ఇంటింటికీ తిరిగి.. యోగక్షేమాలు అడిగి..
ABN , Publish Date - Feb 01 , 2026 | 02:17 AM
పేదల సేవలో పేరుతో రాష్ట్రప్రభుత్వం చేపట్టిన సామాజిక పింఛన్ల పంపిణీ ఈసారి కూడా ఒక రోజు ముందుగానే చేశారు. సాధారణం గా ప్రతినెలా 1వతేదీన వీటిని అందజేస్తారు. అయితే ఈసారి ఒకటో తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముం దుగానే ఫించన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మంచు, చలిలోనూ పింఛన్ల పంపిణీ
ఒకరోజు ముందుగానే అందజేత
కందుకూరులో మంత్రి ఆనం, మర్రిపూడి మండలంలో మంత్రి స్వామి హాజరు
ఒంగోలు, కలెక్టరేట్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి) : పేదల సేవలో పేరుతో రాష్ట్రప్రభుత్వం చేపట్టిన సామాజిక పింఛన్ల పంపిణీ ఈసారి కూడా ఒక రోజు ముందుగానే చేశారు. సాధారణం గా ప్రతినెలా 1వతేదీన వీటిని అందజేస్తారు. అయితే ఈసారి ఒకటో తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముం దుగానే ఫించన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణంగా జిల్లావ్యాప్తంగా శనివారమే పంపిణీ చేశారు. ఈ నెలలో విభజిత జిల్లా ప్రకారం జరగ్గా ప్రస్తుత జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు సంబంధించి 2,20,246 మంది లబ్ధిదారులకు రూ.95.22కోట్లు మంజూరయ్యాయి. చలి తీవ్రత, మంచు అధికంగా ఉన్నప్పటికీ ఉదయాన్నే సచివాలయాల సిబ్బంది, వారికి తోడుగా స్థానిక టీడీపీ శ్రేణులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పలుకరించి యోగక్షేమాలు అడిగి మరీ పింఛన్ సొమ్మును అందజేశారు. ప్రభుత్వ ఆదేశాలతో మంత్రి నుంచి స్థానిక నేతల వరకు తమ ప్రాంతాల్లో ఈ ప్రక్రియలో భాగస్వా ములయ్యారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కందుకూరులో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి పింఛన్లు పంపిణీ చేశారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు. జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ.స్వామి తన నియోజకవర్గంలోని మర్రిపూడి మండలం కూచిపూడిలో పింఛన్లు పంపిణీ చేశారు. పొన్నలూరు మండలం చెరువుకొమ్ముపాలెంలో మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నగరంలోని 21వ డివిజన్ ధారావారితోటలో పింఛన్లు పంపిణీ చేయగా ఎస్‌ఎన్‌పాడులోని ఎస్టీకాలనీలో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే బీఎన్.విజయకుమార్ పాల్గొన్నారు. టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శిలో ఈ కార్యక్రమంలో పాల్గొనగా ఇతర చోట్ల కూడా స్థానిక నేతలు, వివిధ స్థాయిల్లోని అధికారుల ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ జరిగింది. ఉదయం పది గంటలకే మూడింట రెండొంతుల మందికి అందజేశారు. సాయంత్రానికి 90శాతం మందికి ఇచ్చారు. మిగిలిపోయిన వారికి సోమవారం అందజేయనున్నారు.