ముందుకు సాగరే!
ABN , Publish Date - Feb 24 , 2026 | 01:36 AM
ఇంటి పన్నుల వసూళ్లలో తీవ్ర నిర్లక్ష్యం కొనసాగు తూనే ఉంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినా పంచాయతీ ఉద్యోగులు అవేమీ తమకు కాదన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి.
లక్ష్యాన్ని నిర్దేశించినా అదే నిర్లక్ష్యం
45 పంచాయతీల్లోనే నూరుశాతం
రూ.46.09కోట్లకు వసూలైంది రూ.19.25 కోట్లు మాత్రమే
ఈనెలాఖరు వరకు మరోసారి గడువు
ఈ లోపు పూర్తిచేసేనా?
ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చినా క్షేత్రస్థాయిలో అమలు కాని తీరు
ఒంగోలు కలెక్టరేట్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : ఇంటి పన్నుల వసూళ్లలో తీవ్ర నిర్లక్ష్యం కొనసాగు తూనే ఉంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినా పంచాయతీ ఉద్యోగులు అవేమీ తమకు కాదన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 729 పంచాయతీల్లో రూ.46.09 కోట్లు ఇంటి పన్నులు వసూలు చేయాల్సి ఉండగా గత గురువారం ఉదయానికి రూ.19.25 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా రూ.26.84 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 42.01 శాతం మాత్రమే వసూలు చేశారు. జిల్లాలో కేవలం 45 గ్రామపంచాయతీల్లోనే నూరుశాతం పన్నులు రాబట్టారు. మిగిలిన గ్రామ పంచాయతీల్లోని ఉద్యోగులు, సిబ్బందిలో పూర్తిస్థా యి నిర్లక్ష్యం, నిర్లిప్తత కొనసాగుతుందన్న ఆరోప ణలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారం లోకి వచ్చాక గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్రప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులతోపాటు రాష్ట్రప్రభుత్వం ద్వారా వివిధ రూపాల్లో వచ్చే నిధులను ఇస్తోంది. అలాగే ఆయా గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నులు, వివిధ రూపాల్లో వచ్చే ఆదాయవనరులను సమకూర్చుకొని పల్లెల్లో మౌలిక సదుపాయాలతోపాటు పారిశుధ్య నిర్వహణ, ఇతర అభివృద్ధి పనులు చేసుకునేలా దిశానిర్దేశం చేసింది. అందుకు అనుగుణంగా గత ఐదారు నెలల నుంచి పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. సంక్రాంతి నాటికి పూర్తిస్థాయిలో ఇంటి పన్నులు వసూలు చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించినా క్షేత్రస్థాయిలో కదలని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రస్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఇంటి పన్నుల వసూళ్లతోపాటు పలు అంశాలపై దిశానిర్దేశం చేయడమే కాకుండా నూరుశాతం పన్నులు వసూలు చేసిన పంచాయతీ కార్యదర్శులను కూడా సత్కరించారు. ఈనెలాఖరులోపు నాటికి నూరుశాతం పూర్తిచేయాలని మరోసారి లక్ష్యాన్ని నిర్దేశించారు.
స్పందన అంతంతే..
పంచాయతీరాజ్‌శాఖ ఇచ్చిన గడువు సమీపిస్తున్నా ఇప్పటివరకు కనీసం ఉమ్మడి జిల్లా స్థాయిలో 50శాతం పన్నులు కూడా వసూలు కాని పరిస్థితి ఏర్పడింది. కొన్ని పంచాయతీల్లో కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించి పదిహేను మంది వరకు 80శాతానికిపైగా వసూలు చేయగా మరికొన్ని పంచాయతీల్లో అయితే కేవలం 10 నుంచి, 20శాతంలోపు మాత్రమే ఇంటిపన్నులు వసూలు చేశారు. మరోవైపు వారం క్రితం కలెక్టర్ రాజాబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే సమయంలో ఇంటి పన్నుల వసూళ్ల లక్ష్యాలను నిర్దేశించి అప్రమత్తం చేశారు. అయినా క్షేత్రస్థాయిలో పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది.
హెచ్చరిస్తున్నా స్పందన లేదు
ఇంకోవైపు డీపీవో వెంకటేశ్వరరావు ప్రతిరోజూ ఇంటి పన్నుల వసూళ్లపై డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులతో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడంతోపాటు పంచాయతీరాజ్ శాఖ నుంచి వచ్చిన ఉత్తర, ప్రత్యుత్తరాలను చూపి దిశానిర్దేశం చేస్తున్నా ఆశించిన స్థాయిలో స్పందన లేదు. మండల స్థాయిలో ఉండే డిప్యూటీ ఎంపీడీవోలు ఇంటి పన్నుల వసూళ్లలో వెనుకబడిన పంచాయతీ కార్యదర్శులను అప్రమత్తం చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే అలాంటి వారిపై వేటుపడినా మిగతా వారిలో కదలిక లేదు. జిల్లా అధికారులు వెళ్లిన సమయంలోనే వారు కూడా వచ్చి ఆయా గ్రామాలను సందర్శిస్తున్నారే తప్ప రోజువారీ ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులను సమన్వయం చేసి నూరుశాతం పన్నులు వసూలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.