Share News

ధర మరింత కోత

ABN , Publish Date - Aug 08 , 2026 | 02:54 AM

పొగాకు మార్కెట్‌ పరిస్థితి మరింత దిగజారుతోంది. ఎలాగైనా సరే గాడిలో పెడదామని అటు ప్రభుత్వం, ఇటు బోర్డు తీసుకుంటున్న చర్యలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వడం లేదు. అంతా వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారింది.

ధర మరింత కోత
ట్రేడర్స్‌తో సమావేశమైన పొగాకు బోర్డు చైర్మన్‌, ఈడీ

కిలో రూ.140కి పొగాకు కనిష్ఠ ధర

అయినా ఆగని నోబిడ్‌లు

దక్షిణాదిలో సగటున 30శాతం

వెల్లంపల్లి, కనిగిరిలో 45శాతంపైనే

పొదిలిలో ఆగి సాగిన వేలం

మార్కెట్‌ పరిస్థితిపై ట్రేడర్స్‌తో బోర్డు చైర్మన్‌, ఈడీ సమీక్ష

పొగాకు మార్కెట్‌ పరిస్థితి మరింత దిగజారుతోంది. ఎలాగైనా సరే గాడిలో పెడదామని అటు ప్రభుత్వం, ఇటు బోర్డు తీసుకుంటున్న చర్యలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వడం లేదు. అంతా వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారింది. కనిష్ఠ ధరలను తగ్గించినా సరే నోబిడ్లు ఆగడం లేదు. పైగా కొనుగోలు పరిమాణం కూడా పెరగలేదు. దీంతో అటు ధరలు లేక, ఇటు కొనుగోళ్లు అంతంతమాత్రంగా ఉండటంతో రైతుల్లో ఆందోళన పెరిగింది. మార్కెట్‌ తీరు ఇలాగే ఉంటే ఇక తమ పరిస్థితి ఏమిటంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒంగోలు, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : పొగాకు మార్కెట్‌లో నోబిడ్‌ల తగ్గింపు లక్ష్యంగా బోర్డు అధికారులు కనిష్ఠ ధరలు తగ్గించి వేస్తున్నా కొనుగోళ్లకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. దక్షిణాదిలో శుక్రవారం వేలం తీరును చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. మూడురోజుల క్రితం వరకు కిలో గరిష్ఠ ధర రూ.250, కనిష్ఠ ధర రూ.160 ఉండగా మార్కెట్‌ను చక్కదిద్దే చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల జోక్యం అనంతరం గ్రేడ్‌ల వారీ బేస్‌ ధరలను నిర్ణయించారు. ఆ ప్రకారం మేలురకం కిలో రూ.230, మీడియం గ్రేడ్‌ రూ.190, ఆఫ్‌స్టైల్‌ రకం రూ.130, లోగ్రేడ్‌ రూ.110కి తగ్గకుండా కొనాలి. దానిని ఆసరా చేసుకొని గతంలో ఉన్న కిలో గరిష్ఠ ధరలను అధికారులు తగ్గిస్తున్నారు. తద్వారా నోబిడ్‌ బేళ్లు తగ్గేలా చూసి త్వరగా కొనుగోలు చేయించాలన్న లక్ష్యంతో ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా బుధ, గురువారాల్లో పలు వేలం కేంద్రాల్లో కిలోకు రూ.10 తగ్గించి కనిష్ఠ ధర రూ.150గా వేలం నిర్వహించారు. శుక్రవారం మరో రూ.10 తగ్గించి రూ.140గా బిడ్డింగ్‌ చేశారు. అయినా నోబిడ్‌లు తగ్గకపోగా గురువారం కన్నా శుక్రవారం పెరిగాయి. దక్షిణాదిలోని రెండు రీజియన్ల పరిధిలో ఉన్న 11 వేలం కేంద్రాల్లో గురువారం 28.16 శాతం నోబిడ్‌లు జరిగాయి. శుక్రవారం మరికొంత పెరిగి 30శాతం నోబిడ్‌ అయ్యాయి. మొత్తం 11 కేంద్రాలకు శుక్రవారం వేలానికి 8,351 బేళ్లను పెట్టగా 5,347 కొనుగోలు చేసిన బయ్యర్లు వివిధ కారణాలతో 3,004 తిరస్కరించారు. అందులో 2,495 బేళ్లు అధికారులు సూచించిన రేట్లకు బయ్యర్లు కొనుగోలు చేయక నోబిడ్‌ అయ్యాయి. అంటే వేలంకు తెచ్చిన బేళ్లలో 30శాతం నోబిడ్‌ కాగా, మరో 6శాతం ఇతర కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. అలా వేలానికి తెచ్చిన బేళ్లలో సుమారు 36శాతం వెనక్కు వెళ్లిపోయాయి. 64శాతంను కొనుగోలు చేశారు. రెండు, మూడు రోజుల వరకు ఉన్న కనిష్ఠ ధర కిలో రూ.160 నుంచి శుక్రవారం రూ.140కి తగ్గించినా భారీగానే బేళ్లు తిరస్కరణకు గురవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వివిధ వేలం కేంద్రాల్లో నోబిడ్‌ల తీరును పరిశీలిస్తే కనిగిరిలో 47.96శాతం, వెల్లంపల్లిలో 45.12శాతం జరిగాయి. పొదిలిలో 38.17శాతం, కొండపిలో 33.96శాతం నోబిడ్‌ అయ్యాయి. పొదిలిలో కొనుగోళ్ల తీరుపై రైతులు నిరసనతో కొంతసేపు వేలం ఆగిపోగా అధికారుల జోక్యంతో తిరిగి కొనసాగింది.

కంపెనీల ప్రతినిధులతో సమావేశం

తాజాగా మార్కెట్‌ పోకడ, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల జోక్యం అనంతరం పరిస్థితులపై వ్యాపారులతో పొగాకు బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌కుమార్‌, ఈడీ విశ్వశ్రీ శుక్రవారం గుంటూరులో సమావేశం నిర్వహించారు. పలు ప్రధాన కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వాల సూచ నలకు అనుగుణంగా కొనుగోళ్లు కొనసాగేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం. మార్కెట్లో చురుగ్గా పాల్గొని త్వరితగతిన వేలం పూర్తికి సహకరించాలని బోర్డు అధికారులు ఈ సందర్భంగా వ్యాపారులను కోరినట్లు తెలి సింది. బోర్డు సెక్రటరీ దివి వేణుగోపాల్‌ ఇతర అధికారులు, ఐటీసీ, జీపీఐ వంటి కీలక కంపెనీలతోపాటు ఎక్స్‌పోర్టు కంపెనీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - Aug 08 , 2026 | 02:54 AM