Share News

మెరుగైన కరెంటు సరఫరా లక్ష్యం

ABN , Publish Date - Jun 30 , 2026 | 02:54 AM

వినియోగదారులకు నిరంతరం మెరుగైన విద్యుత్‌ సరఫరా లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ స్పష్టం చేశారు. ఒంగోలులోని హౌసింగ్‌బోర్డు కాలనీలో రూ.3.80 కోట్లతో నిర్మించిన సబ్‌స్టేషన్‌ను సోమవారం స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావుతో కలిసి ఆయన ప్రారంభించారు.

మెరుగైన కరెంటు సరఫరా లక్ష్యం
ఒంగోలులో సబ్‌ స్టేషన్‌ను ప్రారంభిస్తున్న మంత్రి రవికుమార్‌, ఎమ్మెల్యే జనార్దన్‌, జేసీ కల్పనాకుమారి తదితరులు

విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌

ఒంగోలులో రూ.3.80 కోట్లతో సబ్‌స్టేషన్‌ ప్రారంభం

జిల్లాకు 25 ఉప కేంద్రాలు మంజూరు చేసినట్లు వెల్లడి

ఒంగోలు క్రైం, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి) : వినియోగదారులకు నిరంతరం మెరుగైన విద్యుత్‌ సరఫరా లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ స్పష్టం చేశారు. ఒంగోలులోని హౌసింగ్‌బోర్డు కాలనీలో రూ.3.80 కోట్లతో నిర్మించిన సబ్‌స్టేషన్‌ను సోమవారం స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో లోఓల్టేజీ సమస్య రాకుండా 25 సబ్‌స్టేషన్‌లు మంజూరు చేశామని చెప్పారు. వాటిలో కొన్ని ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఎర్రగొండపాలెంలో 220 కేవీ సబ్‌స్టేషన్‌, తాళ్లూరు, కొత్తపట్నంలలో 132 కేవీ సబ్‌స్టేషన్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. రైతులకు 9 గంటలు నిర్విరామంగా విద్యుత్‌ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. రాబోయే సీజన్‌ ప్రారంభం నాటికి రైతులకు వ్యవసాయ కనెక్షన్లు పెండింగ్‌ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. జిల్లాలో రైతులకు అవసరమైన 100 ట్రాన్స్‌ఫార్మర్లు సమకూర్చినట్లు చెప్పారు. ఆర్డీఎస్‌ఎస్‌ పఽథకంలో భాగంగా ఒంగోలు నగరంలో 240 విద్యుత్‌ టవర్లు మంజూరు చేసినట్లు చెప్పారు. విద్యుత్‌ వినియోగానికి అనుగుణంగా మౌలిక వసతులను విస్తరిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నదని మంత్రి విమర్శించారు. ప్రస్తుత ప్రధానమంత్రి సూర్యఘర్‌ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీలకు పూర్తిస్థాయి సబ్సిడీతో 200 కేవీ సోలార్‌ రూఫ్‌టాప్‌ యూనిట్లు మంజూరుచేస్తున్నామని చెప్పారు. బీసీలకు కేంద్రప్రభుత్వం ఇస్తున్న రూ.78వేల సబ్సిడీ కాకుండా రాష్ట్రప్రభుత్వం తరఫున రూ.20వేలు అందించనున్నట్లు వివరించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు మాట్లాడుతూ నగరంలో నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ కృషి ప్రశంసనీయమన్నారు. హౌసింగ్‌ బోర్డులో రూ.3.80కోట్ల వ్యయంతో నిర్మించిన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వలన పాలిటెక్నిక్‌ కాలేజీ రోడ్డు, విజయనగర్‌ కాలనీ, హౌసింగ్‌ బోర్డు, పాత రిజిస్టర్‌ ఆఫీస్‌, సౌత్‌ బైపాస్‌రోడ్డు, భాగ్యనగర్‌ 3 లైన్‌ ప్రాంతాల్లో మెరుగైన సరఫరా ఉంటుందన్నారు. కొత్తపట్నంలో నిర్మిస్తున్న 132 కేవీ సబ్‌స్టేషన్‌తో ఆ ప్రాంతంలో లోఓల్టేజీ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కార్యక్రమం అనంతరం మంత్రి రవికుమార్‌ సబ్‌స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటారు. జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు, ఓడా చైర్మన్‌ ఎస్‌కే.రియాజ్‌, ఒంగోలు ఏఎంసీ చైర్మన్‌ రాచగర్ల వెంకట్రావు, ఈఈలు మాకినేని హరిబాబు, ఎం.నాగేశ్వరరావు, ఏడీఈ రంగారావు, ఏఈ డి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2026 | 02:54 AM