బాలికలు భళా
ABN , Publish Date - Jul 02 , 2026 | 03:15 AM
ఇంటర్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష (ఏపీఈఏపీ సెట్) ఫలితాలు ఎట్టకేలకు బుధవారం విడుదలయ్యాయి. ఇంజనీరింగ్ ఫలితాల్లో అర్హత ర్యాంకుల సాధనలో ఉమ్మడి జిల్లా విద్యార్థులు వెనుకంజ వేశారు.
ర్యాంకుల సాధనలో వారిదే పైచేయి
ఏపీఈఏపీ సెట్ ఫలితాలు విడుదల
ఇంజనీరింగ్ ర్యాంకుల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థుల వెనుకంజ
అగ్రి, ఫార్మసీల్లో ముందంజ
ఇంటర్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష (ఏపీఈఏపీ సెట్) ఫలితాలు ఎట్టకేలకు బుధవారం విడుదలయ్యాయి. ఇంజనీరింగ్ ఫలితాల్లో అర్హత ర్యాంకుల సాధనలో ఉమ్మడి జిల్లా విద్యార్థులు వెనుకంజ వేశారు. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో మాత్రం ముందంజలో ఉన్నారు. అర్హత, ర్యాంకుల సాధనలో బాలుర కంటే బాలికలు పైచేయి సాధించారు.
ఒంగోలు విద్య, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : ఏపీఈఏపీ సెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు 11,328 మంది ఉమ్మడి జిల్లా విద్యార్థులు దరఖాస్తు చేయగా 10,805 మంది ఎంసెట్ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 7,510 మంది మాత్రమే ఇంజనీరింగ్‌లో ప్రవేశానికి అర్హత సాధించారు. రాష్ట్రంలో సగటున 70.52శాతం మంది అర్హత సాధించగా జిల్లా విద్యార్థులు ఒక శాతం తక్కువగా 69.50శాతం మంది అర్హులయ్యారు. బాలుర కంటే బాలికలు పైచేయి సాధించారు. రాష్ట్ర సగటు రేటు కంటే 1శాతం అదనంగా అంటే 71.56 శాతం మంది బాలికలు అర్హత సాధించారు. బాలురు 3శాతం తక్కువగా కేవలం 67.64శాతం మంది అర్హులయ్యారు. బాలురు 5,678 మందికి 3,841 మంది, బాలికలు 5,127 మందికి 3,669 మంది అర్హత సాధించారు.
అగ్రి, ఫార్మసీ కోర్సులలో..
అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు అర్హత సాధనలో జిల్లా విద్యార్థులు ముందంజలో ఉన్నారు. రాష్ట్రంలో సగటున 89.59శాతం మంది అర్హత సాధించగా జిల్లాలో 2శాతం ఎక్కువగా 91.71శాతం మంది అర్హత సాధించారు. ఈ కోర్సులకు 3,269 మంది దరఖాస్తు చేయగా 2,894 మంది పరీక్షకు హాజరై 2,658 మంది అర్హత పొందారు. ఇక్కడ కూడా బాలికలదే పైయి. బాలికలు రాష్ట్ర సగటు కంటే 3శాతం అధికంగా 92.28 శాతం అర్హులు కాగా బాలురు జిల్లా సగటు కంటే 1.6 శాతం మంది తక్కువగా అర్హత సాధించారు. బాలురు 760కి 685 మంది, బాలికలు 2,138 మందికి 1,973 మంది అర్హత పొందారు.
మహితాచౌదరికి 19వ ర్యాంకు
ఏపీఈఏపీసెట్ ఫార్మసీ, మెడికల్ విభాగంలో ఒంగోలుకు చెందిన మాదాల మహితాచౌదరి రాష్ట్రస్థాయిలో 19వర్యాంకు సాధించి ప్రతిభను చాటారు. ఎంసెట్ పరీక్షల్లో 135.0045 మార్కులతో సత్తాచాటారు. ఆమె తల్లిదండ్రులు మాదాల కోటేశ్వరరావు, అనితలు ప్రభుత్వ ఉపాధ్యాయులు. చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉన్న మహితా మార్కులు సాధనలో అగ్రగామిగా నిలిచారు. నీట్‌లో మంచి మార్కులు సాధించి డాక్టర్ కావాలన్నది ఆమె జీవిత లక్ష్యం. ఆ లక్ష్యసాధనకు ఆమె తల్లిదండ్రులు పూర్తి సహకారం అందిస్తూ ఆమెను విజయవాడలోని కార్పొరేట్ కళాశాలలో చదివిస్తున్నారు. ఇటీవల జరిగిన నీట్ రీఎగ్జామ్ కూడా మహితాచౌదరి బాగా రాసిందని, మంచి మార్కులు వస్తాయని ఆమె తల్లి పీవీఆర్ బాలుర హైస్కూలు సైన్స్ ఉపాధ్యాయురాలు అనిత చెప్పారు. రాష్ట్రస్థాయిలో 19వర్యాంకు సాధించిన మహితాచౌదరిని తల్లిదండ్రులు, సన్నిహితులు, బంధువులు అభినందించారు.