Share News

పశువులకూ జనరిక్‌

ABN , Publish Date - Jul 16 , 2026 | 02:46 AM

పశువుల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందుకోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కంటైనర్లలో జనరిక్‌ ముందుల దుకాణాలు ఏర్పాటు చేస్తోంది. పశువైద్యశాలల్లో ప్రస్తుతం కొన్నిరకాల మందులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి.

పశువులకూ జనరిక్‌

కంటైనర్లలో దుకాణాల ఏర్పాటు

ఒక్కోదానికి రూ.3.62 లక్షల వ్యయం

పశువైద్యశాలలో దొరకని మందులు తక్కువ ధరకు అందేలా చర్యలు

రెండు జిల్లాలలో 9చోట్ల ఏర్పాటు

ఒంగోలు, జూలై 15 (ఆంధ్ర జ్యోతి) : పశువుల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందుకోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కంటైనర్లలో జనరిక్‌ ముందుల దుకాణాలు ఏర్పాటు చేస్తోంది. పశువైద్యశాలల్లో ప్రస్తుతం కొన్నిరకాల మందులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. అక్కడ లేని వాటిని పశువైద్యులు రాసి ఇస్తున్నారు. పోషకులు వాటిని ప్రైవేటు దుకాణాలలో అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేయాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం తక్కువ ధరకు అలాంటి మందులను పశుపోషకులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. కంటైనర్‌లలో జనరిక్‌ దుకాణాల ఏర్పాటుకు సంకల్పించింది. దీనివలన దుకాణాల కోసం భారీ అద్దెలను నిర్వాహకులు చెల్లించే అవసరం ఉండదు. ప్రభుత్వంపై కూడా భారం లేకుండా డీఆర్‌డీఏ పరిధిలో ఇటీవల ఏర్పాటు చేస్తున్న రైతు సంఘాల చేతికి వాటిని ఇవ్వనున్నారు. ఆ దుకాణాలకు జనరిక్‌ మందుల సరఫరాను పశుసంవర్థక శాఖ పర్యవేక్షణలో ప్రభుత్వమే చేయనుంది. తొలి విడత ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు 9 కంటైనర్‌ దుకాణాలను మంజూరు చేసింది. ప్రకాశంకు ఐదు మంజూరు కాగా ఒంగోలు, కందుకూరు, అద్దంకి, దర్శి, చీమకుర్తిలలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఒంగోలులోని సంతపేటలో ఉన్న పశుసంవర్ధక శాఖ కార్యాలయ ఆవరణలో, ఇతర ప్రాంతాలో పశువైద్యశాలల సమీపంలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

మార్కాపురం జిల్లాకు నాలుగు

మార్కాపురం జిల్లాకు నాలుగు కంటైనర్‌ దుకాణాలు మంజూర య్యాయి. వీటిని మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరులలో ఏర్పాటుచేయనున్నారు. జనరిక్‌ దుకాణాల్లో ప్రైవేటు వైద్యశాలల్లో ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న ధరలకన్నా సుమారు 50శాతం మేర తక్కువకు మందులు పశుపోషకులకు లభించే అవకాశం ఉంది. దుకాణానికి రూ.3,62,250 వ్యయమవుతుందని ప్రభుత్వం లెక్కగట్టింది. ఇందులో లక్షా 50 వేలను సబ్సిడీగా ఇవ్వనుంది. మిగిలిన మొత్తాన్ని దుకాణం నిర్వహణకు డీఆర్‌డీఏ ద్వారా ఎంపికైన ఎఫ్‌పీవో భరించాలి. అలాగే నెలవారీ మందుల కొనుగోలుకు దుకాణాలలో పెట్టుబడి పెట్టి అమ్మకాల నుంచి వచ్చే కమీషన్‌ ద్వారా వాటిని తిరిగి రాబట్టుకోవాలి. ఇప్పటికే ఎఫ్‌పీవోల ఎంపిక కూడా కొలిక్కి వచ్చింది. కంటైనర్‌ దుకాణాల తయారీ ప్రక్రియను పీఆర్‌ అధికారులకు అప్పగించినట్లు సమాచారం. త్వరలో వీటిని ప్రారంభించేందుకు పశుసంవర్థక శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - Jul 16 , 2026 | 02:46 AM