Share News

ఇంటింటికీ వెళ్లి.. ఆత్మీయంగా పలుకరించి..

ABN , Publish Date - Sep 02 , 2026 | 02:47 AM

జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ మంగళవారం ఉత్సాహంగా సాగింది. ఉదయం 6.30కే ఆయా సచివాలయాల పరిధిలో సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీని ప్రారంభించారు. పది గంటల కల్లా మూడొంతుల మంది లబ్ధిదారులకు నగదును అందజేశారు.

 ఇంటింటికీ వెళ్లి.. ఆత్మీయంగా పలుకరించి..
కలికవాయిలో పింఛన్‌ సొమ్మును అందజేస్తున్న మంత్రి స్వామి

జిల్లావ్యాప్తంగా ఉత్సాహంగా పింఛన్ల పంపిణీ

కలికవాయిలో పాల్గొన్న మంత్రి డాక్టర్‌ స్వామి

ఒంగోలు ప్రగతినగర్‌లో కలెక్టర్‌ హాజరు

పలుచోట్ల ఎమ్మెల్యేలు, కీలక నేతలు అందజేత

ఒంగోలు, సెప్టెంబరు 1 (ఆంధ్ర జ్యోతి) : జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ మంగళవారం ఉత్సాహంగా సాగింది. ఉదయం 6.30కే ఆయా సచివాలయాల పరిధిలో సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీని ప్రారంభించారు. పది గంటల కల్లా మూడొంతుల మంది లబ్ధిదారులకు నగదును అందజేశారు. ఈనెలకు సంబంధించి జిల్లాలో మొత్తం 2,16,586 మంది వివిధ కేటగిరీలకు చెందిన పింఛన్‌దారులకు రూ.93.97 కోట్లు మంజూరైంది. వారిలో సాయంత్రం నాలుగు గంటలకే 90.81 శాతంతో 85 కోట్లు అందజేశారు. రాత్రి 8 గంటలకు 92.11 శాతం మందికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితో పాటు క్షేత్రస్థాయిలోని అధికార టీడీపీ గ్రామ, వార్డు స్థాయి నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు, కలెక్టర్‌తో సహా వివిధ స్థాయిల్లోని అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పలుచోట్ల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలుకరించి యోగక్షేమాలను అడిగి పింఛన్‌ నగదును అందజేశారు. పేదవర్గాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువ మంది పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాకు చెందిన సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి కొండపి నియోజకవర్గ పరిధిలోని సింగరాయకొండ మండలం కలికవాయిలో పింఛన్‌లను పంపిణీ చేశారు. అదేగ్రామంలో రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థా పన చేశారు. ఒంగోలు కార్పొరేషన్‌ పరిధిలోని ప్రగతినగర్‌ పేదల కాలనీలో కలెక్టర్‌ రాజాబాబు స్థానిక అధికారులతో కలిసి పింఛన్లు అందజేశారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ నగరంలోని 8వ డివిజన్‌ తూర్పు క్రిస్టియన్‌పాలెంలో లబ్ధిదారులను కలిసి పింఛన్లు పంపిణీ చేయగా రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ నూకసాని బాలాజీ, పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ డాక్టర్‌ కామేపల్లి సీతారామయ్య, మాజీ మేయర్‌ గంగాడ సుజాత పాల్గొన్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్‌ విజయ్‌కుమార్‌ పి.గుడిపాడులో, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాచవరంలో పాల్గొన్నారు. మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య మర్రిపూడి మండలం చిలంకూరులో, టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి బొట్లపాలెంలో, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు దర్శి పట్టణంలో భాగస్వాములయ్యారు. వివిధ స్థాయిల్లోని నాయకులు తమ తమ ప్రాంతాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు

Updated Date - Sep 02 , 2026 | 02:48 AM