నిధుల సాధనే లక్ష్యం
ABN , Publish Date - Feb 11 , 2026 | 02:12 AM
కీలకమైన ఘట్టం.. శాసనసభ్యులంతా కలిసి గళం విప్పి లక్ష్యం మేరకు నిధులు సాధించాల్సిన తరుణం. శాసనభ వార్షిక బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఏడాదికి మూడుసార్లు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా బడ్జెట్ సెషన్ అత్యంత కీలకమైనది.
గళం విప్పితేనే ఫలితం
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
14న వార్షిక బడ్జెట్ ప్రతిపాదన
ఉమ్మడి జిల్లాలో సాగునీటి వనరులకు రూ.2వేల కోట్లు అవసరం
యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీ, ఫిషింగ్ హార్బర్,
పోర్టు, ఎయిర్‌పోర్టులు ప్రధానాంశాలు
పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహం అవసరం
పరిశ్రమల కోసం దొనకొండ ఎదురుచూపు
తాగునీరు, రోడ్లు, ఇతర మౌలిక రంగాల
పనులు, పెండింగ్ బిల్లులు రాబట్టాలి
డెయిరీ పునరుద్ధరణ, సహకార సంస్థల్లో
అవినీతి అంశాలపైనా దృష్టి సారించాలి
కీలకమైన ఘట్టం.. శాసనసభ్యులంతా కలిసి గళం విప్పి లక్ష్యం మేరకు నిధులు సాధించాల్సిన తరుణం. శాసనభ వార్షిక బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఏడాదికి మూడుసార్లు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా బడ్జెట్ సెషన్ అత్యంత కీలకమైనది. శాఖల వారీ నిధుల కేటాయింపు, ప్రత్యేక ప్రాజెక్టుల మంజూరు వంటి నిర్ణయాలు ఈ సమావేశాల్లోనే జరుగుతాయి. అలాంటి సందర్భంగా జిల్లాలో అసంపూర్తి పథకాలు, పెండింగ్, కొత్త ప్రాజెక్టులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. అవసరమైన నిధులు రాబట్టడం ద్వారా వాటి పూర్తికి, పురోగతికి ప్రజాప్రతినిధులు కృషిచేయాల్సిన అవసరం ఉంది.
ఒంగోలు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి) : కీలకమైన శాసనసభ బడ్జెట్ సమావే శాలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈనెల 14న అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి ఇరిగేషన్ బడ్జెట్‌ను సంబంధిత మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేకంగా ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అయితే ఈ విడత సమావేశాల సందర్భంగా ఉమ్మడి జిల్లా పరిధిలో కొత్త ప్రాజెక్టుల కన్నా ఇప్పటికే మంజూరైన, పురోగతిలో ఉన్న వాటికి నిధులు సాధించి వాటిని పూర్తిచేయడంపైన శాసనసభ్యులంతా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. అందుకోసం అసెంబ్లీ లోపల, వెలుపల ప్రజాప్రతినిధులంతా ఉమ్మడిగా గళం విప్పాలి. ప్రధాన అంశాలను పరిశీలిస్తే.. సాగునీటి పథకాలు కీలకం. ఉమ్మడి జిల్లాలో వెలిగొండ, పాలేరు రిజర్వాయర్, కొరిశపాడు ఎత్తిపోతల పథకాలను ఇటీవల సమీక్షలో సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ప్రాజెక్టులుగా ప్రకటించారు.
ప్రాజెక్టులకు నిధులు కావాలి
వెలిగొండ తొలిదశ పూర్తికి ప్రభుత్వపరంగా గట్టి ప్రయత్నం సాగుతోంది. అయితే అవసరమైన స్థాయిలో నిధులు కేటాయించలేకపోతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం వెయ్యి నుంచి రూ.1,200 కోట్లు అవసరం కాగా రూ.400 కోట్లలోపుగానే ఇచ్చారు. వీటితో పెండింగ్ బిల్లులు క్లియర్ చేయగలిగారు. రానున్న ఏడాది లక్ష్యానికి అనుగుణంగా ఆ ప్రాజెక్టు ముందుకు సాగాలంటే రూ.వెయ్యి కోట్లు నిర్వాసితుల పునరావాసానికి, మరో ఎడెనిమిది వందల కోట్లు ఫీడర్ కాలువ ఆధునికీకరణ పనులకు అవసరం. ఇతర సాగునీటి ప్రాజెక్టులకు కలిపి మొత్తం రూ.2వేల కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదించారు. ఇక ఇంటింటికీ తాగునీరు అందించే జలజీవన్ మిషన్ పనులకు నిధుల కొరత వెంటాడుతోంది. ఇటీవల రోడ్లకు కొంతమేర నిధులు ఇచ్చినా అవి పాక్షికమే. భారీగా ఆ రంగానికి నిధులు కావాలి. అలాగే యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీ నిర్మాణాలు అత్యంత అవసరం. ప్రజలను ఊరిస్తున్న కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం పోర్టు విస్తరణ, ఒంగోలు ఎయిర్‌పోర్టు నిర్మాణాలపై ప్రభుత్వం మరింత స్పష్టత ఇచ్చి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది.
ఉపాధి మార్గాల పెంపుపై దృష్టి
ఉమ్మడి జిల్లాలో పారిశ్రామికరంగ అభివృద్ధి, ఉపాధి మార్గాల పెంపు కోసం ఉద్దేశించిన దొనకొండ కారిడార్, కనిగిరి నిమ్జ్‌లు పరిశ్రమల కోసం ఎదురుచూస్తున్నాయి. ఎంఎస్‌ఎంఈ పార్కుల పరిస్థితి కూడా అలాగే ఉంది. కనిగిరి ప్రాంతంతోపాటు ఇతరచోట్ల ప్రతిపాదించిన సీబీజీ ప్లాంట్ల ఏర్పాటు కూడా అవసరమైన స్థాయిలో ముందుకు కదలడం లేదు. ఇక విద్య, వైద్యం, విద్యుత్, వ్యవసాయ అనుబంధ రంగాలు, సంక్షేమం, ప్రత్యేకించి పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులకు పెద్దఎత్తున నిధులు అవసరం. గతంలో వలే ప్రభుత్వం నుంచి ఆయా పనులకు నిధులు సకాలంలో అందక టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఇక ఉపాధి పథకం ద్వారా గ్రామాల్లో చేసిన రోడ్లు, డ్రెయిన్‌లు, ఇతర పనులు, ఇరిగేషన్ ఇతర శాఖల ద్వారా చేసిన పనులకు బిల్లులు రాక పనులు చేసిన అధికార పార్టీ నేతలు లబోదిబోమంటున్నారు. మరోవైపు వ్యవసాయం, పాడి పరిశ్రమలు ఒడిదొడుకుల్లో సాగుతున్నాయి. కీలకమైన శనగ పంటకు ధరలు లేక సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. సిగరెట్లపై జీఎస్టీ 40 శాతానికి పెంపుతో పొగాకు ధరలపై రైతులు ఆందోళన చెందుతున్నారు.
అక్రమార్కులపై చర్యలేవీ?
ఉమ్మడి జిల్లాకు తలమానికమైన ఒంగోలు డెయిరీ పునరుద్ధరణపై ప్రభుత్వ పెద్దల హామీ ఆచరణలోకి వచ్చే దాఖలాలు కనిపించడం లేదు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు ప్రతిపాదించిన ముఖ్యమైన పనులకు నిధులు రాక నీరసిస్తున్నాయి. మరోవైపు గత వైసీపీ పాలనలో జిల్లాలో వివిధ స్థాయి సహకార సంస్థలు, డ్వామా వంటి శాఖల్లో అవినీతి అడ్డగోలుగా సాగింది. వాటిపై చేపట్టిన విచారణలు అడుగు ముందుకు పడటం లేదు. అక్రమార్కులపై చర్యలు శూన్యమయ్యాయి. ఇలాంటి అంశాలన్నింటిపైనా బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇటు శాసనసభలోనూ, అటు శాసనమండలిలోనూ అలాగే సభల వెలుపల అయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారుల వద్ద ఉమ్మడిగా గళం విప్పి నిధులు సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అసెంబ్లీ సమావేశాల వీక్షణకు 150 మంది విద్యార్థులు
శాసనసభ సమావే శాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు జిల్లాలోని 150 మంది విద్యార్థు లకు అవకాశం లభించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సి.వి.రేణుక తెలిపారు. ఈనెల 27న వీరు అసెంబ్లీకి వెళ్తారని ఆమె చెప్పారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్న తీరు, అక్కడ ప్రస్తావిస్తున్న అంశాలు తదితర విషయాలను విద్యార్థులు స్వయంగా తెలుసుకు నేందుకు వీలుగా వారికి శాసనసభ గ్యాలరీ ద్వారా వీక్షించేందుకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు అవకాశం కల్పించారు. కొత్తపట్నం, ఈతముక్కల, కారుమూడివారిపాలెం, శింగరాయకొండ (బాలికలు), మేదరమెట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు అసెంబ్లీ సమావేశాలను వీక్షించేందుకు ఆసక్తి చూపారు. దీంతో ఈ పాఠశాలల నుంచి 150మందికి అవకాశం లభించింది. 27వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సమావేశాన్ని వీరు చూస్తారు. ఆరోజు విద్యార్థులందరినీ ప్రత్యేక బస్సులలో అసెంబ్లీకి తీసుకెళ్తారు. వారు సమావేశాలు చూసాక తిరిగి ఇళ్లకు చేరుస్తారు. ప్రతి బస్సుకు ఒక మహిళ, పురుష టీచర్లను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తున్నారు.