త్వరలో గ్యాస్ కష్టాలకు చెక్
ABN , Publish Date - Apr 22 , 2026 | 02:14 AM
గ్యాస్ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధం కారణంగా వంట గ్యాస్ కొరత ఏర్పడిన విషయం విదితమే. రెండు నెలలుగా సిలిండర్ల కోసం ప్రజలు అగచాట్లు పడుతున్నారు. హోటల్స్, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు సగానికిపైగా మూతపడ్డాయి. ప్రతి ఇంటా వంట గ్యాస్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది.
ఒంగోలులో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్
వంట గ్యాస్ కొరతతో ప్రత్యామ్నాయంగా ఏర్పాటు
టెండర్లు ఆహ్వానించిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్
తొలిదశలో హోటల్స్‌కు, ఆ తర్వాత గృహాలకు సరఫరా
ఒంగోలు కార్పొరేషన్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి) : గ్యాస్ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధం కారణంగా వంట గ్యాస్ కొరత ఏర్పడిన విషయం విదితమే. రెండు నెలలుగా సిలిండర్ల కోసం ప్రజలు అగచాట్లు పడుతున్నారు. హోటల్స్, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు సగానికిపైగా మూతపడ్డాయి. ప్రతి ఇంటా వంట గ్యాస్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఈనేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలోని ఐదు నగరాలలో కంప్రెస్డ్ గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటుకు సిద్ధమైంది. అందులో ఒంగోలుకు అవకాశం ఇచ్చింది. ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌కి అప్పగించగా పీపీపీ (ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం) విధానంలో ఏర్పాటు చేయనున్నారు. ఒంగోలు కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో అందుకు సంబంధించిన చర్యలను చేపట్టారు. నగరంలో సేకరించిన చెత్త డంపింగ్ చేసే కేంద్రమైన గుత్తికొండవారిపాలెంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
రోజుకు 25 టన్నుల చెత్త అవసరం
ఒక ప్లాంట్ నిర్వహణ కోసం రోజుకు 25 టన్నుల వ్యర్థాలు అవసరమవుతాయి. తొలుత హోటళ్లు, మార్కెట్‌లు, హాస్టళ్లు కమ్యూనిటీ హాళ్లు, టౌన్‌షిప్‌లు, అపార్ట్‌మెంట్‌ల నుంచి ఆహారం, కూరగాయల వ్యర్థాలను ప్లాంట్‌కు తరలిస్తారు. టౌన్‌షిప్ నిబంధనల ప్రకారం ఘనవ్యర్థాల నిర్వహన విధానం 2026 అనుసరించి ప్రతిరోజూ వంద కిలోల తడి వ్యర్థాలను ఎరువుల కింద తప్పనిసరిగా తయారుచేయాల్సి ఉంటుంది ఈ విధానంలో గ్యాస్‌ను ఉత్పత్తి చేసి మొదట హోటళ్లకు అందించనున్నారు. ఆతర్వాత దశలవారీగా గృహ వినియోగ అవసరాలకు కూడా సరఫరా చేయనున్నారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్‌ల ఏర్పాటు ద్వారా నగరాల్లో వ్యర్థాల సమస్యకు పరిష్కారం లభించడంతోపాటు ఎల్‌పీజీ వినియోగం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అలాగే నగరంలో సేకరించే చెత్తను డంపింగ్ యార్డులకు తగ్గించి నేరుగా కంప్రెస్డ్ గ్యాస్ ప్లాంట్‌లకు తరలించనున్నారు.
రూ.59.63 కోట్లవ్యయంతో నిర్మాణం
కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్‌లను రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం రూ.59.63 కోట్లు ఖర్చుచేయనున్నారు. ఈ మొత్తంలో రూ.12.50 కోట్లు కేంద్రం వాటాగా చెల్లిస్తుంది. రూ.8.30 కోట్లు రాష్ట్రప్రభుత్వం సమకూర్చనుంది. రాష్ట్రంలోని మునిసిపల్ కార్పొరేషన్ల నుంచి మరో రూ.17 కోట్లు అందించాల్సి ఉంటుంది. ప్లాంట్‌ల నిర్వహణ సంస్థలు మిగిలిన రూ.21.83 కోట్లు ఖర్చు చేస్తాయి. ప్లాంట్ల ఏర్పాటుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా పీపీపీ పద్ధతిన ఇప్పటికే టెండర్లను ఆహ్వానించారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.