గ్యాస్ ట్రబుల్
ABN , Publish Date - Mar 14 , 2026 | 03:01 AM
వంట గ్యాస్ వినియోగదారులకు కష్టాలు మొదలయ్యాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పరిస్థితి రోజురోజుకూ జటిలమవుతోంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను కంపెనీలు పూర్తిగా నిలిపివేశాయి.
వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం
గృహ వినియోగదారులకూ ఆంక్షలు
ఇప్పటికే పెరిగిన బుకింగ్ గడువు
రెండో కనెక్షన్ ఉన్న ఇంటికి ఒకటే బండ
రోజురోజుకూ మారుతున్న నిబంధనలు
పెరిగిన బుకింగ్‌లు.. చేతులెత్తేస్తున్న ఏజెన్సీలు
ఆందోళనలో ప్రజలు
మార్కాపురం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): వంట గ్యాస్ వినియోగదారులకు కష్టాలు మొదలయ్యాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పరిస్థితి రోజురోజుకూ జటిలమవుతోంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను కంపెనీలు పూర్తిగా నిలిపివేశాయి. ఏజెన్సీలకు సరఫరాలోనూ కోత విధించాయి. గ్యాస్ బుకింగ్ గడువును కూడా పెంచాయి. తాజాగా మరో నిబంధనను ఏజెన్సీలు విధించాయి. రెండు కనెక్షన్‌లు ఉన్న గృహ వినియోగదారులకు ఒక్క సిలిండర్ మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బుకింగ్‌లు పెరిగాయి. దీంతో ఏజెన్సీలు చేతులెత్తేశాయి. కొన్నిచోట్ల గ్యాస్ బుకింగ్ నంబర్లు కూడా పనిచేయడం లేదు. ఈ పరిస్థితి గృహ వినియోగదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
మార్కాపురం జిల్లాలో 3,22,279 లక్షల కనెక్షన్‌లు
మార్కాపురం జిల్లాలో మొత్తం 25 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో 3,22,279 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్‌లు ఉన్నాయి. మరో 2,700 నుంచి 3 వేల లోపు వాణిజ్య సిలిండర్‌లు ఉన్నాయి. మొదట వాణిజ్య గ్యాస్‌పై ప్రభావం పడింది. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దాదాపు ఐదు రోజుల క్రితమే ఏజెన్సీలకు సరఫరా పూర్తిగా కంపెనీలు నిలిపివేశాయి. దీంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్ముందు గ్యాస్ అందుబాటులో ఉండదేమోనన్న ఆందోళన గృహ వినియోగదారుల్లోనూ మొదలైంది. దీంతో గ్యాస్ బుకింగ్ చేసుకునే వారి సంఖ్యరోజురోజుకూ పెరుగుతోంది. వీరికి సిలిండర్‌లు అందడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అలాగే కంపెనీలు బుకింగ్ గడువును కూడా పెంచాయి. గతంలో పట్టణ ప్రాంతాల్లో 15 రోజులకు ఒకసారి గ్యాస్ బుక్ చేసుకునే అవకాశం ఉండేది. దాన్ని 25 రోజులు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 48రోజులకు పెంచారు. దీనికితోడు గ్యాస్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి నిత్యం ఏదో ఒక ప్రకటన, హెచ్చరిక వస్తుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
రెండు కనెక్షన్‌లు ఉన్నా ఒక్కటే ఇస్తాం
తాజాగా మరో నిబంధనను గ్యాస్ కంపెనీలు ఏజెన్సీలకు చేరవేసినట్లు చెబుతున్నారు. రెండు కనెక్షన్‌లు ఉన్న వారు రెండు బుక్ చేసుకున్నా ఒక్కటే ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. జిల్లాలో దీపం, ఉజ్వల్ లాంటివి కాకుండా జనరల్ గ్యాస్ కనెక్షన్‌లు 1,25,808 ఉన్నాయి. ఇదే జనరల్ ఉన్న 76,878 మంది డబుల్ కనెక్షన్‌లు కలిగి ఉన్నారు. వారికి కేవలం ఒక్క సిలిండర్ మాత్రమే ఇవ్వనున్నారు. దీనివల్ల కొరతను, ఒత్తిడిని కొంతమేర తగ్గించవచ్చనే ఆలోచనలో కంపెనీలు ఉన్నట్లు చెబుతున్నారు.
24,634 సీఎస్‌ఆర్ కనెక్షన్‌లకు తక్షణమే సరఫరా
జిల్లాలో సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ) కనెక్షన్‌లు 24,634 ఉన్నాయి. ఇవి గ్యాస్ కంపెనీలు ప్రత్యేకంగా ఇచ్చేవి. మహిళా స్వయం సహాయక సంఘాలు, ఆశ్రమాలు, పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామీణ పేద కుటుంబాల్లో కొందరికి వీటిని ఇస్తారు. ఇలాంటి కనెక్షనలకు నిలపకుండా అవసరం మేరకు తక్షణమే సరఫరా చేయాలని ఏజెన్సీ నిర్వాహకులకు ఆదేశాలు అందాయి. భవిష్యత్తులో బండ కష్టాలు ఇంకా పెరిగితే ఇలాంటి వాటిపై కూడా ఈ ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.