లోకేష్ నేతృత్వంలో మరింత బలోపేతం
ABN , Publish Date - Apr 30 , 2026 | 02:55 AM
యువనేత నారా లోకేష్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమై ముందుకు సాగుతుందని ఉమ్మడి జిల్లా టీడీపీ కీలక నేతలు ఆకాంక్షించారు. ఇటీ వల ప్రకటించిన జాతీయ, రాష్ట్ర కమిటీల ప్రమాణస్వీకారం బుధవారం మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. కొత్త కమిటీలలోని సభ్యులతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేయించారు.
ఉమ్మడి జిల్లా నేతల ఆకాంక్ష
యువనేతను కలిసి శుభాకాంక్షలు
కొలువుదీరిన టీడీపీ కొత్త కమిటీలు
రెండు జిల్లాల నుంచి స్థానం దక్కించుకున్న తొమ్మిది మంది ప్రమాణం
ఒంగోలు, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): యువనేత నారా లోకేష్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమై ముందుకు సాగుతుందని ఉమ్మడి జిల్లా టీడీపీ కీలక నేతలు ఆకాంక్షించారు. ఇటీ వల ప్రకటించిన జాతీయ, రాష్ట్ర కమిటీల ప్రమాణస్వీకారం బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. కొత్త కమిటీలలోని సభ్యులతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేయించారు. ఇందులో టీడీపీ జాతీయ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. ఆ కార్యక్రమానికి జిల్లా నుంచి పరిమితంగానే అనుమతించారు. ప్రమాణస్వీకారం చేసే కొత్త కమిటీల్లో స్థానం పొందిన సభ్యులతోపాటు ఆయా జిల్లాల్లోని పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వంటి వారిని మాత్రమే ఆహ్వానించారు. అలా కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్యనేతలైన మంత్రులు డాక్టర్ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్.విజయకుమార్, ఏలూరి సాంబశివరావు, కందుల నారాయణరెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, వైపాలెం ఇన్‌చార్జి గుడూరి ఎరిక్షన్‌బాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారంతా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ సారథ్యంలో టీడీపీ మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు. జాతీయ, రాష్ట్ర కమిటీల్లో ప్రకాశం, మార్కాపురం జిల్లాల నుంచి స్థానం దక్కించుకున్న తొమ్మిది మంది నేతలు కూడా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. జాతీయ ఉపాధ్యక్షునిగా నూకసాని బాలాజీ, మూడు జిల్లాల కోఆర్డినేటర్‌గా దామచర్ల సత్య, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, రాష్ట్ర కార్యదర్శులుగా పి.రమేష్, అడకా స్వాములు, కె.కుసుమకుమారి, వక్కలగడ్డ మల్లికార్జున్, గునుపూడి భాస్కర్, మీగడ ఓబుల్‌రెడ్డిలు నియమితులు కాగా వారంతా కూడా బాధ్యతలు స్వీకరించారు.