం తాకట్టు పెట్టి పెద్దమొత్తంలో రుణాలు తీసుకునే వారు. వడ్డీ చెల్లించి రెన్యువల్‌ చేసుకునే అవకాశం ఉండటంతో రైతులు పెద్దగా ఇబ్బంది పడలేదు. అయితే, గతేడాది నుంచి పంట రుణాలతోపాటు బంగారం తాకట్టు రుణాలు కూడా మొత్తం చెల్లించి సదరు బాకీ రద్దు చేసుకొని, ఆ తర్వాత మరలా కొత్త రుణం తీసుకోవాల్సి రావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది కొనసాగుతుండగా కొత్తగా బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకునే వ్యక్తులకు పలు బ్యాంక్‌లలో గుండె పగిలే నిబంధన చెప్పారు. ఈ నిబంధన మేరకు భూములు ఉన్న రైతులకు బంగారం తాకట్టు పెట్టుకొని రూ.2.25 లక్షల నుంచి రూ.2.75 మాత్రమే ఇస్తున్నట్లు ప్రకటించారు. ఒకటి, రెండు జాతీయ బ్యాంక్‌లు మినహా మిగిలిన అన్నింటిలో ఈఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి నిబంధనలు కఠినతరం చేశారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అత్యవసర సమయాలలో అత్యధికశాతం రైతులు బంగారం తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటుంటారు. ప్రస్తుత నిబంధనతో రైతులు బంగారం తాకట్టు పెట్టి పెద్ద మొత్తంలో రుణం తీసుకునే అవకాశం లేకుండా పోయిందని ఆందోళన చెందుతున్నారు.

వడ్డీ తడిసిమోపెడు

జాతీయ బ్యాంక్‌లలో ఒకటి, రెండు మాత్రం పాత నిబంధనలతోనే బంగారం తాకట్టు రుణాలు ఇస్తున్నారు. వ్యవసాయేతర రుణం తీసుకుంటే వడ్డీ తడిసిమోపెడు అవుతోంది. దాదాపు అత్యధిక బ్యాంక్‌లు నిబంధనలు కఠినతరం చేయడంతో మిగిలిన బ్యాంక్‌ల వద్ద రద్దీ పెరిగింది. పెద్ద మొత్తంలో రైతులు వస్తుండటంతో రుణాలు మంజూరు ఆలస్యం అవుతోంది. ఈక్రమంలో ప్రైవేట్‌ బ్యాంక్‌ల వద్దకు రైతులు రుణాలు కోసం వెళ్తున్నారు. దీంతో ఆ బ్యాంక్‌లలో రద్దీ మరింత పెరిగింది. రైతుల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు ప్రైవేట్‌ బ్యాంక్‌లు సిద్ధమయ్యాయి. వ్యవసాయేతర రుణం తీసుకుంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీని అసలులో కలిపి లెక్కిస్తుండటంతో తడిసి మోపెడయ్యే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వ్యవసాయ రుణాలను పాత నిబంధనల మేరకు గరిష్ఠ పరిమితి పెంచి వెంటనే మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Apr 19 , 2026 | 03:12 AM