Share News

రెండో రోజూ ఉత్సాహంగా..

ABN , Publish Date - Sep 09 , 2026 | 01:51 AM

తెలుగుదేశం పార్టీ నిర్వహించిన లీడర్‌షిప్‌ కాంక్లేవ్‌లో రెండో రోజైన మంగళవారం కూడా ఉమ్మడి జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధులు, నేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ కార్యక్రమాలు కొనసాగించడం, ప్రజాసమస్యల పరిష్కారం, ప్రత్యర్థి పార్టీ ఫేక్‌ ప్రచారాన్ని తిప్పికొట్టడం, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అవగాహన, విస్తృతంగా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా భవిష్యత్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయడంపై ముఖ్య నేతలతో ఈ కాంక్లేవ్‌ను టీడీపీ నిర్వహించింది.

రెండో రోజూ ఉత్సాహంగా..
ఇన్‌చార్జి మంత్రి ఆనం నివాసంలో రెండు జిల్లాల కీలక నేతలు, పరిశీలకులు

లీడర్‌షిప్‌ శిక్షణ కాంక్లేవ్‌కు హాజరైన ఉమ్మడి జిల్లా టీడీపీ కీలక నేతలు

‘స్థానిక’ ఎన్నికలు, ఇతర అంశాలపై చంద్రబాబు, లోకేష్‌ దిశానిర్దేశం

ఎమ్మెల్యేలతో ఇన్‌చార్జి మంత్రి ఆనం విందు భేటీ, పలు అంశాలపై చర్చ

ఒంగోలు, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ నిర్వహించిన లీడర్‌షిప్‌ కాంక్లేవ్‌లో రెండో రోజైన మంగళవారం కూడా ఉమ్మడి జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధులు, నేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ కార్యక్రమాలు కొనసాగించడం, ప్రజాసమస్యల పరిష్కారం, ప్రత్యర్థి పార్టీ ఫేక్‌ ప్రచారాన్ని తిప్పికొట్టడం, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అవగాహన, విస్తృతంగా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా భవిష్యత్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయడంపై ముఖ్య నేతలతో ఈ కాంక్లేవ్‌ను టీడీపీ నిర్వహించింది. మంగళ గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమ, మంగళవారాల్లో దీనిని నిర్వహించగా ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, బీఎన్‌ విజయకుమార్‌, ఇంటూరి నాగేశ్వరరావు, డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, ఇన్‌చార్జిలు గొట్టిపాటి లక్ష్మి, ఎరిక్షన్‌బాబు, ఎమ్మెల్సీ శ్రీకాంత్‌, కార్పొరేషన్‌ చైర్మన్లు దామచర్ల సత్య, నూకసాని బాలాజీ వంటి ముఖ్యనేతలు పాల్గొన్నారు. తొలిరోజు మంత్రులు స్వామి, రవికుమార్‌తమ అనుభవాలను కాంక్లేవ్‌లో పంచుకున్నారు. ఇదిలా ఉండగా వివిధ అంశాలపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారా లోకేష్‌లు నేతలకు దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయాలతోపాటు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గతం కన్నా మెరుగైన ఫలితాలు సాధించాలని అందుకు అభివృద్ధి పనులు సాధనంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలతో మమేకంతోపాటు కూటమి పార్టీల మధ్య సమన్వయం, ప్రజాసమస్యల పరిష్కారం, సుస్థిర అభివృద్ధి ప్రణాళిక అమలుకు సీఎం సూచనలు చేశారు. అలాగే నియోజకవర్గంలో ఎమ్మెల్యేల దృష్టికి వచ్చే తక్షణ సమస్యల పరిష్కారానికి నియోజకవర్గానికి రూ.కోటి ప్రభుత్వం నుంచి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కాగా రెండు రోజులు కాంక్లేవ్‌లో ఉమ్మడి జిల్లా నేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇదిలాఉండగా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఉమ్మడి జిల్లా ఎమ్మల్యేలు, ఇతర నేతలతో సోమవారం రాత్రి విందు భేటీ నిర్వహించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, వాటిలో గెలుపు, భాగస్వామ్య పార్టీలతో సమన్వయంతోపాటు పలు ఇతర అంశాలపై ఆ భేటీలో చర్చ సాగినట్లు సమాచారం. రెండు జిల్లాల పరిశీలకులైన ఎమ్మెల్సీలు భూమిరెడ్డి గోపాల్‌రెడ్డి, బీటీ నాయుడులు కూడా భేటీ పాల్గొన్నారు.

Updated Date - Sep 09 , 2026 | 01:51 AM