బాలికకు పాముకాటు.. పరామర్శించిన మంత్రి
ABN , Publish Date - Jul 26 , 2026 | 11:46 PM
కొండపి గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కొండపి గ్రామ పంచాయతీలోని ముక్కోడిపాలేనికి చెందిన కడియం మోక్షితను ఆదివారం గురుకుల పాఠశాలలో అన్నం తింటుండగా ఓ పాము కాలుకు చుట్టుకుని కరిచింది. వెంటనే ఆ అమ్మాయి కాలును విదిల్చడంతో పాము పక్కన పడింది.
కొండపి, జూలై26 (ఆంధ్రజ్యోతి) : స్థానిక గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కొండపి గ్రామ పంచాయతీలోని ముక్కోడిపాలేనికి చెందిన కడియం మోక్షితను ఆదివారం గురుకుల పాఠశాలలో అన్నం తింటుండగా ఓ పాము కాలుకు చుట్టుకుని కరిచింది. వెంటనే ఆ అమ్మాయి కాలును విదిల్చడంతో పాము పక్కన పడింది. వెంటనే కేకలు వేయడంతో సిబ్బంది వచ్చి పామును చంపేశారు. ఆ తర్వాత ఆ బాలికను కొండపిలోని సీహెచ్‌సీలో చేర్పించారు. అక్కడ డాక్టర్ నిఖిల్ వైద్య సాయం అందించారు. ఈ క్రమంలో ఆ బాలిక తిన్న అన్నం వాంతి అయ్యింది. విషయం తెలుసుకున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి మర్రిపూడి నుంచి కొండపి వచ్చి సీహెచ్‌సీలో వైద్య సాయం పొందుతున్న మోక్షితతో మాట్లాడారు. డాక్టర్‌ను అడిగి పరిస్థితి తెలుసుకున్నారు. విద్యార్థితో మంత్రి మాట్లాడి ధైర్యం చెప్పారు. ధైర్యంగా ఉన్నావు కదా? తగ్గిపోతుంది.. ఇబ్బంది ఉండదన్నారు. విద్యార్థిని తండ్రి సుబ్రహ్మణ్యంతోనూ మాట్లాడారు. తగ్గే వరకు వైద్యులు సాయం చేస్తారని మంత్రి చెప్పారు.
ఫ వైద్యశాలలో పనుల పరిశీలన..
అనంతరం మంత్రి స్వామి కొండపి సీహెచ్‌సీలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. వైద్యశాలలో నిర్మాణంలో ఉన్న గదులను ప్రహరీ, ఇతర టాయిలెట్లను పరిశీలించారు. కొండపి సీహెచ్‌సీకి అన్ని వసతులు కల్పిస్తున్నామని, ప్రజలు ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లకుండా అనుభవం, అర్హత కలిగిన డాక్టర్‌ల వద్ద సీహెచ్‌సీకి వచ్చి వైద్య సాయం పాందాలని ఈసందర్భంగా విలేకరులతో అన్నారు. ఆయన వెంట టీడీపీ ఒంగోలు పార్లమెంటు ఉపాధ్యక్షుడు గొర్రెపాటి రామయ్య చౌదరి, టీడీపీ మండల పార్టీఅధ్యక్షుడు కొర్రపాటి వసంతరాయుడు, నాయకులు పాల్గొన్నారు.
కదిలిన యంత్రాంగం
కలెక్టర్ రాజాబాబు ఆదేశాలతో సంబంధిత శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులు ఆదివారం రాత్రి కొండపి సీహెచ్‌సీలో వైద్యసాయం పొందుతున్న మోక్షితను పరామర్శించారు. గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ ఎస్. శైలజ, ఎంపీడీవో బి. రామాంజనేయులు, ఎంఈవో కె. సురేఖ, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జయశ్రీ, వైస్ ప్రిన్సిపాల్ వి. జ్యోతి పరామర్శించి వైద్యం గురించి ఆరా తీశారు. మోక్షితను కాటేసిన పామును చంపిన్పటికీ ఇంకా పాములు ఏమైనా ఉన్నాయా? అని అధికారులు పాములు పట్టేవారిని పిలిపించి వారితో అన్ని గదుల్లో, స్కూల్‌లోపల పరిసరాల్లో వెతికించారు.