Share News

నేడు సార్వత్రిక సమ్మె

ABN , Publish Date - Feb 12 , 2026 | 02:49 AM

ఉద్యోగ, కార్మిక హక్కుల పరిరక్షణ లక్ష్యంగా దేశవ్యాప్తంగా వివిధ సంఘాలు ఇచ్చిన సార్వత్రిక సమ్మె పిలుపునకు అనుగుణంగా గురువారం జిల్లాలో విభిన్నరంగాల కార్మికులు, ఉద్యోగులు, స్కీం వర్కర్లు సన్నద్ధమయ్యారు. కేంద్ర కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఏటీయూసీ, ఇతర పది కార్మిక సంఘాల వారితో కలిసి వామపక్ష, రైతు సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి.

నేడు సార్వత్రిక సమ్మె

మూతపడనున్న బ్యాంకింగ్‌, బీమా రంగాలు

వేలాది మంది స్కీం వర్కర్లు విధులకు దూరం

సంఘీభావంగా పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులు

భారీ ర్యాలీలు, ధర్నాలు, ఇతర నిరసనలకు కార్మిక సంఘాల ఏర్పాట్లు

ఒంగోలు, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ, కార్మిక హక్కుల పరిరక్షణ లక్ష్యంగా దేశవ్యాప్తంగా వివిధ సంఘాలు ఇచ్చిన సార్వత్రిక సమ్మె పిలుపునకు అనుగుణంగా గురువారం జిల్లాలో విభిన్నరంగాల కార్మికులు, ఉద్యోగులు, స్కీం వర్కర్లు సన్నద్ధమయ్యారు. కేంద్ర కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఏటీయూసీ, ఇతర పది కార్మిక సంఘాల వారితో కలిసి వామపక్ష, రైతు సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రధానంగా కేంద్రం తెచ్చిన నూతన కార్మిక చట్టాల రద్దు, పాత చట్టాల పునరుద్ధరణ, రూ.26వేల కనీస వేతనం అమలు, స్కీం వర్కర్లను ఆయా సంస్థల ఉద్యోగులుగా గుర్తింపు, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల పర్మినెంట్‌, కేంద్ర, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతన సవరణ తదితర డిమాండ్‌లు ఉన్నాయి. రైతు చట్టాలు, నూతన ఉపాధి చట్టం రద్దు కోరుతూ వామపక్ష, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా సమ్మెకు మద్దతు ప్రకటించాయి. జిల్లాలో ఏఐటీయూసీ, సీఐటీయూ వాటి అనుబంధ వివిధ సంఘాలు రెండు మాసాలుగా సమ్మె విజయవంతానికి వివిధ కార్యక్రమాలు నిర్వహించాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌, బీమా వంటి కేంద్రప్రభుత్వ రంగ సంస్థలలో సమ్మె సంపూర్ణంగా జరిగే అవకాశం ఉంది. స్కీం వర్కర్లలో ముఖ్యమైన అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, మునిసిపల్‌ కార్మికులు వంటి వారు పాల్గొంటున్నారు. అసంఘటిత రంగంలో ఆయా ప్రాంతాల్లో ఉండే హమాలీలు, మోటారు రంగ కార్మికులు, వివిధ ఫ్యాక్టరీలు, గనులు, ఇతర పరిశ్రమల్లో పనిచేసే వేలాది మంది కూడా సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఆయారంగాల కార్మికులు, ఉద్యోగులు, శ్రామిక జనం విధులు బహిష్కరించి పెద్దఎత్తున వివిధ పట్టణాలు, మండల కేంద్రాల్లో భారీ ర్యాలీలు, ధర్నాలు, ఇతర రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. మరోవైపు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరఫున ఏపీఎన్‌జీవో ఇతర ఉద్యోగ సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్రదర్శనలు, ఇతర రూపాల్లో ఆందోళనలకు వారు సన్నద్ధమయ్యారు.

Updated Date - Feb 12 , 2026 | 02:49 AM